సుప్రీంకోర్టులో ఇవాళ(బుధవారం) ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్‌కు నిరాశే మిగిలింది. కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ తనను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ అర్వింద్ కేజ్రీవాల్ ఇటీవల ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌పై విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. నిన్న(మంగళవారం) తీర్పు నిచ్చింది. కేజ్రీవాల్‌ను ఈడీ అరెస్ట్ చేయడం సబబేనని వ్యాఖ్యానించింది. లిక్కర్ పాలసీ ద్వారా కేజ్రీవాల్ లబ్ధిపొందడానికి ప్రయత్నించినట్లు తమ దగ్గర ఆధారాలు ఉన్నాయని తెలిపింది.
దీంతో ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కేజ్రీవాల్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేజ్రీవాల్ తరఫున ప్రముఖ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. తమ పిటిషన్‌ను అత్యవసర విచారణకు స్వీకరించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్‌ను సింఘ్వి కోరారు. కానీ కేజ్రీవాల్ పిటిషన్‌పై అత్యవసర విచారణకు సీజేఐ నిరాకరించారు. ‘ఆ పిటిషన్ సంగతి తర్వాత చూస్తాం’ అని వ్యాఖ్యానించారు. దాంతో తన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ కోసం కేజ్రీవాల్ ఈ వారం మొత్తం వేచిచూడక తప్పని పరిస్థితి ఏర్పడింది.
ఇది కూడా చదవండి: బీజేపీకి లాభం చేసేందుకే కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను నిలబెట్టింది