Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

ఏలీ ఏలీ లామా సబక్తానీ!

TelanganapressBy TelanganapressJanuary 9, 2024No Comments

Sunday Stories

‘నమస్తే తెలంగాణ, ముల్కనూరు ప్రజాగ్రంథాలయం’ సంయుక్తంగా నిర్వహించిన ‘కథల పోటీ-2022’లో తృతీయ బహుమతి రూ.10 వేలు పొందిన కథ.

‘ఎనభై నాలుగేళ్ల ఆ పెద్దాయన.. ఫాదర్‌ స్వామి బెయిల్‌ దొరకని కేసులో అరెస్టయ్యారు’.. టీవీ చానెళ్లలో, సామాజిక మాధ్యమాల్లోనూ ప్రముఖంగా వినిపిస్తున్న వార్త. ఆ వార్త వినగానే పీటర్‌ మెదడు మొద్దుబారి నట్టయ్యింది. అందరి మాటలు నూతిలోంచి వినిపిస్తున్నట్టుగా అనిపిస్తున్నాయి. ఆయనతో దాదాపు నలభై ఏళ్లుగా పరిచయం. ఒక పత్రికా విలేకరిగా బడుల్లోనూ, అడవుల్లోనూ ఆయనతో కలిసి నడిచాడు. తిరుచిరాపల్లిలో ఒక రోమన్‌ కేథలిక్‌ ఫాదర్‌గా తనకు పరిచయమయ్యాడు ఆయన.

పీటర్‌కు చాలా చిరాగ్గా ఉంది, బాధగా కూడా ఉంది. అసలే లెంట్‌ దినాలు. గత ముప్పయి రోజులుగా ఉపవాసం. ఒంటిపూట భోజనం. ఈ వయసులో తను ఇలా ఉపవాసాలు చేస్తున్నా, చెక్కుచెదరకుండా ఎనర్జిటిక్‌గా తిరగగలుగుతున్నాడంటే.. అది స్వామిగారి సావాసం. ఆయనిచ్చిన ఆత్మస్థయిర్యం. ఆయన్ను తను మొదట చూసింది విజయవాడ గుణదల మేరీమాత గుడిలో. లక్షలాది భక్తులతో కలిసి నడుస్తూ కనిపించాడు. గుడిలో ఆయన ఉపన్యాసం ఇస్తూ మేరీమాత దుఃఖాన్ని తన దుఃఖంగా గొంతులో పలికించాడు. సిలువపై యేసుక్రీస్తును సైనికులు పక్కలో ఈటెతో పొడిచిన దృశ్యం చూసిన ఆ తల్లి మేరీమాత తన పక్కలో దిగబడిన ఖడ్గంగా తల్లడిల్లిందని ఆయన విలపించాడు. ఇప్పుడు ఆయన జైలుపాలు కావడంతో తనకూ గుండెల్లో కత్తి దిగినట్టుగా అనిపిస్తున్నది. ఆయనతో రెండో ఇన్నింగ్స్‌లో ఆ జార్ఖండ్‌ అటవీ ప్రాంతంలో తిరిగిన రోజులు గుర్తుకొస్తున్నాయి. అదొక అడవి. అప్పటికి ఇంకా జార్ఖండ్‌ రాష్ట్రంగా ఏర్పడలేదు. కొండల మీద ఆకుపచ్చని తివాచీ పరిచినట్టున్న పంట భూములు, అక్కడక్కడా విసిరేసినట్టున్న ఇళ్లు, ఆ ఇళ్ల మధ్యలో కాస్త విశాలంగా ఉన్న కాంపౌండ్‌లో బంగాళా పెంకులతో చేసిన చిన్న ఇల్లు. బస్సు దిగి ఆ ఇంటి వైపు అడుగులు వేస్తుంటే ఇంటి గేటు దగ్గరే ఎదురుపడ్డాడు.. తను కలవాల్సిన ఆ పెద్దాయన. మెడలో మఫ్లర్‌, నున్నగా గీసిన గడ్డం, పల్చటి జుట్టు అక్కడక్కడ తెల్లగా మెరుస్తూ. మనిషి సన్నగా, పొడుగ్గా, తెల్లగా ఉన్నాడు.

