- రుతుపవన సీజన్‌లో సాధారణం
- కంటే అధిక వర్షపాతం: ఐఎండీ
హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): ఓ వైపు ఎండలు మాడు పగులకొడుతున్న వేళ భారత వాతావరణ శాఖ రైతులకు, ప్రజలకు చల్లటి కబురు అందించింది. దేశంలో ఈసారి రుతుపవన సీజన్‌లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అంచనా వేసింది. ఆగస్టు-సెప్టెంబరు నాటికి ఎకువ వర్షపాతం నమోదు కావచ్చని వెల్లడించింది. దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎకువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. తెలంగాణలో కూడా ఈ ఏడాది సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ శ్రావణి తెలిపారు.
లానినాతో మంచి వర్షాలు
జూన్ నాటికి ఎల్‌నినో బలహీనపడనున్నదని భారత వాతావరణ శాఖ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర పేర్కొన్నారు. మేనాటికి ఎల్‌నినో మరింత బలహీనపడి, జూన్ నాటికి పూర్తిగా తగ్గి తటస్థ పరిస్థితులు ఏర్పడతాయని పేరొన్నారు. ఆ తర్వాత జూలై నెలాఖరు నాటికి లానినా పరిస్థితులు ఏర్పడనున్నందున మంచి వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఇండియన్ ఓషన్ డైపోల్ పరిస్థితులు, ఉత్తరార్ధగోళంలో తగ్గిన మంచు విసృ్తతి ఈసారి నైరుతి రుతుపవనాలకు అనుకూలంగా ఉన్నాయని వివరించారు. ప్రైవేటు వాతావరణ సంస్థ సైమెట్ కూడా రుతుపవనాల సీజన్ వర్షాలపై ఇటీవల ఇలాంటి అంచనాలనే వెల్లడించింది.