Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
  • Parhaat jättipottikasinot ilman bonusehtoja ja rajoituksia
  • Best Video poker Web sites to have 2025 Courtroom Electronic poker Video game
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

బతుకే ఓ కయ్యం

TelanganapressBy TelanganapressJanuary 9, 2024No Comments

కాలివేళ్లతో రచనా వ్యాసంగాన్ని కొనసాగించిన అద్భుత రచయిత్రి బూర రాజేశ్వరి. ఇటీవల కన్నుమూసిన ఈ కవయిత్రి జీవితం ఆధారంగా ప్రాణం పోసుకున్న కథ..
‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజాగ్రంథాలయం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2021’లో రూ.వెయ్యి బహుమతి పొందిన కథ.

ఓ రోజు సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌ తేజ గారి ఇంటర్వ్యూ టీవీలో వచ్చింది. ‘కథ, పాట, పద్యం, కవిత్వం.. మానవత్వం ఉన్న మనిషిగా తీర్చిదిద్దుతయి. సమాజహితమే సాహిత్యం! మానసిక ధైర్యాన్నిచ్చి ముందుకు నడిపిస్తూ.. జీవిత సాఫల్యాన్ని పూర్తి చేసేది సాహిత్యం!’ అని ఆ ఇంటర్వ్యూలో చెప్పారాయన. ఆ మాటలకు బూర రాజేశ్వరి ప్రభావితమైంది. కాళ్లతోనే కలం, కాగితం అందుకుంది. మనోధైర్యాన్నిచ్చే కవిత్వం రాయడం మొదలుపెట్టింది. అంగవైకల్యాన్ని లెక్క చేయలేదు. దృఢసంకల్పంతో ముందుకు దూసుకుపోయింది. అందరి మనసులపై కైతల బాణాల్ని ఎక్కుపెట్టింది. గురిచూసి వదలడం మొదలుపెట్టింది.

‘అయ్యలారా! ఆలోచించండి! అన్ని జీవులలో మనిషి పుట్టుక గొప్పది. అమూల్యమైనది. శరీరంల మొస ఉంటేనే.. ఏదైనా సాధించవచ్చు. ఊపిరి వదలగానే ఈ శరీరం ఉబ్బి.. గబ్బు వాసనైతది. మద్యానికి బానిసలై, అప్పుల ఊబితో ఉరితాళ్లకు ఊగులాడకుండ్రి. ఆకులు, అలములు, రేగడి మట్టిని తిని బతికిండ్రు ఓనాడు. కష్టం, సుఖం అన్నీ కలిస్తేనే అసలైన జీవితం. మీ పెళ్లాం, పిల్లగాండ్లు తెర్లు ఐతరు. ఒక్కసారి నన్ను చూడండ్రి! అవిటి బతుకైనా.. ఏదో సాధించాలని, నాలో తపన ఉంది. అన్ని అవయవాలూ బాగుండి పిరికోళ్లయి సస్తుండ్రు ఎంతోమంది. నాకు ఎన్నో కోరికలున్నా.. అన్నీ తీరుతయా? సావు పరిష్కారం కాదు! బతికి గెలుద్దాం! ఆత్మతృప్తితో ఆనందాలే చిందిస్తూ, అందరి కోసం బతుకుదాం!’..
బూర రాజేశ్వరి రాసిన కవితలు, ఆమె మాటలు.. వివిధ పత్రికల్లో, లోకల్‌ కేబుల్‌ వార్తల్లో, వాట్సప్‌ గ్రూపుల్లో ప్రసారమయ్యాయి. ఆమె పేరు రాష్ట్రమంతటా మార్మోగిపోయింది. రాజేశ్వరి.. రాష్ట్ర సర్కారు దృష్టికి వచ్చింది. ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా.. ‘ఉత్తమ మహిళ’ అవార్డునిచ్చి సత్కరించింది. రాజేశ్వరి తల్లి అనసూయ, పెద్దన్న ఆమె వెంటే ఉన్నరు. వాళ్ల మనసు పొంగిపోయింది.