“నమస్కారం” అన్నాడు పీటర్‌. ఒక్కసారి పరిశీలనగా చూసి, గుర్తొచ్చినట్టు నవ్వాడు. దాదాపు అంతకుముందు ఇరవై ఏళ్ల క్రితం విజయవాడ గుణదల మేరీమాత ఉత్సవాల్లో సిలువ మోసే ఒక కేథలిక్‌ పూజారిగా చూశాడు. ఇప్పుడు ఇక్కడ అడవిబిడ్డల మధ్య వారి హక్కుల కోసం పోరాడుతున్న ఒక యోధుడిగా ప్రత్యక్షమయ్యాడు. “మీ గురించి ఒక డాక్యుమెంటరీ, ఆ తర్వాత దాని ఆధారంగా ఒక నాటకం రాసే ప్రయత్నం.. అందుకే వచ్చాను” అన్నాడు పీటర్‌.

ఆ మాటలకు.. “ఫోన్లో చెప్పారుగా.. రండి. ఒకచోటుకు తీసుకెళ్తాను” అంటూ ముందుకు నడిచాడు. నడుస్తున్న ఆయన చేతులు రుద్దుకుంటున్నాడు. అవి చిన్నగా కంపిస్తున్నాయి. వేళ్లు వణుకు తున్నాయి.

“బాగా చలిగా ఉన్నట్టుంది” అన్నాడు పీటర్‌.
దానికి ఆయన చిన్నగా నవ్వి.. “మీరనుకుంటున్న చలి వల్ల వచ్చిన వణుకు కాదు. ఇది పార్కిన్సన్‌ జబ్బు. పక్షవాతానికి ముందు దశ. ఇంకా ప్రారంభంలోనే ఉంది. మందులు వాడుతున్నాను” అన్నాడు.

అలా అంటూనే ఆ రోడ్డు దాటి కొండ వైపు నడక మొదలెట్టాడు. కొండకు దిగువన చుట్టూ ఫెన్సింగ్‌ వేసిన ఇంటి దగ్గర ఆగిపోయాడు ఆయన. రెల్లుగడ్డి కప్పిన ఒక చిన్న ఇల్లు. చుట్టూ మామిడి చెట్లు. బాగా పండిన మామిడి పళ్లు.. కొమ్మల మీద నిండుగా కనిపిస్తున్నాయి. ఇంట్లోంచి యాభై ఏళ్ల ఓ వ్యక్తి బయటికి వచ్చి నమస్కరించాడు. ఒక నులక మంచం తీసుకువచ్చి వేశాడు. ఇద్దరూ కూర్చున్నారు. అప్పటికి ఉదయం పది అయ్యింది. ఎండ చురుక్కుమంటున్నా ఆ చెట్ల కింద మంచం మీద కూర్చున్న తమకు చల్లగానే అనిపిస్తున్నది.ఆ వ్యక్తి పొట్టిగా, బలంగా ఉన్నాడు. చప్పిడి ముక్కు, గుబురుగా పెరిగిన జుట్టు, అంతే గుబురుగా పెరిగిన గడ్డం, మీసాలూ..

“జాగూ జాగూ” అని పిలిచాడు ఆ వ్యక్తి.లోపలి నుంచి పదిహేనేళ్ల కుర్రాడు బయటికొచ్చాడు. ఆ కుర్రాడు తన కొడుకు కాబోలు! అతడు ఆ అబ్బాయికి ఏదో చెప్పాడు. అబ్బాయి గబగబా ఆ మామిడి చెట్టు ఎక్కాడు. కొమ్మల పైకి ఎగబాకి, పళ్లను కోసి కిందికి విసిరాడు. కింద నుంచొని ఏ కొమ్మ వైపు పండు కోయాలో సూచనలు ఇస్తున్నాడు అతని తండ్రి. అది తు.చ. తప్పకుండా పాటిస్తున్నాడు ఆ కుర్రాడు. చిటారు కొమ్మన ఆకాశం వైపు ఉన్న ఆ భాగంలో బాగా పండిన మామిడి పళ్లు పచ్చగా మెరుస్తూ కనిపిస్తున్నాయి. అవి తప్ప మిగతా పండ్లను మాత్రమే కోస్తున్నాడు ఆ కుర్రాడు, తండ్రి సూచన మేరకు. ఐదు నిమిషాల్లో కిందికి దిగాడు. కోసిన కొన్ని పళ్లు కడిగి ఇద్దరికీ పళ్లాల్లో పెట్టి ఇచ్చాడు ఆ కుర్రాడు. పీటర్‌కు ఆశ్చర్యమనిపించింది. వెంటనే అన్నాడు..

