రాష్ట్రంలో 202425 విద్యాసంవత్సరానికి ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఎప్‌సెట్ పరీక్షాతేదీలు ఖరారయ్యాయి. ఈ పరీక్షలను మే 9 నుంచి 13 వరకు నిర్వహిస్తారు. ఈ ప్రవేశ పరీక్షను ఇదివరకు టీఎస్ ఎంసెట్‌గా పిలిచేవారు.
- పేరు మారుస్తూ ఉన్నతవిద్యామండలి ఉత్తర్వులు
- ఇంజినీరింగ్, అగ్రి, ఫార్మసీకి ఉమ్మడి ప్రవేశ పరీక్ష
- ఈ ఏడాది జరిగే 8 ప్రవేశపరీక్షల షెడ్యూల్ విడుదల
- మే 6న ఈసెట్.. 9నుంచి ఈఏపీసెట్, 23న ఎడ్‌సెట్
- జూన్ 3న లాసెట్.. 4, 5 తేదీల్లో ఐసెట్ నిర్వహణ
హైదరాబాద్, జనవరి 25 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో 2024,25 విద్యాసంవత్సరానికి ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఎప్‌సెట్ పరీక్షాతేదీలు ఖరారయ్యాయి. ఈ పరీక్షలను మే 9 నుంచి 13 వరకు నిర్వహిస్తారు. ఈ ప్రవేశ పరీక్షను ఇదివరకు టీఎస్ ఎంసెట్‌గా పిలిచేవారు. ఇకనుంచి టీఎస్ ఎప్‌సెట్‌గా మారుస్తూ ప్రభుత్వం గురువారం జీవో జారీ చేసింది. విభాగాల వారీగా తీసుకొంటే మే 9 నుంచి 11 వరకు ఇంజినీరింగ్, మే 12, 13 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మా విభాగం విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తారు.
ప్రవేశ పరీక్షల నిర్వహణ బాధ్యతలను మరోసారి జేఎన్టీయూహెచ్‌కే అప్పగించారు. నిరుడు అగ్రికల్చర్, ఫార్మసీ విభాగానికి ముందుగా పరీక్షలు జరగ్గా, ఈ ఏడాది ఇంజినీరింగ్‌తో ఎప్‌సెట్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఎప్‌సెట్ సహా రాష్ట్రంలో నిర్వహించే ఏడు ప్రవేశ పరీక్షల తేదీలను, నిర్వహించే వర్సిటీల వివరాలను ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం, ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్ లింబాద్రి, వర్సిటీల వీసీలు గురువారం ఆయా వివరాలను విడుదల చేశారు.
ఈసెట్‌తో ప్రారంభం
ఈ ఏడాది ప్రవేశ పరీక్షలు (సెట్స్) టీఎస్ ఈసెట్‌తో ప్రారంభంకానున్నాయి. ఈ ప్రవేశ పరీక్షను మే 6న నిర్వహించనుండగా, నిర్వహణ బాధ్యతలను ఉస్మానియా వర్సిటీకి అప్పగించారు. జూన్ 10 నుంచి 13 వరకు పీఈసెట్ పరీక్షలు జరుగుతాయి. ఎడ్‌సెట్ మే 23, లాసెట్ జూన్ 3, ఐసెట్ జూన్ 4, 5 తేదీల్లో, పీజీఈసెట్‌ను జూన్ 6 నుంచి 8 వరకు నిర్వహిస్తారు. ఇక ప్రవేశ పరీక్షల నిర్వహణ బాధ్యతలను నిరుడు నిర్వహించిన వర్సిటీలకే తిరిగి అప్పగించారు. అయితే ఒకరిద్దరు కన్వీనర్లు మారే అవకాశం ఉన్నది. రెండు రోజుల్లో ప్రవేశ పరీక్షల కన్వీనర్ల పేర్లను ప్రకటించనున్నారు. పరీక్షలను మే నెలలోనే పూర్తిచేయాలని భావించినా అదే సమయంలో టీసీఎస్ సంస్థ ఇతర పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తుండటంతో జూన్ రెండో వారం వరకు వెళ్లాయి. ఇక ఎప్‌సెట్ నోటిఫికేషన్‌ను ఫిబ్రవరి రెండోవారంలో విడుదల చేసే అవకాశం ఉన్నది.
