కాంగ్రెస్‌లో కొత్త కమిటీ కలకలం రేపుతోంది. పీసీసీ కొత్త కమిటీపై చర్చ జోరందుకుంది. పార్టీ కోసం పని చేసిన వారికి కాకుండా కొత్త వారికి, జూనియర్లకు ప్రధాన కమిటీలు ఇస్తున్నారని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో అసంతృప్త నాయకత్వం తెరపైకి వచ్చింది. ఇందులో భాగంగానే కొత్త కమిటీపై పార్టీ సీనియర్ నేత కొండా సురేఖ అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె బాటలో పీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి బెల్లయ్యనాయక్ అడుగు పెట్టారు. ఆయన తన పదవికి రాజీనామా చేశారు. కొత్త కమిటీలో తనకు స్థానం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొండా సురేఖ తనకు స్థానం కల్పించిన ఎగ్జిక్యూటివ్ కమిటీకి రాజీనామా చేశారు. అపార రాజకీయ అనుభవం ఉన్న తనకు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీలో స్థానం కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు రాజకీయ వ్యవహారాల కమిటీలో కాకుండా కార్యవర్గంలో స్థానం కల్పించాలా అని ప్రశ్నించారు. ఇది తనను అవమానించడమేనని అన్నారు. తాను ఎగ్జిక్యూటివ్ కమిటీలో పనిచేయాల్సిన అవసరం లేదని, అందుకే రాజీనామా చేస్తానని ప్రకటించారు.
