తెలంగాణతోపాటు తనకు క్రిబ్‌కో సంస్థ సహకారం కొనసాగాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయనను క్రిబ్‌కో చైర్మన్ బీరేంద్ర సింగ్, ఎండీ అనితా రావత్‌తోపాటు ఢిల్లీ కో-ఆపరేటివ్ బ్యాంకు ప్రతినిధి క్రిషాంక్ మర్యాదపూర్వకంగా కలిసి, సన్మానించారు.
- మంత్రినయ్యానని నన్ను వదిలేయకండి
- మీ సహకారం ఎల్లప్పుడూ కొనసాగాలి
- మంత్రి పొన్నం ప్రభాకర్ భావోద్వేగం
- ఢిల్లీలో మంత్రిని సన్మానించిన క్రిబ్‌కో
హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణతోపాటు తనకు క్రిబ్‌కో సంస్థ సహకారం కొనసాగాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ ఆకాంక్షించారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయనను క్రిబ్‌కో చైర్మన్ బీరేంద్ర సింగ్, ఎండీ అనితా రావత్‌తోపాటు ఢిల్లీ కో-ఆపరేటివ్ బ్యాంకు ప్రతినిధి క్రిషాంక్ మర్యాదపూర్వకంగా కలిసి, సన్మానించారు. గతంలో క్రిబ్‌కో సభ్యునిగా పొన్నం ప్రభాకర్ అందించిన సేవలను కొనియాతుడూ నాటి అనుభవాలను గుర్తు చేసుకున్నారు.
అనంతరం మంత్రి పొన్నం భావోద్వేగానికి గురయ్యారు. చిన్న వయసులోనే మారెట్ కమిటీ చైర్మన్‌గా ఐదేండ్లు పనిచేశానని, క్రిబ్‌కో ప్రోత్సాహం వల్ల ఎంతో ఎదిగానని చెప్పుకొచ్చారు. ఆ ప్రోత్సాహాన్ని ఎన్నటికీ మర్చిపోలేనని తెలిపారు. ‘మీ ప్రోత్సాహం, ప్రజల ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని వాంఛిస్తున్నా. ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే. అలాగే నేను ఇప్పుడు మంత్రినైనా మీకు మాత్రం తమ్ముడినే. మీ ప్రేమాభిమానాలను ఎప్పుడూ పొందాలని కోరుకుంటున్నా. మంత్రి అయ్యానని నన్ను ఒదిలేయకండి’ అని విజ్ఞప్తి చేశారు.
