భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేదర్ దళితులు, బడుగు బలహీనవర్గాలకు మాత్రమే చెందిన వ్యక్తి కాదని, ఆయన అందరివాడని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు చెప్పారు.
- దళితులకు మాత్రమే నాయకుడు కాదు
- గాంధీకి ఏమాత్రం తగ్గని మహానుభావుడు
- రాజ్యాంగం ప్రమాదంలో పడకూడదంటే కొన్ని పార్టీల కుట్రను అర్థం చేసుకోవాలి
- బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
- తెలంగాణభవన్‌లో అంబేద్కర్ జయంతి
- నివాళులర్పించిన కేటీఆర్‌సహా నేతలు
హైదరాబాద్, ఏప్రిల్ 14 (నమస్తే తెలంగాణ): భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేదర్ దళితులు, బడుగు బలహీనవర్గాలకు మాత్రమే చెందిన వ్యక్తి కాదని, ఆయన అందరివాడని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు చెప్పారు. అంబేద్కర్ ఆధునిక భారత నిర్మాత అని కొనియాడారు. జాతిపిత మహాత్మాగాంధీతో పోల్చి చూడదగిన, ఆయనతో సరిసమానమైన స్థాయిగల గొప్ప నాయకుడని కీర్తించారు. అంబేద్కర్ 134వ జయంతిని ఆదివారం తెలంగాణభవన్‌లో ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కేటీఆర్‌సహా మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, ఎమ్మెల్సీ శంభీర్‌పూర్ రాజు, మాజీ మంత్రులు మహమూద్ అలీ, శ్రీనివాస్‌గౌడ్, పొన్నాల లక్ష్మయ్య, నాగర్‌కర్నూల్ బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, బాల్క సుమన్, జీవన్‌రెడ్డి, నాయకులు డాక్టర్ చెరుకు సుధాకర్, ప్రొఫెసర్ శ్రీనివాస్‌రెడ్డి, రావుల చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు అంబేద్కర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాజ్యాంగం ప్రమాదంలో పడకూడదంటే కొన్ని పార్టీల కుట్రలను ప్రజలు అర్థం చేసుకోవాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్ ఆలోచన ధారకు అనుగుణంగా దేశంలోని అన్ని కులాలు, అన్ని మతాలు, వర్గాలు ముందుకుపోవాలని ఆకాంక్షించారు. అంబేద్కర్ మహనీయుడి ఆశయాల సాధన దిశగా అందరం ముందుకు సాగుదామని పేర్కొన్నారు.
అంబేద్కర్‌తత్వాన్ని ఆచరించే..
బోధించు.. సమీకరించు.. పోరాడు అన్న అంబేద్కర్ తత్వాన్ని పూర్తిస్థాయిలో అవగాహన చేసుకొని కేసీఆర్ నాయకత్వంలో 14 ఏండ్లపాటు తెలంగాణ కోసం పోరాడామని కేటీఆర్ పేర్కొన్నారు. ఉద్యమంలో లక్షలాదిగా ప్రజలను సమీకరించి, తెలంగాణ ఏర్పాటు ఆవశ్యకతను వివరించి, తెలంగాణ ప్రయోజనాలకు ఎక్కడ విఘాతం కలిగినా అంబేద్కర్ చూపిన మార్గంలో తాము పోరాటం చేశామని గుర్తుచేశారు. ప్రజా పోరాటంతోనే రాష్ట్రాన్ని సాధించుకున్నామని చెప్పారు. సాధించుకున్న తెలంగాణలో ప్రజల ఆశీర్వాదంతో, అంబేదర్ ఆశయాల ఆలోచనల మేరకు పదేండ్లు తమ ప్రభుత్వం పనిచేసిందని కేటీఆర్ తెలిపారు.
విద్యతోనే వికాసం వస్తుందని, వికాసంతోనే ప్రగతి వస్తుందని, ప్రగతితోనే సమానత్వం సిద్ధిస్తుందన్న అంబేదర్ ఆలోచన ఆధారంగానే 1,022 గురుకులాలు, 1,005 జూనియర్ కాలేజీలు, 85 డిగ్రీ కాలేజీలను ఏర్పాటు చేశామని వివరించారు. ఈ గురుకులాల నుంచి ఉద్భవించిన లక్షల మంది తెలంగాణ భవిష్యత్తు ఆశాకిరణాలు అయ్యారని పేర్కొన్నారు. గురుకులాల పిల్లలు ఇప్పడు ఐఐటీలు, ఐఐఎంలు సహా అనేక ఉన్నత విద్యాసంస్థల్లో చదువుతున్నారని వెల్లడించారు. ఒక మనిషికి ఒక ఓటు ఉన్నట్టుగానే కులరహిత సమాజంలో మనుషులందరికీ ఒకే రకమైన విలువ ఉండే సమానత్వం సమాజంలో రావాలని అంబేద్కర్ కాంక్షించారని కేటీఆర్ గుర్తుచేశారు. గురుకులాల్లో చదువుకున్న పిల్లలు అంబేదర్ ఆశయాలను నెరవేరుస్తారని ఆశాభావం వ్యక్తంచేశారు.
విగ్రహం కాదు.. విప్లవం..
ప్రపంచంలోనే అతిపెద్దదైన 125 అడుగుల బాబాసాహెబ్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆయనను సమున్నతంగా గౌరవించుకున్నామని కేటీఆర్ గుర్తుచేశారు. తాము ఏర్పాటు చేసింది విగ్రహం కాదు విప్లవమని ఆనాడే కేసీఆర్ చెప్పారని పేర్కొన్నారు. సచివాలయానికి బాబాసాహెబ్ అంబేదర్ పేరు పెట్టిన ఘనత కేసీఆర్‌కే దక్కిందని చెప్పారు. దళితబంధు వంటి దమ్మున్న పథకం పెట్టినా.. బడుగు బలహీన వర్గాలు, దళిత గిరిజనవర్గాల కోసం రాజకీయ ప్రయోజనాలతో నిమిత్తం లేకుండా చిత్తశుద్ధితో ఏ కార్యక్రమం చేసినా.. అవన్నీ అంబేదర్ ఆలోచన నుంచి వచ్చినవేనని పేరొన్నారు.
కొలంబియా వర్సిటీలో అంబేద్కర్‌కు విగ్రహం ఏర్పాటు చేసి ఘనంగా నివాళులు అర్పించారని, వారక్కడ ఆధునిక భారత నిర్మాతగా కొనియాడారని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తుచేశారు. ఆయన జయంతిని పురస్కరించుకుని ప్రపంచవ్యాప్తంగా వందకుపైగా దేశాల్లో అంబేదర్‌ను స్మరించుకుంటున్నారని, గుర్తుచేసుకుంటారని ఇది మనందరికీ గర్వకారణమని చెప్పారు. సమాజంలో సమానత్వం రావాలంటే రాజ్యాంగ స్ఫూర్తి కొనసాగించాల్సిన అవసరముందని కేటీఆర్ వెల్లడించారు. ప్రజలంతా అంబేదర్ ఆలోచనలు, ఆశయాల కోసం కలిసి పనిచేయాల్సిన అవసరమున్నదని, ఇదే మనం అంబేదర్క్‌కు అర్పించే నిజమైన నివాళిగా కేటీఆర్ అభివర్ణించారు. ఆ దిశగా అందరం కలిసి ముందుకు సాగుదామని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.