రాష్ట్రంలో పెండింగ్ బిల్లులు క్లియర్ చేయడానికి కొత్తగా ‘బీ’ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు.
- 8-9 శాతం ఇస్తేనే పెండింగ్ బిల్లులు క్లియర్
- ‘ఆర్’ ట్యాక్స్‌కు పోటీగా ఓ మంత్రి వసూలు
- సీఎంకు ఎంత పట్టున్నదో తెలిసిపోతున్నది
- బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి ఆరోపణలు
- ట్యాక్స్ విషయం కాంట్రాక్టర్లే చెప్పినట్టు వెల్లడి
హైదరాబాద్, ఏప్రిల్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పెండింగ్ బిల్లులు క్లియర్ చేయడానికి కొత్తగా ‘బీ’ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటికే ‘ఆర్’ ట్యాక్స్ అమల్లో ఉన్నదని, తాను ఎందుకు సొంతంగా ట్యాక్స్ వసూలు చేయొద్దనే ఉద్దేశంతో ఓ మంత్రి ‘బీ’ ట్యాక్స్‌కు తెరలేపారన్నారు.
కాంట్రాక్టర్ల నుంచి బిల్లులో 8-9 శాతం కమీషన్‌గా తీసుకుంటున్నారని చెప్పారు. ఈ విషయాన్ని కొందరు కాంట్రాక్టర్లు తమకు చెప్పారన్నారు. ‘బీ ట్యాక్స్ అంటే భట్టి ట్యాక్స్ కాదు.. ఏం ట్యాక్సో నాకు తెలియదు. కొత్తగా వచ్చింది’ అని పేర్కొన్నారు. మంత్రులపై సీఎంకు ఎంత పట్టు ఉన్నదో అర్థం అవుతున్నదన్నారు.
రాష్ట్రంలో ఎన్నిరోజులు అధికారంలో ఉంటారో కాంగ్రెస్ నేతలకు నమ్మకం లేనట్టున్నదని, అందుకే ఉన్నప్పుడే దోచుకోవాలనే తీరుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం నెలకు రూ. వెయ్యి కోట్ల అప్పులు చేస్తున్నదని మండిపడ్డారు. 13 వారాల్లో రూ.13వేల కోట్ల అప్పు తీసుకున్నారని అన్నారు. మరో రూ. 4 వేల కోట్ల రుణం సేకరిస్తున్నారని చెప్పా రు. జీతాలకు, పెండింగ్ బిల్లుల మంజూరుకు అప్పులు చేస్తున్నారని విమర్శించారు.