రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర దేవుడెరుగు కనీసం మద్దతు ధర కూడా లభించడం లేదని, దీంతో రైతులు ఒక్కొక్క క్వింటాకు రూ.700 వరకు నష్టపోతున్నారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.

- కాంగ్రెస్ విధానాల వల్లే రైతులకు కష్టాలు
- ఆ మొత్తాన్ని ఖాతాల్లో జమచేయాలి
- కనీస మద్దతు ధరకు ధాన్యం కొనాలి
- హామీ ప్రకారం 500 బోనస్ చెల్లించాలి
- దళారుల గుప్పిట్లోకి మార్కెట్లు
- మంత్రులు ఉత్తమ్, తుమ్మల ఎక్కడ?
- మీడియాతో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రైతులు పండించిన ధాన్యానికి మద్దతు ధర దేవుడెరుగు కనీసం మద్దతు ధర కూడా లభించడం లేదని, దీంతో రైతులు ఒక్కొక్క క్వింటాకు రూ.700 వరకు నష్టపోతున్నారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తూ కాంగ్రెస్ హామీ ఇచ్చిన విధంగా క్వింటాకు రూ.500 బోనస్ చెల్లించాలని డిమాండ్ చేశారు. రైతులు ధాన్యం కేంద్రాలకు వెళ్లి మద్దతు ధర కోసం, బోనస్ కోసం ఒత్తిడి చేయాలని పిలుపునిచ్చారు. రైతులకు న్యాయం జరిగే వరకు బీఆర్‌ఎస్ అండగా నిలబడి పోరాడుతుందని చెప్పారు. శుక్రవారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న పదేండ్లలో కనీస మద్దతు ధర కల్పించిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం వల్లనే రైతులకు కష్టాలు, నష్టాలు ఎదురవుతున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యానికి మద్దతు ధర కల్పించేందుకు ప్రయత్నించకపోవడంతో రైతులు క్వింటాకు రూ.1,500 నుంచి రూ.1,700 చొప్పున అమ్ముకుంటున్నారని, దీంతో క్వింటాకు రూ.700 వరకు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
ఇంత జరుగుతున్నా పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు చోద్యం చూస్తున్నారా? వారు ఎక్కడ? అని ప్రశ్నించారు. జనగామ మార్కెట్‌లో మధ్యాహ్నం 12 నుంచి 1 గంట మధ్య లాట్ రేట్లను ప్రకటించాల్సి ఉండగా సాయంత్రం 5 గంటలకు ప్రకటించారని పేర్కొన్నారు. అధికారిక లెక్కల ప్రకారం జనగామ జిల్లాలోని 193 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో 442 టన్నులు మాత్రమే కొనుగోలు చేయగా, మారెట్ యార్డ్‌లో 4,047 టన్నులు కొనుగోలు చేశారని వివరించారు. కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేవని మండిపడ్డారు. మార్కెట్‌లో రూ.1,530 మాత్రమే చెల్లిస్తున్నారని చెప్పారు. రైతులతో కలిసి నిలదీస్తే మొదట తకువ ధరకు కొనడం లేదని అధికారులు బుకాయించారని, వ్యవహారం సీఎం దాకా వెళ్లినా రైతులకు అదనంగా లభించింది రూ.30 మాత్రమేనని తెలిపారు. గతంలో వరంగల్ డిక్లరేషన్ పేరుతో, ఆ తరువాత వివిధ ఎన్నికల సభల్లో బోనస్‌పై రేవంత్‌రెడ్డి చేసిన ప్రసంగాల వీడియోలను ఈ సందర్భంగా ప్రదర్శించారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదని దుయ్యబట్టారు.
మద్దతు ధర ఇచ్చిన ఘనత కేసీఆర్‌దే
2014-15లో 24 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తే, 2021-22లో 141 లక్షల టన్నులు, గత యాసంగిలో 66 టన్నుల ధాన్యాన్ని బీఆర్‌ఎస్ ప్రభుత్వం కొనుగోలు చేసిందని పల్లా రాజేశ్వర్‌రెడ్డి గుర్తుచేశారు. కేసీఆర్ పాలనలో రైతులు ఎన్నడూ పంటలను తకువ ధరకు అమ్ముకోలేదని, ఐకేపీ కొనుగోలు కేంద్రాల వద్దనే కొనుగోలు చేశామని వివరించారు. కరోనా సమయంలోనూ ధాన్యాన్ని కనీస మద్దతు ధరకు కొన్న ఘనత కేసీఆర్‌దేనని చెప్పారు. రైతులు మరింత నష్టపోక ముందే ప్రతి గింజను మద్దతు ధరకు కొనుగోలు చేసేలా, బోనస్ ఇచ్చేలా ప్రభుత్వం కార్యాచరణ ప్రకటించాలని డిమాండ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పాలనలో రైతులకు కష్టాలు పెరిగిపోయాయని, రైతులు పంటలు ఎండిపోయి ఒకవైపు బాధపడుతున్నారని, మరోవైపు పండించిన పంటకు ప్రభుత్వం మద్దతు ధర కల్పించలేకపోతున్నదని విమర్శించారు. ఇప్పుడు వడ్లు పండించిన రైతులు నష్టపోతున్నారని, రేపు మక్కజొన్న పంట కూడా మార్కెట్‌కు రాబోతున్నదని ఎన్నికల కోడ్ పేరుతో సీఎం, మంత్రులు తప్పించుకోవాలనుకుంటే కుదరదని హెచ్చరించారు.
దళారుల చేతుల్లోకి మార్కెట్లు
రాష్ట్రవ్యాప్తంగా ధాన్యానికి కనీస మద్దతు ఇవ్వాలని, లేకుంటే బీఆర్‌ఎస్ పోరాటం చేస్తుందని పల్లా రాజేశ్వర్‌రెడ్డి హెచ్చరించారు. దళారుల చేతుల్లోకి మారెట్లు వెళ్లిపోయాయని, సీఎం, మంత్రులు రైతులను పట్టించుకోవడం లేదని విమర్శించారు. బోనస్ మాట దేవుడెరుగు మద్దతు ధర కూడా రాని పరిస్థితుల్లో రైతులు ఉంటే రేవంత్, భట్టివిక్రమార ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రైతుబంధు, రుణమాఫీపై మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులకు విశ్వాసం పోయిందని చెప్పారు. అందుకే కొనుగోలు కేంద్రాలకు కాకుండా దళారుల దగ్గరికి ధాన్యం తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. రైతులకు కనీస మద్దతు ధర దకేలా ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని, ఇప్పటికే వడ్లను తకువ ధరకు అమ్ముకున్న రైతులకు నష్టపోయిన మొతాన్ని వారి అకౌంట్లలో జమచేయాలని డిమాండ్ చేశారు. కేవలం రూ.30 పెంచి రూ.1,560కు వడ్లను కొన్నందుకు జనగామ అధికారులను సీఎం రేవంత్‌రెడ్డి ప్రశంసిస్తున్నారా? అని నిలదీశారు. సీఎం ఆదేశాల తర్వాత కూడా రైతులు క్వింటాకు రూ.700 నష్టపోతున్నారని తెలిపారు.