Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

ఉద్యమ నాయిక కవిత-Namasthe Telangana

TelanganapressBy TelanganapressMarch 15, 2024No Comments

కల్వకుంట్ల కవిత..! తెలంగాణ రాజకీయాల్లో పరిచయం అక్కరలేని పేరు. ఉద్యమ నేత కేసీఆర్‌ అడుగుజాడల్లో స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో వెన్నుచూపని ధీరవనితగా పేరుతెచ్చుకొన్నారు.

March 16, 2024 / 04:58 AM IST
ఉద్యమ నాయిక కవిత
  • స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో కవితది చెరగని ముద్ర
  • తెలంగాణ భాష, సంస్కృతిని అవహేళన చేస్తే సహించని నైజం
  • గల్ఫ్‌ బాధితులకు అండ
  • మహిళాబిల్లు సాధనలో అలుపెరగని పోరు
  • ఎంపీగా, ఎమ్మెల్సీగా తనదైన ముద్ర

హైదరాబాద్‌, మార్చి 15 (నమస్తే తెలంగాణ): కల్వకుంట్ల కవిత..! తెలంగాణ రాజకీయాల్లో పరిచయం అక్కరలేని పేరు. ఉద్యమ నేత కేసీఆర్‌ అడుగుజాడల్లో స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో వెన్నుచూపని ధీరవనితగా పేరుతెచ్చుకొన్నారు. ఉద్యమ నాయికగా తెలంగాణపై చెరగని ముద్రవేసిన ధీరోదాత్తురాలిగా నిలిచారు. పుట్టినగడ్డ మీద మమకారంతో అమెరికాలో ఉన్నత చదువులు, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాన్ని వదిలి మలి దశ ఉద్యమంలో ప్రవేశించిన కవిత అనేక బాధ్యతలను సమర్థంగా నిర్వర్తించారు. ముఖ్యంగా మహిళలు, యువతను ఉద్యమంలో భాగస్వాములను చేయడంలో కీలకపాత్ర పోషించారు. ప్రజా సమస్యలపై పోరాడటంతోపాటు ప్రజా ఆకాంక్షలను నెరవేర్చే బాధ్యతను తన భుజస్కంధాలపై వేసుకున్నారు. అనేక మారుమూల గ్రామాల్లో పర్యటించి, సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చారు. రాష్ట్ర సాధనతోపాటు రాష్ట్రప్రగతి ప్రస్థానంలోనూ భాగస్వామ్యమయ్యారు. సాంస్కృతిక పునరుజ్జీవనం కోసం ఎంతో తపించారు. తెలంగాణ చరిత్రను భవిష్యత్తు తరాలకు అందించే లక్ష్యంతో అనేక అంశాలను వెలికితీయించి రికార్డు చేయించారు. ఈ కృషిలో భాగంగా ఆరు పుస్తకాలను ముద్రించి విడుదల చేశారు.

 తెలంగాణ జాగృతికి అంకురార్పణ
తెలంగాణ కళలు, సంస్కృతిపై జరుగుతున్న అన్యాయాన్ని ఎదురించడం, స్వాభిమానాన్ని చాటడమే లక్ష్యంగా తెలంగాణ జాగృతి సంస్థను 2006లో కవిత ఏర్పాటుచేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరుగుతున్న ప్రజా ఉద్యమం నుంచి ప్రేరణ పొంది ఈ సంస్థను నెలకొల్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం శాంతియుత పోరాటంలో మహిళలు, యువత, సమాజంలోని విభిన్న వర్గాల మద్దతును సమీకరించడంలో తెలంగాణ జాగృతి కీలకపాత్ర పోషించింది. తెలంగాణ ప్రజల హృదయాలను కలిపే ప్రత్యేకమైన పండుగల్లో ఒకటైన బతుకమ్మ పండుగను ఉద్యమ వేదికగా, భావజాలాన్ని వ్యాప్తిచేసే కార్యక్రమంగా మలిచారు. ఊరూరా బతుకమ్మ పండుగను నిర్వహించి అన్ని వర్గాల ప్రజలను భాగస్వామ్యం చేశారు. దశాబ్దంపాటు తెలంగాణతోపాటు, ప్రపంచవ్యాప్తంగా బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. ఉమ్మడిరాష్ట్రంలో బతుకమ్మ పండుగ నిర్వహణకు ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు విడుదల చేసేందుకు కృషిచేశారు. ప్రస్తుతం 30కిపైగా దేశాల్లో బతుకమ్మను నిర్వహించారు. ఫ్లోరైడ్‌ రక్కసితో తల్లడిల్లుతున్న నల్లగొండ జిల్లాలోని కొన్ని గ్రామాలను 2006లో దత్తత తీసుకొని అకడి పేద పిల్లలకు ఉచిత విద్యనందించేందుకు కృషిచేశారు.

