ఉగాది ..అనగానే అందరికి గుర్తుకు వచ్చేది తెలుగు వారి పండుగ. తెలుగు సంవత్సరం ఉగాది నుంచే ప్రారంభమవుతుంది. కాబట్టి ఇది తెలుగు వారి పండుగగా గుర్తింపు తెచ్చుకుంది. చైత్ర శుద్ధ పాడ్యమి నాడు వచ్చే ఈ పర్విదినానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈ కొత్త సంవత్సరంలో రాశిఫలాలు, గ్రహస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకుని గ్రహశాంతులు వంటివి జరిపించుకుని సుఖంగా ఉడేందుకు పంచంగ శ్రవణాన్ని చేస్తారు. ‘క్రోధి’ నామ సంవత్సరానికి స్వాగతం పలకనున్న నేపథ్యంలో ఉగాది విశిష్టత, చరిత్ర గురించి తెలుసుకుందాం.
ఉగాది విశిష్టత:
చైత్ర మాసం శుక్లపక్షం పాడ్యమి రోజున ఈ జగత్తును సృష్టించాడని నమ్ముతారు. సోమకుడు వేదాలను తస్కరించిన కారణంతోనే మత్సావతారం ధరించిన విష్ణువు అతడిని సంహరించి వాటిని తిరిగి బ్రహ్మదేవుడికి అప్పగించిన సందర్భంలో ‘ఉగాది’ ఆచరణలోకి వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి. చైత్ర శుద్ధ పాడ్యమి రోజున సూర్యోదయ వేళలో బ్రహ్మ దేవుడు సృష్టిని సృష్టించాడని చెబుతుంటారు. అంటే కాలగణాన్ని గ్రహ, నక్షత్ర, రుతు, మాస వర్ష, వర్షాధికులను బ్రహ్మదేవుడు ఆ రోజు వర్తింపజేస్తాడని నమ్ముతుంటారు. ఈ రోజు నుంచే వసంత రుతువు కూడా ప్రారంభం అవుతుంది. అందుకే కొత్త జీవితానికి నాందిగా ఉగాది పండుగను ఘనంగా జరుపుకుంటారు.
శాలివాహనుడు పట్టాభిషక్తుడైన ఈ రోజు ప్రాశస్త్యంలోకి వచ్చిందని మరో గాధ కూడా ఉంది. ‘ఉగాది’, ‘యుగాది’ అనే రెండు పదాలు వాడుకలో ఉన్నాయి. ‘ఉగ’ అంటే నక్షత్ర గమనం. నక్షత్ర గమనానికి ఆది ఉగాది అంటే సృష్టి ఆరంభం అయ్యింది ఉగాది. యుగం అనగా ‘ద్వయం; లేదా ‘జంట’ అని అర్థం. ఉత్తారయణ, దక్షిణాయణ ద్వయ సంయుతం యుగం.. ఆ యుగానికి ఆది ఉగాదిగా మారింది. ఉగాది శబ్దానికి ప్రతిరూపంగా ఉగాదిగా రూపొందింది.
ఉగాది పచ్చడి:
ఉగాది రోజు ముఖ్యమైనది ఉగాది పచ్చడి. షడ్రచుల సమ్మేళనంగా చేసే ఈ ఉగాది పచ్చడి జీవితంలో జరిగే వివిధ అనుభవాలను సూచిస్తుంది. జీవితంలో అన్ని భావనలను చెప్పే భావం ఇందులో ఇమిడి ఉంటాయి. పచ్చడి ఒక్కొక్క పదార్థం ఒక్కో అనుభవానికి ప్రతీక.
బెల్లం- తీపి- ఆనందానికి ప్రతీక
ఉప్పు- జీవితంలో ఉత్సాహం, రుచికి సంకేతం
వేప పువ్వు- చేదు- బాధకలిగించే అనుభవాలు
చింతపండు- పులుపు- నేర్పుగా వ్యవహరించాల్సిన పరిస్థితులు
పచ్చి మామిడి ముక్కలు- వగరు – కొత్త సవాళ్లు
కారం- సహనం కోల్పోయేటట్లు చేసే పరిస్థితులు
ఉగాది వేడుకలు మరియు పూజలు శుభ ముహూర్తం ప్రకారం జరుగుతాయి. కాబట్టి మనం ఉగాది 2024 తిథి ప్రారంభం, ముగింపు తెలుసుకుని పండుగ జరుపుకోవాలి.
– ప్రత్తిపాద తిథి ప్రారంభం: 8 ఏప్రిల్ 2024 రాత్రి 11:50 నుండి
– ప్రతిపాద తిథి ముగుస్తుంది: 9 ఏప్రిల్ 2024 రాత్రి 8:30 వరకు.