“బాగా పండిపోయినవాటిని వదిలేశారేం” అని. అందుకు ఆ ఆదివాసి తలెత్తి ఆకాశం వంక చూస్తూ, రెండు చేతులూ జోడించి..

“ఆ చిటారు కొమ్మల మీద ఉన్న మామిడి పళ్లు పక్షుల కోసం. అవి తినటానికి అనువుగా ఉంటాయని వదిలేశాం” అని అన్నాడు. స్వామిగారు అతని చేయిని ఆప్యాయంగా స్పృశించారు.

“ఈ అడవి బిడ్డలే ప్రకృతికి నిజమైన వారసులు. ప్రకృతి నుంచి వచ్చిన వాటిని తమతోటి ప్రాణులకు కూడా సమానంగా పంచుతున్నారు. అందుకే నాకు వీళ్లంటే ఇష్టం. వీళ్ల కోసం ఏదైనా చేయాలి” అన్నాడు.. పీటర్‌ వంక చూస్తూ.

పీటర్‌కు ఇంకా ఆశ్చర్యంగాను, విస్మయంగాను ఉన్నాయి.. ఆ ఆదివాసి చెప్పిన మాటలు.

‘నిజంగా ప్రకృతి కోసం ప్రాణం ఇచ్చే మనుషులే వీళ్లు. పక్షుల్ని, పిట్టల్ని కూడా తమ తోబుట్టువుల్లా భావిస్తున్నారు’ అనుకున్నాడు. ఆరోజు సాయంత్రం స్వామిగారితో కలిసి ఆ ఊళ్లో జరిగే సంతకు బయల్దేరాడు. ఆ సంత చాలా హడా వుడిగా ఉంది. ఒకవైపు కిరాణా సరుకులు అమ్మే దుకాణాలు, మరోవైపు బట్టల వ్యాపారులు, ఇంకోచోట తినుబండారాలు అమ్మే దుకాణాలు.. అలా రద్దీగా ఉన్న ఆ ప్రాంతంలో ఇద్దరూ నడుస్తున్నారు. ఆ సమయంలో ఒకామె ఒక చేత్తో చిన్న పిల్లవాడితో, రెండో చేత్తో కోడిపుంజుతో ఆ సంతకు వచ్చింది. అరుస్తున్నది హిందీలో. పీటర్‌కు అర్థమైన విషయం.. ఆ కోడిని అమ్మకానికి పెడుతున్నదని. ఆవిడ పక్కనే పదేళ్ల వయసున్న కుర్రాడు. నెత్తి మీద బుట్ట. ఆ బుట్టలో ఇంకా కోళ్లు ఉన్నాయి. ఇంతలో మోటార్‌ సైకిల్‌ మీద బాగా శబ్దం చేసుకుంటూ వచ్చిన ఆజానుబాహుడు ఆమె చేతిలోని కోడిపుంజును లాక్కుని ఒక నలిగిన ఐదు రూపాయల కాగితం ఆమె మీదకు విసిరేసి వెళ్లిపోయాడు.

ఆమె ఏడుస్తూ, తిడుతూ, అతని బండి వెనకాల పరిగెత్తింది. ఆ మాటలను బట్టి అర్థమైన విషయం..

‘నువ్విచ్చే ఐదు రూపాయలు సరిపోదు. దీని ఖరీదు పాతిక రూపాయలు’ అని. అయితే ఆ వ్యక్తి అప్పటికే వెళ్లిపోయాడు. ఆ దృశ్యం చూసిన స్వామిగారు, అప్పుడే అక్కడికి వచ్చిన ఆ ఊళ్లో ఎన్జీవో నడిపే వ్యక్తితో..

“అయ్యో అయ్యో! నిజాయితీగా, నిబద్ధతగా బతుకుతున్న ఈ ఆదివాసీ బిడ్డలకు అన్యాయమే జరుగుతున్నది. మనం ఏమీ చేయలేమా?” అన్నాడు. ఆ వ్యక్తి ఆయన మాటలకు ఒక క్షణం ఆలోచించి..

