ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు రోస్ అవెన్యూ సెషన్స్ కోర్టు షాక్ ఇచ్చింది. ఈడీ ఫిర్యాదుపై ఏసీఎంఎం కోర్టు జారీ చేసిన సమన్లపై స్టే ఇచ్చేందుకు సెషన్స్ జడ్జి రాకేష్ సయల్ నిరాకరించారు. కేజ్రీవాల్ మార్చి 16న అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ (ACMM) దివ్య మల్హోత్రా కోర్టుకు హాజరుకావలసి ఉంటుంది. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సెషన్స్ కోర్టులో అప్పీలు చేశారు. ఆయన పిటిషన్‌పై గురువారం (మార్చి 14), శుక్రవారం (మార్చి 15) సుదీర్ఘ విచారణ జరిగింది. విచారణపై ఉన్న స్టేను కొట్టివేస్తున్నట్లు ప్రత్యేక న్యాయమూర్తి రాకేష్ సాయల్ తెలిపారు. అయితే హాజరు నుండి మినహాయింపు కావాలనుకుంటే ట్రయల్ కోర్టులో అప్పీల్ చేసుకోవచ్చు.
మద్యం కుంభకోణం కేసులో విచారణ నిమిత్తం కేజ్రీవాల్‌కు ఇప్పటివరకు ఈడీ 8సార్లు సమన్లుజారీ చేసింది. అయితే ప్రతిసారీ ఆయన గైర్హాజరయ్యారు. దీంతో మొదటి మూడు సమన్లకు కేజ్రివాల్ స్పందించలేదని గత నెల మెజిస్ట్రేట్ కోర్టులో ఈడీ ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు ఫిబ్రవరి 17న రావాలని ఆదేశించింది. అయితే ఆ సమయంలో అసెంబ్లీ విశ్వాస పరీక్ష ఉన్నందున వర్చువల్ గా హాజరయ్యారు. తదుపరి విచారణకు వ్యక్తిగతంగా హాజరవుతానని అభ్యర్థించారు. దీనికి అంగీకరించిన కోర్టు విచారణను వాయిదా వేసింది.
ఈ అంశం కోర్టులో పెండింగ్ లోనే ఉండగానే ఈడీ కేజ్రీవాల్ కు మరోసారి సమన్లు జారీ చేసింది. చివరిసారిగా మార్చి 4న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. అయినా కూడా కేజ్రీవాల్ స్పందించలేదు. దీంతో ఈడీ మరోసారి కోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు మార్చి 16వ తేదీన తప్పనిసరిగా హాజరుకావాలని మరోసారి సమన్లు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సెషన్స్ కోర్టును ఆశ్రయించారు.
ఇది కూడా చదవండి: బీజేపీకి బిగ్ షాక్..కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎంపీ.!