కెపాసిటీ పెంపు
ఒక్క ఫిజికల్ ఎడ్యుకేషన్ సెట్ (పీఈసెట్) మినహా అన్ని ప్రవేశపరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. అయితే ఈ సారి పరీక్షలను తక్కువ సెషన్లలో, త్వరగా పూర్తిచేసేందుకు పలు చర్యలు చేపట్టారు. ఇందులోభాగంగా పరీక్షాకేంద్రాలు, సెంటర్ల సామర్థ్యాన్ని గణనీయంంగా పెంచారు. గతంలో ఒక సెషన్‌లో 25వేల మందికి మాత్రమే పరీక్షలను నిర్వహించే అవకాశముండగా, ఈ సామర్థ్యాన్ని రోజుకు 35వేల మందికి పెంచారు. దీంతో పరీక్షలు త్వరగా పూర్తికానున్నాయి.
సెట్ కమిటీ సమావేశం తర్వాతే..
పీఈసెట్, పీజీఈసెట్‌లో పలు మార్పుల చేసేందుకు ఉన్నత విద్యామండలి కమిటీలను నియమించింది. పీఈసెట్‌లో లాంగ్, జంప్, హైజంప్, వెయ్యి మీటర్ల పరుగులను తొలగించాలని, ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ద్వారానే అడ్మిషన్లు కల్పించాలని ఈ కమిటీ సిఫారసు చేసింది. ఇక పీజీఈసెట్‌లో తక్కువ మంది దరఖాస్తు చేసుకొన్న సబ్జెక్టులకు ప్రవేశపరీక్షల్లేకుండా ప్రత్యామ్నాయ పద్ధతుల్లో అడ్మిషన్లు నిర్వహించేందుకు మరో కమిటీని నియమించారు. ఆయా సెట్ కమిటీ సమావేశాల్లో ఈ అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. వీటిపై తది నిర్ణయం తీసుకొని, ఆయా విషయాలను నోటిఫికేషన్‌లో పొందుపరుస్తామని అధికారులు తెలిపారు.
మార్పులిలా..
- ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఎప్‌సెట్‌ను ఈ ఏడాది 100శాతం సిలబస్‌కు నిర్వహిస్తారు. నిరుడు ఫస్టియర్‌లో 70 శాతం, సెకండియర్‌లో 100 శాతం సిలబస్‌కు పరీక్షలుంటాయి.
- ఎంసెట్‌కు హాజరయ్యే జనరల్ క్యాటగిరీ విద్యార్థులు ఇంటర్ గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీల్లో 45 శాతం, రిజర్వుడు క్యాటగిరీ విద్యార్థులు ఈ మూడు సబ్జెక్టుల్లో 40 శాతం మార్కులు సాధించడం తప్పనిసరి. కరోనా నేపథ్యంలో గతంలో మినహాయింపునిచ్చారు.
- ఎంసెట్‌లో ఇంటర్ వెయిటేజీని నిరుడు శాశ్వతంగా ఎత్తివేశారు. దీంతో విద్యార్థులు నిక్షేపంగా ఎప్‌సెట్‌పైనే దృష్టిసారించవచ్చు.
- ఎప్‌సెట్ సహా అని రకాల కోర్సుల్లో ఉమ్మడి రాష్ట్రం అడ్మిషన్ల గడువు ఈ ఏడాది జూన్ 2తో ముగియనున్నది. ఈ ఏడాదితో ముగుస్తుందని భావించినా.. అంతలోపే నోటిఫికేషన్లు విడుదల కానుండటంతో ఓపెన్ కోటాలో 15శాతం సీట్ల అడ్మిషన్లకు ఈ ఒక్కసారికి ఏపీ విద్యార్థులు పోటీపడే అవకాశం ఉన్నది. మిగతా 85శాతం సీట్లను తెలంగాణ విద్యార్థులతో నింపుతారు.
పరీక్షలు, ఫలితాల్లో తప్పులుండొద్దు
ప్రవేశ పరీక్షల షెడ్యూళ్లను ఖరారు సందర్భంగా ప్రభుత్వం వర్సిటీల వీసీలకు గట్టి హెచ్చరికలు జారీచేసింది. ఎలాంటివి జరిగినా అందుకు వర్సిటీల వైస్‌చాన్స్‌లర్లదే బాధ్యత అని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం హెచ్చరించారు. ఈ సందర్భంగా జేఎన్టీయూ, ఉస్మానియా, కాకతీయ వర్సిటీల వీసీలతో గురువారం హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో సమావేశమయ్యారు. ప్రవేశ పరీక్షల నిర్వహణ సందర్భంగా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పరీక్షల్లో.. ప్రశ్నపత్రాల్లో.. ఫలితాల వెల్లడిలో తప్పులు జరుగవద్దని స్పష్టంచేశారు.
– బుర్రా వెంకటేశం