“ఈ సంతలో అంగళ్లన్నీ ఆడవాళ్లే నడుపుతున్నారు. ఒక మగ వ్యక్తినైనా మీరు చూశారా?” అన్నాడు.
స్వామిగారు ఒక్కసారి ఆ సంత వైపు దృష్టి సారించి..

“మైగాడ్‌.. ఒక్క మగపురుగూ లేదు” అన్నాడు.

వెంటనే అతను..

“మీరు చెప్పినట్టు అన్యాయం జరుగుతున్నదని ఆక్రోశించిన ఈ ఆడవాళ్ల యజమానులు జైలు పాలవుతున్నారు. అందుకే ఈ ఊళ్లోనూ, చుట్టుపక్కల మనకు ఆడబిడ్డలే కనిపిస్తున్నారు” అన్నాడు.

ఆ రోజు నుంచి ఆయన అడుగులు అక్కడ బలంగా పడ్డాయి. ఆ తర్వాతి రోజు ఆ ఊళ్లో గ్రామసభ పెట్టారు.

“మీరు నిలబడ్డ ఈ నేల కింద ఎన్నో సహజ సంపదలు ఉండటమే మీకు ఎదురవుతున్న విషాదం. మీ హక్కుల కోసం రాజ్యాంగంలో ఐదో షెడ్యూలు వచ్చింది. మీకు కూడూ, గుడ్డా, నీడా ఇవ్వమని అడగాలని రాజ్యాంగమే చెబుతున్నది. మైనింగ్‌లు, డ్యామ్‌లు, థర్మల్‌ ప్రాజెక్టులు.. అంతా అభివృద్ధే! మనం వాటిని ఆహ్వానించాల్సిందే! అలాగే వాటి మూలంగా నిరాశ్రయులవుతున్న మీకు గూడు ఏర్పర్చమనడం, మీ కడుపులకు ఒక ముద్ద ఇవ్వమనడం కూడా న్యాయమే!”..

ఆయన మాట్లాడిన భాష వారికి పూర్తిగా అర్థం కాకపోయినా, ఆయన మనసు మాత్రం వారికి అవగతమైంది. వారి గుండెల్లో ఆయన కొలువుతీరాడు.

“నాన్నా! ఏంటి అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. ఉపవాసాలు చేస్తున్నారు కదా! విశ్రాంతి తీసుకోండి”.. అన్న మాటలతో ఇహంలోకి వచ్చాడు పీటర్‌. తన ల్యాప్‌టాప్‌ను పక్కన పెట్టి..

“చాలా ఏళ్లుగా రాస్తున్న ఈ నాటకం ముగింపునకు వచ్చేసింది” అంటూ సోఫాలో వెనక్కి వాలాడు.

“ఆ స్వామిగారి కథే కదా? ఇప్పుడాయన జైలులో ఉన్నారు. ఎలా ముగించారు?” అన్నాడు కొడుకు.

“జైలుకు వెళ్లినట్టే ముగించాను..”

“అయితే మీకు తెలుసన్నమాట..” అన్నాడు కొడుకు విచిత్రంగా చూసి.

“శ్రీశ్రీ చెప్పినట్టు.. ‘రెండు రెళ్లు నాలుగు అన్నందుకు గూండాలు గండ్రాళ్లు విసిరే సీమలో క్షేమం అవిభాజ్యం అంటే జైళ్లు నోరు తెరిచే భూమిలో..’ అదే జరుగుతున్నది. అమాయకులు జైళ్లలో మగ్గుతున్నారని ప్రజాప్రయోజన అర్జీలను దాఖలుచేసిన ఆయన ఇప్పుడు జైలులో ఉన్నాడు. ఆయనకు ఇప్పుడు అర్జీ ఇచ్చేదెవరు?” అన్నాడు పీటర్‌.

కొడుకు విస్మయంగా చూస్తూనే ఉన్నాడు.ఇంతలో ఎవరో తలుపు తట్టిన శబ్దం.తెరిచేసరికి, ఎదురుగా ఒక పోలీస్‌. వారు ప్రశ్నార్థకంగా చూసేసరికి..

“సార్‌! పీటర్‌గారు ఎవరు?” అన్నాడతను.
“నేనే!” అన్నాడు పీటర్‌.
“మిమ్మల్ని టూ టౌన్‌ సీఐగారు పిలుస్తున్నారు. వస్తే ఒక పావుగంటలో వెళ్లిపోవచ్చు” అన్నాడతను.