నంది అవార్డుల్లో నిరసన
తెలుగు చలనచిత్రాల్లో తెలంగాణ భాష, సంస్కృతిని అవహేళన చేయడాన్ని కవిత నిరసించారు. తెలంగాణ భాషను వ్యంగ్యంగా మాట్లాడినవారికి నంది అవార్డు ఇచ్చిందుకు 2009 నంది అవార్డుల ప్రదానోత్సవంలో నిరసన తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్న సినీ నిర్మాతలు 2010లో తీసిన ఒక సినిమా విడుదలను వ్యతిరేకించి సంచలనం సృష్టించారు.

కోటిలింగాల గుడి పరిరక్షణలో..
కల్వకుంట్ల కవిత ఒకప్పుడు శాతవాహనుల రాజధానిగా వెలుగొందిన కోటిలింగాలతోపాటు అక్కడి ఆలయ పరిరక్షణకు పాటుపడ్డారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌ నిర్మాణంతో కోటిలింగాలు ముంపునకు గురయ్యే ప్రమాదం తలెత్తడంతో కోటి లింగాలను రక్షించేందుకు ఉద్యమాన్ని నిర్వహించారు. దీంతో గోదావరి నదికి అడ్డుగా ప్రభుత్వం ప్రొటెక్షన్‌వాల్‌ను నిర్మించింది.

నైపుణ్య శిక్షణకు నాంది
రాష్ట్రంలోని విద్యార్థి, యువత ఆకాంక్షలను నెరవేర్చేందుకు కవిత ప్రత్యేక చొరవ తీసుకున్నారు. తెలంగాణవ్యాప్తంగా తెలంగాణ జాగృతి సిల్‌ సెంటర్లు ఏర్పాటు చేసి వివిధ అంశాల్లో విద్యార్థులకు శిక్షణనిప్పించారు. ఈ సెంటర్ల ద్వారా రాష్ట్రంలోని వేలాది యువత శిక్షణపొంది, ఉద్యోగాల్లో చేరారు. జాబ్‌ మేళాలను నిర్వహించి ఉద్యోగాలిప్పించారు.

స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ కమిషనర్‌గా..
కల్వకుంట్ల కవిత భారత్‌ సౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ తెలంగాణ రాష్ట్ర చీఫ్‌ కమిషనర్‌గా 2015లో తొలిసారి ఎన్నికయ్యారు. దేశంలోనే ఈ హోదా పొందిన అత్యంత పిన్న వయస్కురాలిగా, యావత్‌ భారత్‌లోనే రెండో మహిళగా రికార్డు నెలకొల్పారు. ఆ తర్వాత 2021 ఏప్రిల్‌ 2న రెండోసారి ప్రధాన కమిషనర్‌గా ఎన్నికయ్యారు.

మహిళా ఉద్యమ దివిటీ
చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్‌ కల్పించాలన్న ఉద్యమం మరుగనపడ్డ దశలో కల్వకుంట్ల కవిత మరోసారి ఊపిరులూదారు. ఢిల్లీ వేదికగా ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. 18 పార్టీలతో ఢిల్లీలో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించడం, దేశంలోని వర్సిటీలు, కాలేజీల్లో రౌండ్‌టేబుల్‌ సమావేశాలు, చర్చలు నిర్వహించడం, ఆ తర్వాత విద్యావేత్తలు, ప్రొఫెసర్లు, ఆలోచనలపరుల చేత పోస్టుకార్డులు రాయించడం, ఢిల్లీలో నిరాహారదీక్ష చేపట్టడం ద్వారా కేంద్ర ప్రభుత్వంలో కదిలిక తెచ్చారు.

