KCR | రైతు రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం మాట మార్చడం పట్ల బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి రూ. 2 లక్షల రుణమాఫీ చేయించే బాధ్యతను బీఆర్‌ఎస్ పార్టీ తీసుకుంటుందని అన్నారు. సు
KCR | రైతు రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం మాట మార్చడం పట్ల బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి రూ. 2 లక్షల రుణమాఫీ చేయించే బాధ్యతను బీఆర్‌ఎస్ పార్టీ తీసుకుంటుందని అన్నారు. సుల్తాన్‌పూర్‌లో మంగళవారం సాయంత్రం ఏర్పాటు చేసిన జహీరాబాద్, మెదక్ పార్లమెంట్ నియోజకవర్గాల బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. అందరం కలిసి యుద్ధం చేద్దామని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌కు బలమిస్తే రైతుల పక్షాన పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.
బీఆర్‌ఎస్‌కు బలం ఇవ్వండి..
డిసెంబర్ 9న రుణమాఫీ చేస్తామని ఎన్నికల ముందు వాగ్దానం చేశారని కేసీఆర్ గుర్తు చేశారు. డిసెంబర్ 9 ఎక్కడకు పోయింది.. అని ప్రశ్నించారు. వెనకటి ఒకడు కూసుంటే లేవసాతకాదు గానీ.. తాటి చెట్టంతా ఎగురుతా అన్నడంట.. అట్లనే ఇప్పుడు డిసెంబర్ 9 పోయింది.. అన్ని పోయినయ్.. ఇప్పుడు ఆగస్టు 15న రుణమాఫీ చేస్తామని అంటున్నారని మండిపడ్డారు. ఏడాది తర్వాత రుణమాఫీ చేస్తామని రేవూరి ప్రకాశ్ రెడ్డి అంటున్నడు.. అసలు వీళ్ల మాటలు నమ్మొచ్చా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్లను వంగదీసి.. మెడలు వంచి 2 లక్షల రుణమాఫీ చేయించే బాధ్యతను బీఆర్‌ఎస్ పార్టీ తీసుకుంటుందని అన్నారు. అందరం కలిసి యుద్ధం చేద్దామని పిలుపునిచ్చారు. దీనికోసం పార్లమెంటులో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్‌ఎస్‌కు బలం ఇవ్వండి.. రైతుల పక్షాన బీఆర్‌ఎస్ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.
కడుపులో పెట్టుకుని కాపాడుకున్న రైతులు ఇవాళ ఆగమాగం అయితుండ్రు
ఎవరో ఏదో చెప్పారని ఓట్లు ఆగమాగం వేయొద్దని కేసీఆర్ సూచించారు. మొన్నటి ఎన్నికల్లోనే దెబ్బతిన్నామని.. కిందమీద అయినమని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ అప్పుడు రైతులు ఎంత ధీమాగా ఉండేవాళ్లని.. ఎంతమంచిగ రైతుబంధు మీ బ్యాంకుల పడుతుండె. కరెంటు ఎంత మంచిగ వచ్చేది.. చెరువులు కుంటలు ఎట్ల నిండి ఉండె. ఏ విధంగా నీళ్లు వస్తుండే.. మీ పంటలు ఎట్ల కొన్నం. ఇవాళ తప్పుడు వానలు పడే పరిస్థితులు ఉన్నాయి. అక్కడక్కడ పంటలు తడిసిపోతున్నాయి. కాంటలు పెడతలేరు. కొనుగోళ్లు జరగట్లేదు.. దాని మీద ప్రభుత్వానికి నియంత్రణ లేదు. ‘ అని అన్నారు. తాను కడుపులో పెట్టుకుని కాపాడిన రైతులు ఇవాళ ఆగమాగం అయితుండ్రని ఆవేదన వ్యక్తం చేశారు. ‘ రైతుబంధు రాకపోతే అప్పుల పాలయ్యిండ్రు. లక్షల కొద్దీ మోటార్లు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలినయ్. మూడెకరాల్లో పంట వేస్తే ఒక్క ఎకరమే పండింది. ఆ ఎకరం పంటను కూడా కొనే దిక్కు లేదు. డబ్బులు ఇస్తరో ఇయ్యరో తెల్వట్లేదు. మద్దతు ధర వస్తలేదు. బోనస్ వస్తలేదు.’ అని అన్నారు.