కొడుకు అనుమానంగా చూస్తూ..

“దేనికి?” అని అడిగాడు.

“ఏమో సార్‌.. రండి కింద జీప్‌ ఉంది”.

“సరే! వస్తాం.. మా కారులో మీ వెనకే. పదండి” అంటూ.. తండ్రితో బైటికి నడిచాడు కొడుకు.
కారు డ్రైవ్‌ చేస్తున్న కొడుకు ఆ పోలీస్‌ జీప్‌ను అనుసరించి ముందుకు కదిలాడు. కారెక్కిన పీటర్‌ మౌనంగా ఉన్నాడు. కొడుకు మాత్రం లోలోపల మదనపడుతున్నాడు. తనలో తాను గొణుక్కుంటున్నాడు.

“ఏంటండీ! ఏం సాధించారు మీరు? ఇన్నేళ్లుగా అడవుల వెంటపడి వార్తా కథనాలు, నాటకాలు అనుకుంటూ. అమ్మకు టీచర్‌ ఉద్యోగం ఉంది కాబట్టి సరిపోయింది. నన్ను లాయర్‌ను చేసింది. ఈ సమయంలో పోలీస్‌ స్టేషన్ల వెంబడి తిరగడం ఏమిటో! ఆ స్వామిగారిని జైల్లో వేశారు కదా! ఆయనతో తిరిగిన వాళ్లందరినీ ఎంక్వయిరీ చేస్తున్నారనుకుంటా. వాళ్లు ఏమడిగినా.. ‘నాకు తెలియదు’ అనే చెప్పండి. ఆయన మీద వార్తా కథనాలు, ఒక నాటిక రాయడం కోసమే తిరిగానని చెప్పండి.

ఈ వయసులో జైలు గదులలో కాలక్షేపం చేద్దామనుకోకండి. మిగతా విషయాలు నేను చూసుకుంటాను”.. కరాఖండిగా చెప్పాడు కొడుకు.‘స్వామిగారు ఎవరో నాకు తెలీదని చెప్పాలా? ఆయన శిష్యుడిగా ఆయన సిద్ధాంతాలకు ఆకర్షితుడినై ఆయన వెంట ఇన్నేళ్లూ నడిచాను. ఆయనతోపాటు అడవి బిడ్డల హక్కుల కోసం ఉద్యమం బాట పట్టాను. అదంతా మర్చిపోయి ఆయనెవరో తెలియదనాలా? ఈ పీటర్‌ బొంకడమా!’.. ఆ సమయంలో క్రీస్తును బంధించినపుడు పారిపోయిన శిష్యులలో ఒకడైన ఆనాటి పీటర్‌ గుర్తుకొచ్చాడు. క్రీస్తు ఎవరో తెలియదని బొంకాడు. ఆ విషయాన్ని క్రీస్తు ముందే ఊహించాడు. మనసంతా రకరకాల ఆలోచనలతో ముక్కలు ముక్కలయ్యింది పీటర్‌కు. పావుగంటలో పోలీస్‌ స్టేషన్‌లో ఉన్నాడు. కొడుకు సీఐతో మాట్లాడుతూ..

“ఈయన లెంట్‌లో ఉన్నారు. అరవై ఏళ్లు దాటాయి. ఒంటిపూట భోజనం. దయచేసి తొందరగా వదిలెయ్యండి” అన్నాడు.

ఆ సీఐ.. పీటర్‌ వంక పరిశీలనగా చూశాడు. ఏవో ప్రశ్నలతో, పీటర్‌తో సంభాషణ మొదలుపెట్టాడు. కొడుకు చెప్పమన్నట్టుగానే అన్నిటికీ తల అడ్డంగా ఊపాడు పీటర్‌. పావుగంట గడిచింది. అతనికి విసుగొచ్చినట్టుంది.

“మీరిక వెళ్లవచ్చు. అవసరమైనప్పుడు పిలుస్తాం” అంటూ తన పనిలో నిమగ్నమయ్యాడు ఆ ఇన్‌స్పెక్టర్‌.

‘థ్యాంక్స్‌!’ చెప్పి బైటికి వచ్చేశారు.
“హమ్మయ్య!” అంటూ నిట్టూర్చాడు కొడుకు, కారులో కూర్చుంటూ. పీటర్‌ మెదడు మాత్రం మొద్దుబారిపోయింది.

