తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా ఉర్పాక్కం జిల్లాలో ఓ అపార్ట్‌మెంట్‌లోని మొదటి అంతస్తులో రిఫ్రిజిరేటర్ పేలి ముగ్గురు మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అపార్ట్‌మెంట్‌లో గిరిజ అనే మహిళ, ఆమె బంధువులు రాధ, రాజ్‌కుమార్, రాజ్‌కుమార్ భార్య భార్గవి, వారి కుమార్తె ఆరాధన నిద్రిస్తున్నారు. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా రిఫ్రిజిరేటర్ పేలిపోయింది.
దీంతో అపార్ట్‌మెంట్‌లో నిద్రిస్తున్న వారంతా పొగలో చిక్కుకున్నారు. ఇరుగుపొరుగు వారు గమనించి తలుపులు పగులగొట్టడంతో ఊపిరాడక రాజ్‌కుమార్, రాధ, గిరిజ మృతి చెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీసి శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. భార్గవి, ఆరాధన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.