‘సిరిసిల్ల సాహితీ సమితి’.. రాజేశ్వరికి తమ సంఘంలో సభ్యత్వమిచ్చి, ‘ఉత్తమ రచయిత్రి’ అవార్డుతో సన్మానించిది. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయిన ఒక వీడియో క్లిప్‌లో.. బూర రాజేశ్వరి రూపం, నడక, మాటలు.. ప్రతిఒక్కరి హృదయాన్ని
కదిలించాయి.
ఒక ఇంటర్వ్యూలో..
“నీ కోరిక ఏమిటి?” అని అడిగిన ప్రశ్నకు..
“సుద్దాల అశోక్‌ తేజతో ఒకసారి మాట్లాడాలని ఉంది” అని చెప్పింది రాజేశ్వరి.
ఆ ఇంటర్వ్యూను సుద్దాల అశోక్‌ తేజ, ఆయన సతీమణి నిర్మల చూసిండ్రు. ఆగమాగంగా సిరిసిల్లలోని రాజేశ్వరి ఇంటికి వచ్చి.. కలిసిండ్రు.“ఎవరి వల్ల ఇంత సాహసం చేయగలిగినవు. ఏ ధైర్యంతో కవిత్వాన్ని ఆయుధంగా వాడినవు” అని ప్రశ్నించిండు అశోక్‌ తేజ.“కవిత్వం రాయడానికి స్ఫూర్తి మీరే! టీవీలో మీ ఇంటర్వ్యూ చూశాను. అవిటితనమైనా అందరి మనసులో నిలవడానికి కారణం మీరే!” అన్నది రాజేశ్వరి. ఆ మాటలతో పట్టరాని సంతోషంతో..
“బిడ్డా! నీ మాటలు నా గుండెను తాకినయి. ఎన్నో అవార్డులు పొందినా రాని సంబురం.. నీవల్ల లభించింది” అని కళ్ల నిండా నీళ్లు నింపుకొని, రాజేశ్వరికి నమస్కరించి.. కొండంత వాత్సల్యంతో దగ్గరికి తీసుకుండు అశోక్‌ తేజ.
“బాపూ! మీరు గింత గొప్పోల్లు. నన్ను దగ్గరికి తీసుకుంటే నూరేళ్లు బతికి, మనో దౌర్బల్యం ఉన్నోళ్లకు నా ‘కవితల’ ద్వారా మనోధైర్యాన్ని నూరిపోస్తా!” అంటూ మనసు ఉప్పొంగగా స్పందించింది రాజేశ్వరి.
“సరే బిడ్డా! నువ్వు ఎట్లా చదువుకున్నవు? స్కూలుకు వెళ్లినవా? ఒక్కదానివే వెళ్లినవా?” అని అడిగిండు.
“బాపూ! మా చెల్లె మల్లీశ్వరి, అన్నబిడ్డ లతతో కలిసి బడికి వెళ్లిన. నడువరాకున్నా పోరాటం చేసిన. ఆరాటంతో ఉడుం పట్టుపట్టి ఏడో తరగతి దాకా సదువుకున్న. కొందరు సార్ల సహాయంతో ఎస్సెస్సీ, ఇంటర్‌ పరీక్షలు రాసి పాసయిన!” అంటూ చెప్పింది రాజేశ్వరి.
“చూడు బిడ్డా! ధైర్యే సాహసే లక్ష్మి అన్నట్లు నువ్వు ధైర్యంతో అన్నిటినీ ఎదుర్కొంటున్నవు. ఆ భగవంతుడు నీకు తోడ్పడుతుండు! శభాష్‌ బిడ్డా!”.
“బాపూ! నాకు వచ్చే వికలాంగుల పెన్షన్‌ నుంచి ఏటా 15 ఆగస్టు, 26 జనవరికి ఓ బడికి వెయ్యి రూపాయలు ఇస్తా! ఆ డబ్బులను ఆటలో ్లవిజేతలకు బహుమతులుగా అందజేస్తరు. గదో ఆనందం నాకు”.
“సరే.. బిడ్డా! నీ కవితలన్నీ నేను తీసుకుంటున్న.. ‘సిరిసిల్ల రాజేశ్వరి కవితలు’ పుస్తకంగా అచ్చువేస్తానని మాట ఇస్తున్నా! అట్లాగే మా అమ్మనాన్న సుద్దాల హనుమంతు – జానకి గార్ల అవార్డు ఈసారి నీకే దక్కుతుంది” అంటూ సంబురంతో అన్నడు అశోక్‌ తేజ.