‘ఆయన నాకు అసలు తెలియదు!’ అనడం మనసులో బాధను కలిగించింది.

తరువాతి రోజు ఉదయం దినపత్రిక చదువుతున్న కొడుకు పేపర్‌లోంచి తలెత్తి..

“స్వామిగారికి తాగడం కష్టమవుతున్నదట. గ్లాసు పట్టుకోలేకపోతున్నాడు. అందుకోసం సిప్పర్‌, స్ట్రా అడిగాడట జైలు అధికారిని” చెప్పాడు కొడుకు.
“అవును! ఆయనకు పార్కిన్సన్‌ జబ్బు ఉంది చాలా ఏళ్లుగా. అయినా వాళ్లు నిరాకరించారట కదా!” తను ఆ మాట చెప్పినప్పుడు పీటర్‌ కళ్లలో నీళ్లు తిరిగాయి.

‘జైలు గదిలోనే నన్ను చచ్చిపోనివ్వండి. అది మా ఊరు జైలయితేనే బాగుంటుంది. మా వాళ్ల మధ్య చనిపోతాను. అదే నా అంతిమ కోరిక’.. ఆయన జైలులో నుంచి ఇచ్చిన స్టేట్‌మెంట్‌ జ్ఞాపకానికి వచ్చి మరింత ఉద్వేగానికి లోనయ్యాడు పీటర్‌..

వారం రోజుల తర్వాత.. నిద్రపోతున్న పీటర్‌ను లేపుతూ చెప్పాడు కొడుకు.“స్వామిగారికి కొవిడ్‌ సోకిందట. ఆసుపత్రిలో చేర్చారు”..

ఆ మాటలతో దిగ్గున లేచాడు.‘ఎనభై నాలుగేళ్ల వయసులో ఆయనకేంటీ కష్టం?’ అనుకుంటూనే.. కళ్లు మూసుకొని రెండు చేతులూ జోడించి..

“ప్రభూ! ఆయన్ను కాపాడు..’ అనుకున్నాడు మనసులో.

మరోవారం తర్వాత ఆరోజు శుభ శుక్రవారం. ఉదయమే ఇంటిల్లిపాది చర్చికి వచ్చేశారు. తెల్ల అంగీ వేసుకున్న ఫాదర్‌, పావురాయిలా ఆ చర్చిలోని వేదికపై నుంచొని ఉపన్యసిస్తున్నాడు. క్రీస్తును సిలువ వేసే ఘట్టం గురించి వివరిస్తున్నాడు. ఆ ప్రసంగం వింటున్నాడు పీటర్‌. అయినా తన మనసును కేంద్రీకరించలేక పోతున్నాడు. కొవిడ్‌తో పోరాడుతున్న స్వామిగారి మీదే ఉంది మనసు. అస్థిమితంగా అటూ ఇటూ కదులుతున్నాడు. అయినా ఫాదర్‌ చెబుతున్న మాటలవైపే దృష్టి సారించాడు బలవంతంగా.

“క్రీస్తును దోషిగా నిలబెట్టింది నాటి రాచరిక వ్యవస్థ. ‘క్రీస్తు నిరపరాధి. ఏ నేరం చేయలేదు. ఆయన్ను విడిచిపెట్టాలి’ అన్నాడు అప్పటి న్యాయమూర్తి పొంతి పిలాతు. అయినా ఆయన మాటలు వినలేదు. క్రీస్తుకు సిలువ వేయమని కేకలు పెట్టారు. తప్పని పరిస్థితుల్లో సిలువపై యేసును వేలాడదీస్తూ చనిపోయేలా మరణశిక్ష విధించాడు ఆ న్యాయాధిపతి”..

ఆ మాటలు విన్న పీటర్‌ మనసు మనసులో లేదు. పైన ఫ్యాన్‌ తిరుగుతున్నా ఉక్కిరిబిక్కిరిగా ఉంది. ఫాదర్‌ తన ఉపన్యాసాన్ని సిలువపై క్రీస్తు చెప్పిన సప్త సందేశాల వైపుగా సాగించారు.

