విద్యుత్తు ప్రాజెక్టులు మినహా కృష్ణా ప్రాజెక్టుల ఔట్లెట్లను కేఆర్ఎంబీకి అప్పగించేందుకు రేవంత్‌రెడ్డి సర్కారు ఓకే చెప్పిందని మరోసారి స్పష్టమైంది. కేఆర్ఎంబీ తాజాగా విడుదల చేసిన మీటింగ్ మినిట్స్‌లో ఈ విషయం స్పష్టంగా తేలిపోయింది.
- మినిట్స్ సాక్షిగా దొరికిపోయిన రేవంత్ ప్రభుత్వం
- కృష్ణా ప్రాజెక్టుల అప్పగింతకు పరోక్ష అంగీకారం
- విద్యుత్తు ప్రాజెక్టులపై మాత్రమే అభ్యంతరమన్న రాష్ట్రం
- కేఆర్ఎంబీ సమావేశం మినిట్స్‌తో మరోసారి తేటతెల్లం
దూద్ కా దూద్.. పానీ కా పానీ..!
రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని డొల్ల వాదనలు చేసినా, ఎంతగా సమర్థించుకున్నా.. నిజం మరోసారి తేటతెల్లమైంది. కృష్ణా ప్రాజెక్టులను కేంద్రానికి అప్పగించేందుకు రేవంత్ సర్కారు ఓకే చెప్పిందని మరోమారు స్పష్టమైంది. ప్రాజెక్టులు అప్పగించలేదంటూ బయట ఎన్ని బీరాలు పలికినా.. కృష్ణా నీటి యాజమాన్య బోర్డు ముందు మాత్రం అప్పగింతకు సమ్మతించినదన్నది వాస్తవం. గురువారం జరిగిన సమావేశానికి సంబంధించిన మీటింగ్ మినిట్స్‌ను కేఆర్ఎంబీ తాజాగా విడుదల చేయడంతో రేవంత్ సర్కారు అడ్డంగా దొరికిపోయింది. విద్యుత్తు ప్రాజెక్టుల అప్పగింతపై మాత్రమే తమకు అభ్యంతరముందంటూ చేతులు దులిపేసుకున్నది. దాంతో శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఔట్లెట్లను కేఆర్ఎంబీకి అప్పగించడానికి రేవంత్ సర్కార్ పరోక్షంగా అంగీకారం తెలిపినట్టయ్యింది.
హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు ప్రాజెక్టులు మినహా కృష్ణా ప్రాజెక్టుల ఔట్లెట్లను కేఆర్ఎంబీకి అప్పగించేందుకు రేవంత్‌రెడ్డి సర్కారు ఓకే చెప్పిందని మరోసారి స్పష్టమైంది. కేఆర్ఎంబీ తాజాగా విడుదల చేసిన మీటింగ్ మినిట్స్‌లో ఈ విషయం స్పష్టంగా తేలిపోయింది. నాగార్జునసాగర్ డ్యామ్ ఉదంతంపై జనవరి17న ఇరు రాష్ర్టాలతో కేంద్ర జల్‌శక్తిశాఖ నిర్వహించిన ప్రత్యేక సమావేశానికి కొనసాగింపుగా ఇరు రాష్ర్టాల ఈఎన్సీలతో కేఆర్ఎంబీ గురువారం సమావేశం నిర్వహించింది. అందులో శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులకు సంబంధించి 15 ఔట్లెట్లను బోర్డుకు అప్పగించేందుకు రెండు రాష్ర్టాలు అంగీకారం తెలిపాయి. ఈ మేరకు కేఆర్ఎంబీ మినిట్స్‌లో నమోదు చేసి శుక్రవారం విడుదల చేసింది.
కేఆర్ఎంబీ మినిట్స్లోని అంశాలు
ప్రాజెక్టుల అప్పగింతకు తెలంగాణ ప్రభుత్వం పలు షరతులను విధిస్తూ కేంద్ర జల్‌శక్తిశాఖకు లేఖ రాసింది. ఆ లేఖను బోర్డు చైర్మన్ శివనందన్కుమార్కు సమావేశంలో పాల్గొన్న తెలంగాణ ఈఎన్సీ అందజేశారు.
తెలంగాణ ప్రభుత్వం తన పరిధిలోని ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించినట్టయితే తాము సైతం తమ పరిధిలోని ప్రాజెక్టులను అప్పగిస్తామని ఏపీ ఈఎన్సీ వెల్లడించారు.
కేఆర్ఎంబీకి అప్పగించాల్సిన 15 ఔట్లెట్లలో విద్యుత్తు ప్రాజెక్టుల ఔట్లెట్స్ అప్పగింతకు మాత్రం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, జెన్కో అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని తెలంగాణ ఈఎన్సీ వెల్లడించారు.
ప్రాజెక్టులు బోర్డు పరిధిలోనే ఉంటాయి. నిర్వహణ కోసం ఇరు రాష్ర్టాలు సమాన నిష్పత్తిలో ఉద్యోగులను కేటాయించాలి. వారి జీతభ్యతాలను ఆయా రాష్ర్టాలే చెల్లించాల్సి ఉంటుంది.
15 ఔట్‌లెట్స్‌పై ఎంతమంది ఉద్యోగులు అవసరమవుతారనేది ఇరు రాష్ర్టాలు కచ్చితమైన అంచనా వేసి ఆ వివరాలను వారం రోజుల్లో బోర్డుకు అందజేయాలి.
ఔట్‌లెట్లన్నీ కేఆర్ఎంబీ నియంత్రణలోనే ఉంటాయి. వాటి మెయింటనెన్స్ పనులు ప్రస్తుతం మాదిరిగానే ఆయా రాష్ర్టాలే నిర్వహించాల్సి ఉంటుంది.
నీటి వాటాల కేటాయింపు, విడుదల, నియంత్రణ, పర్యవేక్షణ పూరి ్తబాధ్యత త్రీమెన్ కమిటీదే.
15 ఔట్లెట్లను బోర్డు పరిధిలో నిర్వహించేందుకు ఎక్కువ మొత్తంలో నిధులు అవసరం. ఇరు రాష్ర్టాలు నిధులను క్రమం తప్పకుండా విడుదల చేయాలి. అందుకు సంబంధించిన పూర్తి ప్రణాళికను రూపొందించాలి.
కేఆర్ఎంబీ అనుమతి ఉంటేనే ఇరురాష్ర్టాల అధికారులను డ్యామ్ సైట్‌పైకి, ఇతర మెయింటనెన్స్ పనుల నిర్వహణకు నాగార్జునసాగర్ డ్యామ్‌పై ఉన్న సీఆర్పీఎఫ్ బలగాలు అనుమతిస్తాయి.