* * *
భాగ్యనగరం నడిబొడ్డున కళలకు నెలవైన రవీంద్ర
భారతిలో.. ఎందరెందరో మేధావులు, కవి గాయకులు, నాయకులు, అభిమానుల నడుమ.. ‘సిరిసిల్ల రాజేశ్వరి కవితలు’ పుస్తకాన్ని, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్‌ సి.నారాయణరెడ్డి ఆవిష్కరించి, ఆశీర్వదించిండు. సుద్దాల అశోక్‌ తేజ.. తన తల్లిదండ్రుల పేరున ‘సుద్దాల హనుమంతు – జానకి అవార్డు’ రాజేశ్వరికి అందించిండు. సప్పట్ల సప్పుడులో ఆయన మాట్లాడుతూ..
“సంకల్పం ముందు వికల్పం ఎంత? దృఢచిత్తం ముందు దురదృష్టం ఎంత? ఎదురీత ముందు విధిరాత ఎంత? పోరాటం ముందు ఆరాటం ఎంత? ఈ మాటలకు సజీవ ఉదాహరణ సిరిసిల్ల రాజేశ్వరి! భౌతిక వైకల్యాన్ని సవాలు చేస్తూ జీవిస్తున్న సమర యోధురాలు!” అంటూ కీర్తించిండు.
ఈ సందర్భంగా ‘సిరిసిల్ల సాహితీ సమితి’
రాజేశ్వరిని ఘనంగా సత్కరించింది. తమ ప్రకటనలో..
“మా సభ్యురాలు రాజేశ్వరికి వైద్యఖర్చులు, జీవ
నోపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆధారం చూపాలి” అంటూ విజ్ఞప్తి చేసింది. అక్కడున్న మేధావులు కొందరు.. ఎవరికి తోచినంత వాళ్లు ఆర్థిక సాయం అందించిండ్రు. చూస్తుండగానే లక్ష రూపాయలు
పోగైనయి. ఆమె కుటుంబం సంబురం.. అంబరాన్ని అంటింది. నాటి ముఖ్యమంత్రి చెవుల్లోనూ రాజేశ్వరి చరిత్ర దూరింది. వెంటనే ఆమెకు పది లక్షలు ప్రకటించిండ్రు. ఆ పైసలను ఆమె పేరున బ్యాంకు అకౌంట్లో వేసి.. ప్రతినెలా వడ్డీ అందేట్లు చూడాలని కలెక్టర్‌కు ఆదేశాలు అందినయి. ఆమె కుటుంబం, అభిమానులు అందరూ సంబురపడ్డరు.
సాయంత్రానికి ఇల్లు చేరిండ్రు. హైద్రాబాద్‌లో జరిగిన సంబురాన్ని ఇంట్లో పిల్లా జెల్లా చెప్పుకొని సంతోషపడ్డరు. గప్పుడే కన్నారం విశ్వబ్రాహ్మణ సంఘం పిలుపురాంగనే.. రాజేశ్వరి, అమ్మ అనసూయ, అన్న ఓదెలు కలిసి కళాసాగర్‌ భవనానికి చేరుకున్నరు. విశ్వబ్రాహ్మణ సంఘం వారు ‘ప్రాణ రక్షక’ అవార్డుతోపాటు రూ.పదివేల నగదు అందిస్తూ, రాజేశ్వరిని ఘనంగా సత్కరించిండ్రు.
“రాజేశ్వరి కవితలు ఎందరెందరో పానాలను నిలిపినయి. మహారాష్ట్ర సర్కారు తమ పాఠ్యాంశాల్లో
‘రాజేశ్వరి చరిత్ర’ను చేర్చింది” అని వ్యాఖ్యాత తనదైన శైలిలో చెప్పిండు.
ఆ ప్రశంసలను మనసులో మూటగట్టుకొని ఇంటిదారి పట్టిండ్రు.