ఇంతలో సెల్‌ఫోన్‌లో ఏదో వర్తమానం.
‘స్వామిగారి పరిస్థితి క్షీణించిందట. వారిని ఆసుపత్రిలో ఐసీయూలోకి మార్చారట’..
ఆ వర్తమానంతో అంతవరకూ ఆయన బాగుంటాడన్న ఆశ అడియాస అయినట్టు అనిపించింది పీటర్‌కు. మళ్లీ గతంలోకి వెళ్లాడు. ఉద్యమాల వెంట ఆయనతో గడిపిన రోజులు గుర్తుకొచ్చాయి.

“ఈ భూమిపుత్రులకు తమ నేలపై ఉన్న హక్కు నేల కింద లేదా? లోపలి నిధి నిక్షేపాలు వేరేవారి సొంతమైతే వారు కోటీశ్వరులవుతున్నారు. వీరు ఆకలిచావులతో ప్రాణాలు కోల్పోతున్నారు. నీరు, నేల, అడవి.. ఇవి అడవిబిడ్డల సొత్తు అంటున్నది చట్టం. ‘మాకు నగరాలు వద్దు. ఈ అడవిలో మా మానాన మమ్మల్ని బతకనివ్వండి!’ అంటున్న వారి వ్యవసాయ భూముల్ని వ్యవసాయేతర భూములుగా మారుస్తున్నారు. నగరాలు ఇప్పటికే కాంక్రీట్‌ జంగిల్స్‌లా మారాయి. ఇక అరణ్యాలు నరికి పాతరేస్తే మనిషి తినేది అన్నమా

లేక డబ్బుల కట్టలా?”..
ఇలా ఆయన వణుకుతున్న గొంతుకతోనే అరిచాడు. ఆక్రోశించాడు. సృష్టి ఆరంభమైనప్పటి నుంచి ఏ మహాపురుషుడైనా గొంతెత్తి సత్యం చెప్తున్నప్పుడల్లా వారిని సిలువ వేసో, షూట్‌ చేసో, విషమిచ్చో..

ఇంతలో సిలువపై క్రీస్తు చెప్పిన మొదటి మాట గురించి ఫాదర్‌ చెబుతున్నారు. వెంటనే ఇహంలోకి వచ్చాడు పీటర్‌. ‘తండ్రీ! వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు’.. ఆ క్షమించబడినవారిలో తను ఉన్నాడా?.. పీటర్‌ నిట్టూర్చాడు. పక్క బెంచీలో కూర్చున్న కొడుకు మెల్లగా వచ్చి చెవిలో చెప్పాడు. ఆ మాటలతో తన కింద ఉన్న భూమి చీలిపోయి దానిలో కుంగిపోయినట్టుగా అయిపోయింది పీటర్‌ పరిస్థితి. ఫాదర్‌గారు సిలువపై క్రీస్తు చెప్పిన నాలుగో మాట గురించి చెప్తున్నారు.

‘ఏలీ ఏలీ లామా సబక్తానీ! అంటే.. దేవా నాదేవా నన్నేల చెయ్యి విడిచితివి’.. పీటర్‌లో దుఃఖం నిలువెల్లా ముంచెత్తింది.

‘ఆ ముసలి శరీరానికి ఎర్రవస్త్రం కప్పుతారు. యోహాను సువార్త చదువుతారు. ఆ ఎరుపు రంగు అమరత్వానికి గుర్తు. అంతే!’ అనుకున్నాడు పీటర్‌.

ఫాదర్‌ స్వామిగారు, అరెస్టు కాకముందు చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి పీటర్‌కు.‘పక్షి పంజరంలో ఉన్నా పాడుతుంది’.. ‘అవును పాడుతుంది! వాటితోపాటు పంజరంలో లేని పక్షులు కూడా గొంతు కలుపుతాయి’ అనుకున్నాడు పీటర్‌.

‘తండ్రీ! నీ చేతికి నా ఆత్మను అప్పగించు కొనుచున్నాను’..
ఆ చర్చిలోని ఫాదర్‌ క్రీస్తు చివరిగా చెప్పిన ఆ ఏడవ మాటను చెబుతూ.. ఆ చర్చిలోని అందరి వంకా చూసి రెండు చేతులూ పైకెత్తారు. ఆ మాటలు మననం చేసుకుంటూనే బయటికి వచ్చాడు అరవై ఏళ్ల పీటర్‌.. దుఃఖ భారం మోసుకుంటూ!

– డాక్టర్‌ ఎమ్‌. సుగుణరావు 97046 77930

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.