రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మసీ, నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఎప్‌సెట్‌కు దరఖాస్తులు భారీగా వస్తున్నాయి. ఎప్‌సెట్ పరీక్షలు నిర్వహించే సెంటర్ల పరిమితికి మించి దరఖాస్తులు వస్తున్నా యి. నిన్నటి(మంగళవారం) వరకు ఎప్‌సెట్ ఇంజినీరింగ్ విభాగానికి 2,50,919, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీకి 97,995, రెండింటికి హాజరయ్యే వారు 333 మంది చొప్పున మొత్తంగా 3,49,247 దరఖాస్తులొచ్చాయి. ఆలస్య రుసుంతో మే 1 వరకు దరఖాస్తు చేసుకునే అవకాశముంది.
ఈ నేపథ్యంలో దరఖాస్తులు మరిన్ని పెరిగే అవకాశం ఉన్నది. దీంతో అటు సెంటర్లలో ఖాళీలు లేక, ఇటు భారీగా దరఖాస్తుల వస్తుండటంతో జేఎన్టీయూ అధికారులు కొత్త సెంటర్లను ఏర్పాటు చేసే పనిలో బిజీ అయ్యారు. ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లోని ల్యాబ్ గదుల్లోనూ పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. దీంట్లో భాగంగా సెంటర్లు కేటాయించేందుకు వీలున్న ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల వివరాలను తెప్పించుకుంటున్నారు. అన్నీ సవ్యంగా ఉంటే ఆయా కాలేజీల్లో కొత్త సెంటర్లను ఏర్పాటు చేయనున్నారు.
మరోవైపు పరిమితి మించిన జోన్లను బ్లాక్ చేశారు. ఎప్‌సెట్ ఇంజినీరింగ్ పరీక్ష రాసేవారికి రెండు, మూడు రోజుల క్రితం వరకు హైదరాబాద్‌లోని నాలుగు జోన్లలో పరీక్ష కేంద్రాలు కేటాయించే పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు హైదరాబాద్-1, హైదరాబాద్-3 జోన్లను బ్లాక్ చేశారు. జోన్-1లో 45,923, జోన్ -3లో 39,835 సీటింగ్ కెపాసిటీ ఉండగా, ఈ రెండు జోన్ల పరిమితి మించడంతో ఆయా జోన్లను అధికారులు బ్లాక్ చేశారు.
హైదరాబాద్ జోన్-4 సామర్థ్యం 27 వేలు కాగా, ఇప్పటికే 26 వేల దరఖాస్తులు వచ్చాయి. జోన్-2 సామర్థ్యం 43,592 కాగా, ఇప్పటి వరకు 41 వేలకు పైగా వచ్చాయి. కొత్త దరఖాస్తుదారులకు ఈ జోన్లోనే పరీక్ష కేంద్రాలను కేటాయిస్తున్నారు. ఇంకా 4 వేలకు పైగా దరఖాస్తులొస్తే ఇవి కూడా బ్లాక్ చేయాల్సిందే.
ఫార్మసీ విద్యార్థుల కోసం కేటాయించిన సెం టర్లల్లో 22 వేల ఖాళీలు ఉన్నాయి. హైదరాబాద్ జోన్-1లో 2,445, జోన్-2లో 16,660 చొప్పున ఖాళీలు ఉన్నాయి. గతేడాది ఫార్మసీకి లక్షకు పైగా దరఖాస్తులు వచ్చా యి. దరఖాస్తుల స్వీకరణకు మరింత గడువు ఉంది. ఈ నేపథ్యంలో పరిస్థితిని చూసి దరఖాస్తులు తక్కువగా వస్తే ఫార్మసీ సెంటర్లల్లోని ఖాళీలను ఇంజినీరింగ్ విభాగం వాళ్లకు బదిలీ చేసే యోచనలో అధికారులు ఉన్నారు.
హైదరాబాద్ తర్వాత ఇంజినీరింగ్‌కు అత్యధికంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 11,900, ఉమ్మడి కరీంనగర్లో 10,770 సీటింగ్ సామర్థ్యం ఉండగా, మొత్తం నిండిపోవడంతో వీటినీ బ్లాక్ చేశారు.
నర్సంపేటలో ఇంజినీరింగ్‌కు 2,255, ఫార్మసీకి 1,353 మంది అభ్యర్థులకు పరీక్ష కేంద్రం కేటాయించే వీలుండగా, సమీప ప్రాంతాల నుంచి భారీగా దరకఖాస్తులు రావడంతో అక్కడ పరీక్ష కేంద్రం కేటాయింలేని పరిస్థితి ఏర్పడింది. సత్తుపల్లిలో ఇంజినీరింగ్ 2,085, ఫార్మసీకి 1,251 సామర్థ్యం ఉండగా, పరిమితి మించడంతో బ్లాక్ చేశారు అధికారులు.
ఇది కూడా చదవండి: రేవంత్ రెడ్డిలో కలవరం..కుట్ర పన్నుతున్న కాంగ్రెస్..సర్వేలో విస్తుపోయే నిజాలు.!