“అవ్వా! చెల్లె రాజేశ్వరి మనసు, ఆలోచనల గొప్పదనంతో మన కుటుంబం ఒక గాడిలో పడ్డది. మొన్నటిదాకా ఓ పూటకు ఉంటే.. ఇంకో పూటకు లేదు. తమ్ముడు రామచంద్రం సాంచలు నడుపుతుండు. సమ్మక్క, మల్లీశ్వరి బీడీలు చుడుతుండ్రు. అయ్య వోయినప్పటి సంది గింత దాకా! కుటుంబాన్ని ఈదుకచ్చిన. గిప్పుడు ఐదేళ్లు నోట్లెకు పోతున్నయి”.. సంబురాన్ని తట్టుకోలేక అన్నడు ఓదెలు.
“నిజంగా బిడ్డ! రాజేశ్వరికి గిన్ని పైసలు రావట్టే! ఇంట్ల అందరం నోట్లె నాలిక లెక్క కలిసి కడుపునిండా తింటున్నం” ముఖంమీద చిరునవ్వులు ఒలుకుతుంటే.. అన్నది అనసూయ.
“అవ్వా! గిప్పుడు నాకు గుండెధైర్యం పెరిగింది. రేపు దసరా. మంచిగ జరుపుకొందం! సరేనా అవ్వా!?” అని అడిగిండు ఓదెలు.. గుండెనిండా ప్రేమతో!
* * *
తెల్లారింది. ఓదెలు సైకిలెక్కి మార్కెట్‌కు పోయిండు. శియ్యకూర తెచ్చి ఇంట్లో బెట్టిండు. సారంపెల్లికి పోయి ఈతకల్లు దెచ్చిండు.
“అవ్వా! పొద్దిమీకి బంతి గూకుందాం” అని .. సాంచల పనిలలో చేరిండు.
రాజేశ్వరిది ఉమ్మడి కుటుంబం. మాపటీలికి అందరూ బంతి కూసుకున్నరు. విస్తర్లల్ల శియ్యకూర, బజ్జీలు, పూరీలు వడ్డించిండ్రు. అందరూ తింటాంటే.. ఓదెలు గిలాసల్ల ఈతకల్లు పోస్తుండు. పిల్లలూ, పెద్దలూ సంబురంతో ముచ్చట్లు వెట్టుకుంటుండ్రు. ఎవలకు కన్నుకుట్టిందో.. నవ్వుకుంట మాట్లాడుతున్న ఓదెలుకు ఒక్కసారి సరం పడ్డది.
రేవతి గిలాసల నీళ్లిచ్చి, ఈపుల సరిసింది.
“అవ్వా! మొస మర్రుత లేదు. బొచ్చెల బగ్గ నొత్తుంది. ఎడమ చెయ్యి గుంజుతంది. తల్లడం మల్లడం అయితంది!” అనుకుంట తిండి మీదికెల్లి లేచిండు.
ఆయాసంతో విలవిల లాడుతున్నడు ఓదెలు. శెమటతోని పెయ్యంత తడిసింది. అప్పటిదాకా అందరిలో ఉన్న ఆ సంబురం.. ఒక్కసారి అడుగంటింది. అందరి మనసుల్లో ఆందోళన, భయం ముసురుకుంది. వాడకట్టు డాక్టర్‌ను తోలుకచ్చింది అనసూయ. ఆయినె చూసి..
“అవ్వా! గిది గుండెనొప్పి లెక్క ఉన్నట్టుంది. జెప్పన పెద్ద దవాఖానకు తీసుకపోండ్రి” అన్నడు.
అనసూయకు గుండెల రాయిపడ్డట్టు అయింది. ఆడనే కూలవడ్డది. రాజేశ్వరి కడుపులో కవ్వం తిరిగినట్లు అయ్యింది.
“నాకు వచ్చిన పైసలు తీసుకోండ్రి. అన్నను కాపాడుకోవాలె. వదినె, చిన్నన్న.. జల్ది పోండ్రి!” అని ఏడుసుకుంటనే అన్నది రాజేశ్వరి.
ఓదెలును ఆటోలో కూర్చోబెట్టిండ్రు. ఒక దిక్కు రామచంద్రం, మరో దిక్కు విజయ, అనసూయ కూసున్నరు. వాళ్ల చేతుల లక్ష రూపాయలు వెట్టింది రాజేశ్వరి.
దగ్గర్లనే ఉన్న ఓ ప్రైవేటు దవాఖానకు తోలుక పోయిండ్రు. ఓదెలును చూసిన డాక్టర్‌..