కార్మిక సంఘాల కాగడా
అనేక కార్మిక, మహిళాసంఘాలకు గౌరవాధ్యక్షురాలుగానూ కవిత పనిచేశారు. టీజీజేకేఎస్‌ గౌరవాధ్యక్షురాలిగా సింగరేణి కార్మికుల పక్షాన నిలబడ్డారు. రాష్ట్ర విద్యుత్తు కార్మిక సంఘం, అంగన్‌వాడీ వరర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ అసోసియేషన్‌కు గౌరవాధ్యక్షురాలిగా పనిచేసి మంచివేతనాలు లభించేందుకు, సమస్యలు పరిష్కరించేందుకు కృషిచేశారు.

అసెంబ్లీలో అంబ్కేదర్‌ విగ్రహం
అసెంబ్లీలో అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని ఉద్యమించి విజయం సాధించారు. కవిత పోరాటంతో అప్పటి ఉమ్మడి ప్రభుత్వం అసెంబ్లీలో అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటుచేసింది. ఇటీవలే జ్యోతిబాపూలే విగ్రహాన్ని అసెంబ్లీలో నెలకొల్పాలని బీసీ సంఘాలను కలుపుకొని ఉద్యమాన్ని నిర్మించారు.

గల్ఫ్‌.. గుండె దిలాసా..
గల్ఫ్‌ దేశాల్లోని తెలంగాణ బిడ్డలకు భరోసా ఇచ్చేందుకు కల్వకుంట్ల కవిత చొరవచూపారు. అనేకమందికి అండగా నిలిచారు. ప్రత్యేకంగా ఎన్నారైసెల్‌ను ఏర్పాటు చేసి గుండె దిలాసానింపారు. క్షమాభిక్ష పొందినవారిని కువైట్‌, సౌదీ, ఖతర్‌ వంటి దేశాల నుంచి తెలంగాణ రప్పించారు. గల్ఫ్‌లో తెలంగాణ బిడ్డలు చనిపోయిన సందర్భాల్లో వారి మృతదేహాలను స్వదేశానికి తీసుకొనిరావడం, అంబులెన్స్‌లు ఏర్పాటు చేసి స్వస్థలాలకు పంపించడం వంటి చర్యలతో మానవీయతను చాటుకున్నారు. వీసా గడువు ముగిసి, అక్కడ చిక్కుకుపోయిన వారిని రప్పించేందుకు ప్రయత్నించారు. గల్ఫ్‌కార్మికులకు కనీస వేతనాలిప్పించేందుకు ప్రయత్నించారు.

నిజామాబాద్‌ నుంచి 2014లో ఎంపీగా గెలిచి, పార్లమెంటులో ఎస్టిమేట్స్‌ కమిటీ, వాణిజ్యంపై స్టాండింగ్‌ కమిటీ, కన్సల్టేటివ్‌ కమిటీల్లో సభ్యురాలిగా పనిచేశారు. కంబోడియా, లావోస్‌లో పర్యటించిన భారత ప్రతినిధి బృందంలోనూ, బెల్జియంలోని బ్రస్సెల్స్‌లో జరిగిన యూరోపియన్‌ పార్లమెంట్‌కు హాజరైన లోక్‌సభ స్పీకర్‌ ప్రతినిధి బృందంలోనూ కవిత సభ్యురాలిగా ఉన్నారు. కామన్వెల్త్‌ మహిళా పార్లమెంటేరియన్స్‌, ఇండియా రీజియన్‌ స్టీరింగ్‌ కమిటీకి నామినేట్‌ అయ్యారు. పార్లమెంట్‌లలో మహిళా ప్రతినిధుల సంఖ్య పెంపుదలకు కృషిచేయడం కామన్వెల్త్‌ మహిళా పార్లమెంటేరియన్ల బాధ్యత కాగా, ఈ విషయంలో కవిత విశేషమైన కృషిచేశారు. ప్రస్తుతం నిజామాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా శాసనమండలికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు.

