IPL | ఐపీఎల్-17లో స్వల్ప లక్ష్యాలను కాపాడుకుంటూ వరుసగా మూడు విజయాలు దక్కించుకున్న లక్నో సూపర్ జెయింట్స్‌కు సొంత మైదానం లో ఢిల్లీ క్యాపిటల్స్ షాకిచ్చింది. లక్నో నిర్దేశించిన 168 పరుగుల లక్ష్యాన్ని 18.1 ఓవర్లలోనే ఛేదించింది. ఈ లీగ్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న యువ బ్యాటర్ జేక్ ఫ్రేసర్ (35 బంతుల్లో 55, 2 ఫోర్లు, 5 సిక్సర్లు), కెప్టెన్ రిషభ్ పంత్ (24 బంతుల్లో 41, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో ఆరు వికెట్ల తేడాతో లక్నోను ఓడించింది.

- ఢిల్లీ కమాల్..
- లక్నోలో విజయవంతంగా లక్ష్యఛేదన..
- జేక్ ఫ్రేసర్ మెరుపు అర్ధ సెంచరీ
- కుల్దీప్ మాయతో లక్నో కుదేలు
IPL | వరుసగా రెండు అపజయాల తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ విజయాల బాట పట్టింది. మూడు విజయాలతో దూకుడు మీదున్న లక్నో సూపర్ జెయింట్స్‌కు సొంత మైదానం ఏకనా క్రికెట్ స్టేడియంలో ఓటమి రుచిచూపించింది. ఇక్కడ రెండో ఇన్నింగ్స్‌లో 160 ప్లస్ స్కోరును ఛేదించడానికి మిగతా జట్లు నానా తంటాలు పడుతుంటే ఢిల్లీ మాత్రం కమాల్ చేసింది. అరంగేట్ర మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కుర్రాడు జేక్ ఫ్రేసర్ లక్నో బౌలర్లపై భారీ షాట్లతో విరుచుకుపడి ఢిల్లీకి విజయాన్ని కట్టబెట్టాడు. అంతకుముందు లక్నో బ్యాటింగ్ ఆర్డర్‌ను కుల్దీప్, ఖలీల్ దెబ్బతీసినా అయుష్ బదోని అద్భుత పోరాటంతో ఆ జట్టు పోరాడగలిగే స్కోరు సాధించింది.
లక్నో : ఐపీఎల్-17లో స్వల్ప లక్ష్యాలను కాపాడుకుంటూ వరుసగా మూడు విజయాలు దక్కించుకున్న లక్నో సూపర్ జెయింట్స్‌కు సొంత మైదానం లో ఢిల్లీ క్యాపిటల్స్ షాకిచ్చింది. లక్నో నిర్దేశించిన 168 పరుగుల లక్ష్యాన్ని 18.1 ఓవర్లలోనే ఛేదించింది. ఈ లీగ్‌లో తొలి మ్యాచ్ ఆడుతున్న యువ బ్యాటర్ జేక్ ఫ్రేసర్ (35 బంతుల్లో 55, 2 ఫోర్లు, 5 సిక్సర్లు), కెప్టెన్ రిషభ్ పంత్ (24 బంతుల్లో 41, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో ఆరు వికెట్ల తేడాతో లక్నోను ఓడించింది. తొలుత లక్నోను కుల్దీప్ యాదవ్ (3/20), ఖలీల్ (2/41) కట్టడి చేసినా అయుష్ బదోని (35 బంతుల్లో 55 నాటౌట్, 5 ఫోర్లు, 1 సిక్సర్) ఆదుకోవడంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 167 పరుగులు చేసింది. కుల్దీప్యాదవ్కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
ఖలీల్, కుల్దీప్ ధాటికి లక్నో కుదేలు
లక్నో ఇన్నింగ్స్ ఆరంభంలోనే నాలుగు బౌండరీలతో జోరు మీదున్న క్వింటన్ డికాక్ (19) ఖలీల్ అహ్మద్‌కు మూడో ఓవర్లో వికెట్ల ముందు దొరికిపోయాడు. తన మరుసటి ఓవర్లో ఖలీల్.. పడిక్కల్ (3)నూ అదే రీతిలో పెవిలియన్ పంపాడు. కుల్దీప్ రాకతో లక్నో ఇన్నింగ్స్ స్వరూపమే మారిపోయింది. ఏడో ఓవర్ వేసిన అతడు.. వరుస బంతుల్లో స్టోయినిస్ (8), పూరన్ (0)లను ఔట్ చేసి లక్నోకు ఒత్తిడిలోకి నెట్టాడు. అతడే వేసిన 9వ ఓవర్లో లక్నో సారథి రాహుల్.. పంత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరా డు. దీపక్ హుడా (10) మళ్లీ నిరాశపరచగా కృనాల్ పాండ్యా (3)ను ముకేశ్ కుమార్ ఔట్ చేయడంతో లక్నో 94 పరుగులకే 7 వికెట్లు కోల్పోయింది.
బదోని బాదుడు..
ఢిల్లీ బౌలర్ల విజృంభణతో 120 పరుగులు చేస్తే గొప్ప అనుకున్న లక్నో 167 పరుగులు చేసిందంటే దానికి కారణం బదోనినే. ఆరంభంలో నెమ్మదిగా ఆడిన బదోని 17వ ఓవర్ నుంచి గేర్ మార్చాడు. ఖలీల్ అహ్మద్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాదిన అతడు.. 18వ ఓవర్లో రెండు బౌండరీలు సాధించి 31 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తిచేశాడు.
ఢిల్లీ ధనాధన్..
ఛేదనలో ఢిల్లీకి మరోసారి శుభారంభం దక్కలేదు. గత రెండు మ్యాచ్‌లలో విఫలమైన వార్నర్ (8) మరోసారి నిరాశపరిచాడు. కానీ పృథ్వీ షా, జేక్ ఫ్రేసర్ మాత్రం బౌండరీలు, సిక్సర్లతో లక్నో బౌలర్లపై విరుచుకుపడ్డారు. నవీన్ ఉల్ హక్ బౌలింగ్‌లో రెండు, అర్షద్, కృనాల్ ఓవర్లలోనూ షా బంతిని బౌండరీ లైన్ దాటించాడు.
ఫ్రేసర్.. నో ప్రెషర్
వార్నర్ ఔట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన జేక్ ఫ్రేసర్ ఎదుర్కొన్న రెండో బంతినే సిక్సర్‌గా మలిచాడు. ఐపీఎల్లో తొలి మ్యాచ్ ఆడుతున్న ఈ ఆస్ట్రేలియా కుర్రాడు.. బ్యాటర్లకు పెద్దగా అనుకూలించని లక్నో పిచ్‌పై ధాటిగా ఆడాడు. కృనాల్ 13వ ఓవర్లో హ్యాట్రిక్ సిక్సర్లతో అలరించాడు. యశ్ ఠాకూర్ 14వ ఓవర్లో తొలి బంతికి బౌండరీ కొట్టిన అతడు.. రెండో బంతికి 3 పరుగులు తీసి 31 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తిచేశాడు.
సంక్షిప్త స్కోర్లు
లక్నో : 20 ఓవర్లలో 167/7 (బదోని 55 నాటౌట్, రాహుల్ 39, కుల్దీప్ 3/20, ఖలీల్ 2/41).
ఢిల్లీ : 18.1 ఓవర్లలో 170/4 (ఫ్రేసర్ 55, పంత్ 41, బిష్ణోయ్ 2/25, నవీన్ 1/24)