“ఇక్కడ గాదు. కరీంనగర్‌ పోవాల్సిందే!” అన్నడు.
గదే ఆటోలో కన్నారం బయల్దేరిండ్రు.
కన్నారం చేరుతున్నమనంగా.. ఓదెలుకు చెమటలు గుమ్మరించినయి. నోటమాట ఆగింది. మొసకొట్టుడు మొదలైంది. లబోదిబోమని గుండెలు కొట్టుకుంటూనే.. ఓ పెద్ద దవాఖానల శెరీక్‌ జేసిండ్రు. యాభైవేలు అడ్వాన్స్‌ పెట్టిండ్రు. అప్పటిదప్పుడే.. ఇరవై ఐదువేల సూదిమందు ఇచ్చిండ్రు ఓదెలుకు. గ్లూకోజ్‌ పెట్టిండ్రు. ఒక్క గంట గడిచినంక.. క్యాలికి అచ్చిండు. దగ్గరికి రమ్మంటూ.. విజయకు కండ్లతోనే సైగ చేసిండు.
“విజయా! నువ్వు పైలం. ఇంట్ల అందర్నీ మంచిగ చూసుకో! కలిసిమెలిసి ఉండుండ్రి. అవ్వా! నా పిల్లలు లత, భాస్కర్‌, సందీప్‌ పైలం.. నాకేం గాదు. గానీ, జరగరానిది జరిగితే.. నా గుండె ఆగినా! మొస ఆగినా! నా పెండ్లాం, పిల్లలు..” అంటూ కండ్లల్ల నీళ్లు వెట్టుకుంట..
భార్య విజయను, తల్లిని దగ్గరికి తీసుకున్నడు.
“తమ్ముడూ! నేను మంచిగైతె.. అందరం మంచిగుందం. ఒగాల్ల నేను సచ్చిపోతే! మీ వదినెను, పిల్లలను, చెల్లెళ్లను, అవ్వను తెర్లు గానియ్యకు. మంచిగ చూసుకో!”.. కన్నీళ్ల ధార జారి పడుతుండంగ ఒప్పజెప్పిండు ఓదెలు.
“అన్నా! నువ్వు జల్ది మంచిగైతవు. రంది పెట్టుకోకు. చెల్లె రాజేశ్వరికి వచ్చిన పైసలు లక్ష ఇచ్చింది. ఇల్లు అమ్మి అయినా.. నిన్ను కాపాడుకుంటం. నువ్వు మంచిగ్గావాల్నని చెల్లెండ్లు, పిల్లలు అందరూ దేవుండ్లకు మొక్కులు మొక్కుతుండ్రు” అని ధైర్యం నూరిపోసిండు తమ్ముడు రామచంద్రం.
* * *
రాత్రంతా బెడ్‌ పక్కనే ఉండి.. పెనిమిటి అవసరాలను తీర్సుకుంట సేవ చేసింది విజయ.
మూలసుక్క పొడుస్తుండగా..
“విజయా! దూపైతంది!” అన్నడు ఓదెలు.
ఓ గిలాసల మంచినీళ్లు ఇచ్చింది. తాగుతుండగా మల్ల సరం పడ్డది. తలమీద, వీపుల మెల్లగ చరిచింది. ఐనా తల్లడం మల్లడం ఐతుండు. కిందమీద ఐతుండు.
విజయకు నోట మాట రాలేదు. ఏడుసుకుంట వొయ్యి డాక్టర్లను, నర్సులను పిల్చుకచ్చింది. వాళ్లు ఓదెలును ఆపరేషన్‌ థియేటర్‌లోకి తీసుకుపోయిండ్రు. విజయకు కాళ్లు, చేతులు చల్లబడ్డయి. గుండె వేగం పెరిగింది. లోపలికి పోనిస్తలేరు. అత్త, మరిది దగ్గరికిపోయి వాళ్లను నిద్రలేపింది. గుండెల్లో దడ పెరుగుతుంటే, కన్నీళ్లు కాలువలై పారుతుంటే.. పత్తికాయ పగిలినట్లు ఏడుపుతో జరిగిన సంగతి చెప్పింది. ముగ్గురి మనసుల్లో భయం జొర్రింది. ఆగమాగం అవుతున్నరు. ఏం జరుగుతుందో అర్థంకాక బిక్కుబిక్కుమనుకుంట కూసున్నరు.