కుట్ర పూరిత చర్య
బీఆర్‌ఎస్‌ వారికి కంట్లో నలుసులా మారింది. తెలంగాణ గొంతుకై ప్రశ్నిస్తది,కేసీఆర్‌ తెలంగాణ ప్రజల కోసం పోరాడుతారు. కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ను తుద ముట్టించాలనే కుట్ర పూరితమైన చర్యలో భాగమే ఈ అరెస్ట్‌. వీటికి భయపడేది లేదు. రాజ్యాంగం, చట్టానికి వ్యతిరేకపూరితమైన చర్యలను కోర్టుల్లో,ప్రజాక్షేత్రంలో ఎదుర్కొంటాం.
-మాజీ మంత్రి వేమల ప్రశాంత్‌ రెడ్డి

కక్ష సాధింపునకే దాడులు
రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ని అణిచివేస్తూ ఏదో విధంగా ఇబ్బందులకు గురిచేయాలని, పార్టీని బలహీనపరిచేందుకు బీజేపీ, కాంగ్రెస్‌ ఈడీ దాడులతో కుట్రలు పన్నుతున్నాయి. ఈడీ దాడులకు భయపడేదిలేదు. అన్ని విధాలా ఎదుర్కొంటాం. కోర్టులపై ప్రగాఢ విశ్వాసం ఉంది. కవిత తప్పకుండా నిర్దోషిగా బయటకు వస్తుంది.
-ఎమ్మెల్సీ సత్యవతిరాథోడ్‌

విచారణలో ఉండగానే..
కవిత అరెస్ట్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతన్నది. ఈ తరుణంలో ఈడీ అరెస్ట్‌ చేయడం ఎందుకు?. మోదీ సర్కారు ప్రజాస్వామిక విధానాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. ప్రతిపక్ష నేతలపై ఈడీ, సీబీఐ లాంటి దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతూ కక్ష సాధిస్తున్న ది. ఢిల్లీ వేదికగా జరిగే కుట్రలను ఉద్యమంతో ప్రజాక్షేత్రంలో ఎండగడతాం.
– కొప్పుల ఈశ్వర్‌, మాజీ మంత్రి

దెబ్బతీసేందుకే..
విపక్ష పార్టీలు లక్ష్యంగా చేసే కక్ష పూరిత చర్యలు ప్రభుత్వ వ్యవస్థల మీద ప్రజల నమ్మకాన్ని దెబ్బతీస్తాయి. కేసీఆర్‌ను మానసికంగా దెబ్బతీయాలనే ఈ విధంగా వ్యవహరిస్తున్నారు. ప్రతి విషయాన్ని న్యాయపరంగా ఎదుర్కొంటాం. రాజకీయ ప్రయోజనాల కోసమే కవిత అరెస్ట్‌. ఈ పరిణామాలు వారికి తాత్కాలిక ఆనందమే. భవిష్యత్‌లో వాస్తవాలు వెలుగులోకి వస్తాయి.
– మాజీ మంత్రి నిరంజన్‌ రెడ్డి

అరెస్ట్‌ను ఖండిస్తున్నాం
ప్రతిపక్ష పార్టీలను అణివేసేందుకే సీబీఐ, ఈడీలను బీజేపీ సరారు వాడుకుంటున్నది. అందులో భాగంగానే కవితను అరెస్టు చేసింది. ఈ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. పార్లమెంట్‌ ఎన్నికల్లో లబ్ధికోసమే బీజేపీ అరెస్టు రాజకీయాలు చేస్తున్నది.
-దాస్యం వినయ్‌భాస్కర్‌, ప్రభుత్వ మాజీ చీఫ్‌ విప్‌

అండగా నిలవాలి
ఎమ్మెల్సీ కవితను కుట్రపూరితంగా అరెస్ట్‌ చేయడాన్ని ఖండిస్తున్నాం. రాజకీయ కక్షపూరిత చర్యలను తెలంగాణ ప్రజానీకం నిరసిస్తుంది. రాజకీయాన్ని రాజకీయంగా ఎదురోవాలి కానీ అరెస్టులతో కాదు. ఈ సమయంలో తెలంగాణ ప్రజలు కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ పార్టీకి అండగా నిలువాలి.
-పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, ఎమ్మెల్యే

22

అప్రజాస్వామికం

కవితను అరెస్టు చేయడం అప్రజాస్వామికం. బీఆర్‌ఎస్‌ ఉనికిని దెబ్బతీసేందుకు మోదీ ప్రభుత్వం ఈడీని అడ్డుపెట్టుకొని అరెస్టులు చేయించింది. భవిష్యత్తులో ఈ గడ్డ ప్రజలు బీజేపీకి తగిన గుణపాఠం చెబుతారు. నేడు షాపూర్‌నగర్‌ ఉషోదయ టవర్‌ చౌరస్తాలో చేపట్టనున్న నిరసన ధర్నాకు పార్టీ శ్రేణులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరుకావాలి. –కేపీ వివేకానంద్‌, ఎమ్మెల్యే