బోనస్ బోగస్ కావద్దంటే అందరం కలిసి కొట్లాడాలే
బోనస్ బోగస్ కానివ్వద్దని కేసీఆర్ అన్నారు. బోనస్ బోగస్ కాకూడదంటే అందరం కలిసి కొట్లాడాలే అని పిలుపునిచ్చారు. ఎన్నికల కోడ్ పేరు చెప్పి బోనస్ ఇవ్వకుండా తప్పించుకోలేరని అన్నారు. బోనస్ ఇవ్వడానికి ఎన్నికల కమిషన్ అడ్డం రాదని తెలిపారు. దీనిపై తాము కూడా ఈసీకి ఫిర్యాదు చేయమని చెప్పారు. ఒకవేళ ఇవ్వడం కుదరకపోతే.. ఏ రైతుకు ఎంత బాకీ ఉంటరో.. అంత బోనస్ చిట్టీలు రాసివ్వాలని సూచించారు. ఎన్నికల్లో బాండ్లు రాసిచ్చినట్టుగా ఇప్పుడు కూడా రాసివ్వండని అన్నారు. ఇప్పుడు వీలుకాకపోతే ఎన్నికల తెల్లారి బోనస్ ఇవ్వండి.. అంతేకాని బోనస్ ఎగ్గొడితే ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుందని చెప్పారు.
చాతగాని ప్రభుత్వం వల్లే ఇన్ని బాధలు
‘ మిషన్ భగీరథ కింద ఇంటికే నల్లా నీళ్లు వచ్చే పండుగ చేసుకున్నాం. అప్పుడు ఒక్క ఆడబిడ్డ కూడా రోడ్డు మీద కనబడలేదు. బిందెలు కనబడలేదు. నీళ్ల ట్యాంకర్లు కనబడలేదు. ఇయ్యాళ్ల ఏం గతి చేస్తున్నారు. మళ్ల నీళ్ల ట్యాంకర్లు ఎందుకొస్తున్నాయి. మంచినీళ్లకు ఎందుకు బాధ పెడుతున్నారు అంటే చాతగాని ప్రభుత్వం ఉంది. అసమర్థులు ఉన్నారు. ఉన్న వసతులు కూడా వాడుకోవట్లేదు. 9 ఏండ్లు నడిచిన కరెంటు ఇయ్యస్తలేదు. ఆరేండ్లు నడిచిన నల్లా నీళ్లు ఇవ్వస్తలేదు.. రైతులను కాపాడే పరిస్థితి లేదు. రైతుబంధు ఇచ్చే పరిస్థితిలేదు. ఈ విధంగా మళ్లీ అన్నింటినీ మొదటికి తీసుకొచ్చిండ్రు.’ అని కేసీఆర్ అన్నారు.
ఎన్నికల ముందు ఎన్ని మాటలు మాట్లాడిండ్రు. కల్యాణలక్ష్మీ లక్ష రూపాయలు కాదు తులం బంగారం ఇస్తామని అన్నారు.. ఒక్క ఇంటికి అయినా తులం బంగారం వచ్చిందా? అని కేసీఆర్ ప్రశ్నించారు. ఇన్ని వాగ్దానాలు చేసి మీ ఓట్లతో అధికారంలోకి వచ్చి అన్నింటినీ ఎగ్గొట్టారని.. ఇప్పుడు మళ్లీ ఓట్లు అడుగుతున్నారని మండిపడ్డారు. ఇప్పుడు మళ్లీ వాళ్లకే ఓటేస్తే ఇబ్బందుల్లో పడారని అన్నారు. మేం ఎన్ని అబద్ధాలు చెప్పినా.. మళ్లీ మాకే ఓటేసిండ్రు అని అన్నింటినీ ఎగ్గొడతారని చెప్పారు. అందుకే ఇవాళ బీఆర్‌ఎస్‌ను గెలిపిస్తేనే.. ప్రభుత్వం మెడలు వంచుతుందని తెలిపారు. అప్పుడే మీకు న్యాయం జరగుతుందని ప్రజలకు సూచించారు.