రాత్రి గడిచింది. పొద్దుగాల డాక్టర్లు వచ్చిండ్రు.
“మా ప్రయత్నం మేం చేసినం.. ప్రాణాలు కాపాడలేక పోయినం సారీ!” అన్నరు.
ముగ్గురూ దుఃఖసాగరంలో మునిగిండ్రు.
ఇంటికాడ.. ఏడుపును దిగమింగుకొని, పిల్లలకు ధైర్యం చెప్పుకొంటనే ఎదురుచూస్తున్నది రాజేశ్వరి. పొద్దు నెత్తి మీదికి వచ్చింది. ఇంటి ముంగట అంబులెన్స్‌ ఆగింది. శవాన్ని దించి.. ఆకిట్ల గడ్డిమీద పండుకోబెట్టిండ్రు. పిల్లలు, రాజేశ్వరి కుటుంబమంతా ఒక్కసారి ప్రభంజనంవోలే అయింది. కర్మకాండలు పూర్తి చేసిండ్రు. రాజేశ్వరి గుండె నిండా మోయలేని ఏడ్పు ఆవరించి ఉన్నా.. అనుభవమున్న పెద్దమనిషిలెక్క..
“అవ్వా! వదినె.. ఎవ్వలమైనా ఎల్లకాలం ఉండేటోళ్లం గాదు. ఎన్ని రోజులు భూమ్మీద నూకలు బాకీ ఉన్నాయో! గప్పటి దాక ‘బతుకే ఓ కయ్యం’ ఇది. ‘ఆత్మహత్యల’ జోలికి పోవద్దు. గది పెద్ద పాపం. మన బాధ్యతల్ని మరిచిపోవద్దు. పిల్లల బాధ్యత మనమీద ఉన్నది” అని బుద్ధి చెప్పింది.
* * *
కొంతకాలం గడిచింది. ఓదెలు మరణగాయం.. కొద్దికొద్దిగ మానుతున్నది. గంతల్నే.. పక్కింటోళ్లకు జరం వస్తే.. వెళ్లి చూసచ్చిండ్రు అనసూయ, రాజేశ్వరి. గంతే! వీళ్లకూ జరం, దగ్గు అందుకుంది. సర్కారు దవాఖానకు పోయి పరీక్షలు చేయించుకుండ్రు. తల్లీబిడ్డలకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఇద్దర్నీ సిరిసిల్ల సర్కార్‌ దవాఖానల క్వారెంటైన్లకు తీసుకుపోయిండ్రు.
ఇంకేముంది.. ‘నోరోటి ఆడితే నొసలోటి ఆడినట్లు’ ఒక్కసారి భయంలోకి జారుకుండ్రు.
తనకూ, తన తల్లికి కరోనా పాజిటివ్‌ వచ్చిన విషయాన్ని ఫోన్‌ ద్వారా సాహితీ మిత్రులకు చెప్పింది రాజేశ్వరి. విషయాన్ని వాళ్లు వాట్సాప్‌ గ్రూపుల్లో పెట్టడంతో.. సిరిసిల్ల పట్టణమంత పాకిందీ వార్త.
చంద్రంపేట అంజమ్మ పూటకూళ్ల ఇంట్ల రాత్రిపూట తిండికి వచ్చినోళ్లకూ ఈ ముచ్చట తెలిసింది.
“అరేయ్‌! రచయిత్రి రాజేశ్వరికి కరోనా వచ్చిందంట. గిప్పుడంటే.. బతుకమ్మ చీరలు బతుకునిస్తున్నయి. ఇంతకుముందైతే.. నేతన్నకు ఉరే గతి. నేనుగూడ ఫ్యాన్‌కు ఉరేసుకుందమని నైలాన్‌ తాడుతో తయారుగున్న! టీవీల రాజేశ్వరి మాటలు శెవుల సొర్రినయి. గంతే, తాడు ఇడిసి పక్కకు పారేసిన! లేకపోతే నా బొంద మీద గడ్డి మొలుస్తుండె” అన్నడు సురేష్‌.
