ఓ వైపు సాగునీరులేక పంటలు ఎండిపోయి, మరోవైపు అకాల వర్షాలతో చేతికొచ్చిన పంట దెబ్బతిని రైతులు కన్నీళ్లు పెడుతుంటే కాంగ్రెస్ సర్కారు కనికరించడంలేదని పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్‌ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు.

- రైతులను గాలికొదిలి రాజకీయాలకు ప్రాధాన్యం
- పాలన మరిచి కేసీఆర్ ప్రభుత్వంపై నిందలు
- పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్‌ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ధ్వజం
- ఆశీర్వదిస్తే అభివృద్ధి చేస్తానని ప్రజలకు విజ్ఞప్తి
- పెద్దపల్లి, సుల్తానాబాద్‌లో విస్తృత ప్రచారం
పెద్దపల్లి/ సుల్తానాబాద్ ఏప్రిల్ 12: ఓ వైపు సాగునీరులేక పంటలు ఎండిపోయి, మరోవైపు అకాల వర్షాలతో చేతికొచ్చిన పంట దెబ్బతిని రైతులు కన్నీళ్లు పెడుతుంటే కాంగ్రెస్ సర్కారు కనికరించడంలేదని పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్‌ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి పాలనను గాలికొదిలి రాజకీయాలకు ప్రాధాన్యమిస్తున్నారని విమర్శించారు. శుక్రవారం ఆయన పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డితో కలిసి సుల్తానాబాద్, పెద్దపల్లిలో విస్త్రతంగా ఎన్నికల ప్రచారం చేశారు. ఉదయం సుల్తానాబాద్‌లో వాకర్లతో ముచ్చటించి సమస్యలు తెలుసుకున్నారు. మార్కెట్‌కు వెళ్లి వ్యాపారులు, వినియోగదారులను ఓట్లడిగారు.
అనంతరం పెద్దపల్లి జెండా చౌరస్తాలోని దుకాణాసముదాయాల్లో వ్యాపారులు, ప్రజలను అప్యాయంగా పలకరిస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఆయాచోట్ల మాట్లాడారు.రేవంత్‌రెడ్డి సీఎం హోదాను మరిచి ప్రతిపక్ష నాయకుడిలా మాట్లాడడం సిగ్గు చేటన్నారు. ప్రజా సంక్షేమం, అభివృద్ధిని పక్కనబెట్టి గత ప్రభుత్వాన్ని నిందించడమే పనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. ముస్లింల అత్యంత పవిత్ర రంజాన్ పండుగకు తోఫా కూడా ఇవ్వలేదన్నారు. ఎన్నికల ముందర ఇచ్చిన హామీ మేరకు వడ్లకు 500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉన్నారని, అన్ని వర్గాలను సమన్యాయం చేశారని గుర్తు చేశారు. తాను కార్మిక కుటుంబానికి చెందిన వాడనని, ఒకసారి ఆదరించి ఆశీర్వదిస్తే పెద్దపల్లి పార్లమెంట్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ చేశారు.
మతాలు, కులాల మధ్య చిచ్చు పెట్టే కాంగ్రెస్, బీజేపీకి రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఓటు ద్వారా తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పెద్దపల్లి, సుల్తానాబాద్ ఎంపీపీలు బండారి స్రవంతీ శ్రీనివాస్, పొన్నమనేని బాలాజీరావు, బీఆర్‌ఎస్ పట్టణాధ్యక్షుడు ఉప్పు రాజ్‌కుమార్, నాయకులు దాసరి ఉష, మార్కు లక్ష్మణ్, కొయ్యడ సతీశ్, ఎన్ సరేశ్, కార్తీక్, తబ్రేజ్, బెక్కం ప్రశాంత్, చంద్రమౌళి, ఫహీం, శ్రీకాంత్, అయిల రమేశ్, పురం ప్రేమ్‌చందర్‌రావు, బుర్ర శ్రీనివాస్, దీకొండ భూమేశ్, శీలం శంకర్, ఫకీర్‌యాదవ్, కౌన్సిలర్లు, కూకట్ల గోపి, అనుమాల అరుణబాపురావు, రెవెల్లి తిరుపతి, గుర్రాల శ్రీనివాస్, బోయిని రాజమల్లయ్య, జూపెల్లి సందీప్‌రావు, గోట్టం మహేశ్, రఫీక్, పెగడ పరుశరామ్, బండి సంపత్ ఉన్నారు.