అరెస్ట్‌ కుట్రపూరితం
కవితను ఈడీ అక్రమంగా అరెస్ట్‌ చేయడాన్ని ఖండిస్తున్నా. బీజేపీ ప్రభుత్వ ప్రేరేపిత కేసులపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుండగా ఈడీ అధికారులు కుట్రపూరితంగా అరెస్ట్‌ చేయడం అన్యాయం. కేసీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కోలేని బీజేపీ, కాంగ్రెస్‌ కేంద్ర సంస్థలను అడ్డుపెట్టుకుని ఇబ్బందులకు గురిచేయడం, బెదిరింపు రాజకీయాలు చేయడం సిగ్గుచేటు.
-మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్యే

మాకు సంబంధం లేదు కవిత అరెస్టుతో బీజేపీకి
సంబంధం లేదు. కవితను దర్యాప్తు సంస్థలు అరెస్టు చేశాయి. దీనికి పార్టీతో ఎలాంటి సంబంధం లేదు. ఈడీ ఇప్పటికే అనేకసార్లు కవితకు నోటీసులు జారీ చేసింది. అయినా ఆమె హాజరు కాలేదు. అందుకే దర్యాప్తు బృందం నేరుగా ఆమె ఇంటికి వెళ్లి సోదాలు చేసి అరెస్ట్‌ చేసింది.
– కిషన్‌రెడ్డి, కేంద్ర మంత్రి

21

ఉద్యమాన్ని ఉరికించింది..
తెలంగాణ ఉద్యమం సాగినన్ని రోజులు నిత్యం ఏదో ఒక ఆందోళన, నిరసన. అన్నింటిలో ఆమెదే అగ్రస్థానం. పోలీసులను పరుగులు పెట్టించినా, సాటి ఉద్యమకారులతోపాటుగా ఉద్యమాన్ని ముందుకు ఉరికించినా ఆమెకే చెల్లింది.

హక్కుల కోసం ఎంత దూరమైనా..
జయలలిత, మమత, మాయావతి ఇలా ఎందరో మహిళా ముఖ్యమంత్రులు వల్ల కాని మహిళా రిజర్వేషన్లను సాధించి పోరాటానికి పర్యాయపదంగా నిలిచిన కల్వకుంట్ల కవిత.

అంబేద్కర్‌ సాక్షిగా..
పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు పెట్టాలన్న ఏకైక ఎజెండాతో జెండాలన్నీ ఒక్కటైన వేళ.. ప్రజాస్వామిక డిమాండ్‌ కోసం పార్టీలన్నీ ఒక్కటైన వేళ.. అందరి చేత అంబేద్కర్‌ సాక్షిగా ప్రమాణం చేస్తున్న కవిత.

ఉద్యమ ఘనత పోరాట చరిత
ఓ మహాలక్ష్యం కోసం రోడ్డుపై వంటా వార్పే కాదు.. ఎంతో ఓర్పుతో ఉద్యమంతో మమేకమై విజయతీరాల దాకా అలుపెరుగని పోరాటం చేసిన అసలు సిసలు ధీర వనిత కవిత.

తండ్రికి తగ్గ తనయ
సమ్మె ఏదైనా.. సమరమేదైనా.. వేదికమీద ఎందరున్నా ఆమె స్వరమే భాస్వరం.. మైకు అందుకుని మాట మొదలెట్టిందా.. ఎవరైనా మంత్రముగ్ధులవ్వాల్సిందే..ఉద్యమంలో భాగస్వాములు కావాల్సిందే.. సకల జనుల సమ్మెలో కల్వకుంట్ల కవితది కీలక భూమిక.

ఓటమి భయంతోనే ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకొని బీజేపీ రాజ్యాంగబద్ధ సంస్థల ద్వారా దాడులు, అరెస్ట్‌లు చేయిస్తున్నది. ఓటమి భయంతో ప్రతిపక్షాలను లక్ష్యంగా చేయడం ఆ పార్టీ నైరాశ్యానికి ప్రతీక. ప్రతిపక్షాలపై ఎంత పెద్ద ఎత్తున దాడి చేస్తే బీజేపీకి అంత పెద్ద ఓటమి ఉంటుంది.
– అఖిలేశ్‌ యాదవ్‌ , ఎస్పీ అధ్యక్షుడు

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.