“అరేయ్‌ సురేష్‌గా! నేనైతే బ్రాండిల ఇసం గల్పుకున్న! దేవతోలె ఆమె మాటలు మనసుకెక్కి ‘ఛీఛీ.. గింతపిరికోన్నా?’ అని సీసా పెంటల ఇసిరికొట్టిన!” అన్నడు శేఖర్‌.
‘బతుకు బరువు మోయలేక సావు అంచుల దాకా పోయిన ఎందరికో.. రాజేశ్వరి మాటలు పునర్జీవితాన్ని ఇచ్చినయి. అలాంటి రాజేశ్వరి కష్టాల్లో ఉన్నప్పుడు అందరం అండగ నిలువాలె!’ అని ప్రతి ఒక్కరూ తీర్మానించుకున్నరు. విషయాన్ని వాట్సప్‌ గ్రూపులల్ల షేర్‌ చేసిండ్రు. సిరిసిల్లలోని అన్ని ఇండ్లల్ల గిదే చర్చ
వెట్టిండ్రు. ఎంతోమంది కదిలిండ్రు. సిరిసిల్ల దవాఖానకు క్యూ కట్టిండ్రు. రాజేశ్వరికి మందులు, పండ్లు, పోషకాహార కిట్లు, ఆర్థిక సాయం అందిస్తూ అండగా నిలిచిండ్రు. తనకోసం సిరిసిల్లవాసులంతా కదిలిరావడంతో రాజేశ్వరి మనసు తబ్బిబ్బు అయ్యింది.
“అయ్యల్లారా! గింత భయంకర ఆపద సమయంలో ఈ అవిటి రచయిత్రిపై మీరు చూపుతున్న ఆప్యాయతకు, అనురాగానికి నా గుండె పొంగింది. నా భయం బద్దలైంది. మీ ఆశీస్సులున్నయి. నాకేం గాదు” అని అందరికీ తలవంచి దండంపెట్టింది రాజేశ్వరి.
“మీరు, మీ అమ్మ కరోనా నుంచి జెప్పన కోలుకోవాల్నని ఎములాడ రాజన్నకు మొక్కుతున్నం. ఈ గండం నుంచి బయటపడే దాకా నీ వెంటే ఉంటం. జీవితంపై విరక్తి చెందిన మాకు.. మీ మాటలతో బతుకు మీద ఆశ పుట్టించిండ్రు. మా ప్రాణాలు గాలిలో కలిసిపోకుండ కాపాడిండ్రు. మేమంతా మీ అభిమానులం!” అంటూ కన్నీళ్లు పటపట రాలుస్తూ చెప్పిండ్రు.
“బిడ్డా! రాజీ.. నాకు దమ్ము ఎత్తేసుకత్తంది. ఆయాసం ఎక్కువైతంది. నువ్వు.. అందరూ పైలం బిడ్డా! వదినెలు నీకు ఎట్ల సేవ జేస్తరో.. ఏమో!? అనే దిగులుంది. దేవుడు నిన్ను గిట్ల పుట్టించె! ఒకళ్ల మీద ఆధారపడుడాయె!” తల్లడిల్లింది ఆ తల్లి మనసు.
మాట్లాడుతుండంగనే.. మొసరాక ఆగమాగమైంది అనసూయ. డాక్టర్లు వచ్చిండ్రు..
“రాజేశ్వరీ! మీ అమ్మకు ఆక్సిజన్‌ లెవెల్స్‌ పడిపోతున్నయి. ఐసీయూలోకి తీసుకెళ్తం! మేం జేసే ప్రయత్నం మేం జేస్తం.. మీరు దేవుడి మీద భారమేయండి..” అంటూ అనసూయను తీసుకెళ్లిండ్రు.
రాజేశ్వరి మస్తు బెంగ వెట్టుకున్నది. పక్కపక్కనే ఉన్నప్పుడు ఏమీ అనిపించలేదు. గిప్పుడు చెరో దగ్గర అయ్యేసరికి అక్కడ ఏం జరుగుతున్నదో తెల్వక ఆందోళన చెందుతున్నది. కొడుకు, కోడళ్లు దూరం నుంచే మాట్లాడుకుంట పోతున్నరు. రాత్రి గడిచి తెల్లారింది.
అక్కన్నే ఉన్న నర్సులను పిలిచి..
“మా అమ్మకెట్లుంది?” అని అడిగింది రాజేశ్వరి.
“ఇప్పుడే ఏం చెప్పలేం! ఇంకా ఆక్సిజన్‌ లెవెల్స్‌ తక్కువనే ఉన్నయి” అని చెప్పిండ్రు వాళ్లు.
తన అవస్థను చెప్పుకోడానికి ఐసీయూ లోపలున్న అనసూయ దగ్గర ఎవర్లేరు. గంతల్నే దమ్ము ఎగపోత పెరిగింది. మృత్యువుతో పోరాడి పోరాడి.. కొడుకు, కోడలు వచ్చేసరికి తుదిశ్వాస విడిచింది.
“అమ్మా! అన్నీ నువ్వే అయి మమ్మల్ని నడిపించినవు. ఇగ మాకు దిక్కెవరు?” అని గుండె పగిలి ఏడ్చింది రాజేశ్వరి.
కరోనా నిబంధనలు పాటిస్తూ.. అనసూయ అంత్యక్రియలు జరిపిండ్రు కొడుకు, కోడలు. అభిమానులు, కవులు, కళాకారులు.. నిబంధనలతో ఆ కార్యక్రమంలో పాల్గొన్నరు. అమ్మలేని బాధను భరిస్తూనే.. కరోనాను జయించింది రాజేశ్వరి.
ధైర్యాన్ని కూడగట్టుకుని..
‘రాజైనా! బంటైనా! ధనికుడైనా! పేదైనా.. ఎవలైనా మట్టిలో కలిసేదే కదా! మిగిలేది.. మంచి, చెడు’ అనుకుంటూ ఆత్మస్థయిర్యాన్ని మరింత పెంచుకుంది. వదినెలు మంచోళ్లు. తల్లిలేని లోటు తీరుస్తూ.. సాయం అందిస్తూనే ఉన్నరు. తనకు జరిగిన గాయాలను కవి సమ్మేళనాలలో కవితల రూపంలో వెల్లడించింది రాజేశ్వరి. రెట్టింపు పదునుదేలి ముందుకు సాగుతున్నది. తన అవిటితనాన్ని మరిచి.. తెగింపుతో, పట్టుదలతో, సాధన చేస్తూనే ఉన్నది. రాజీ పకుండా.. ‘బతుకే! ఓ కయ్యం!’ అనుకుంటూ..

డాక్టర్‌ జనపాల శంకరయ్య

జనపాల శంకరయ్య స్వస్థలం, రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్‌ మండలం ఆవునూరు. ఏడో తరగతితోనే చదువును ఆపేసినా.. ఉన్నత విద్యాభ్యాసంపై మక్కువతో ప్రైవేట్‌గానే ఎం.ఎ, ఎంఫిల్‌, పీహెచ్‌డీ చేశారు. ప్రభుత్వ తెలుగు ఉపాధ్యాయుడిగా సేవలందించారు. జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డులు అందుకున్నారు. పద్య, వ్యాస రచన, బుర్రకథ ప్రక్రియల్లో అనేక రచనలు చేశారు. ‘కరీంనగర్‌ జిల్లా లంబాడీల ఆచార వ్యవహారాలు’, ‘బహుముఖ ప్రజ్ఞాశాలి కల్వకుంట్ల తారక రామారావు బుర్రకథ’, ‘తెలంగాణ సమరశంఖం’, ‘అవినీతిపై అక్షరాంకుశం’, ‘పర్యావరణ పరిరక్షణ పాంచజన్యం’, ‘వైద్యం – ఆరోగ్యం’ కవితా సంకలనాలకు సంపాదకత్వం వహించారు. సిరిసిల్ల సాహితీ సమితి ప్రధాన కార్యదర్శిగా, రాజన్న సిరిసిల్ల జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడిగా సాహితీ సేవ చేశారు. ఈయన రాసిన ‘ఆచార్య దేవోభవ’ శతకానికి పాలకొల్లు విశిష్ట పురస్కారం, చెలిమి సాంస్కృతిక సంస్థ పురస్కారం దక్కాయి.

-డాక్టర్‌ జనపాల శంకరయ్య
80747 27108

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024

Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.