హర్యానాలో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. మహేంద్రగఢ్ జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు చిన్నారులు మరణించారు. కాగా పలువురు చిన్నారులు గాయపడ్డారు. ఈరోజు ఉదయం ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. కనీనా పట్టణం సమీపంలోని కనీనా దాద్రి రోడ్డులో ఈ ప్రమాదం జరిగింది. రోడ్డు ప్రమాదంలో ఆరుగురు చిన్నారులు చనిపోగా, 25-30 మంది చిన్నారులు గాయపడ్డారని ఓ పోలీసు అధికారి తెలిపారు. వీరిలో 15 మంది చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. బస్సులో దాదాపు 30 మంది చిన్నారులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన విద్యార్థులను సమీప ఆసుపత్రికి తరలించారు. బస్సు అతి వేగంతో చెట్టును ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. మరణించిన చిన్నారుల తల్లిదండ్రుల రోదనలతో విషాదఛాయలు అలుముకున్నాయి.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బస్సు కనీనాలోని జిఎల్ పబ్లిక్ స్కూల్ కు చెందినది. విద్యార్థులతో వెళ్తున్న బస్సు ఉన్హాని గ్రామ సమీపంలో అదుపు తప్పి చెట్టును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు. ఈద్ కు ప్రభుత్వం సెలవు ఇచ్చినప్పటికీ కొన్ని ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోలేదని తెలిపారు. అతివేగంతోపాటు బస్సు డ్రైవర్ మద్యం మత్తులో బస్సు నడుపుతున్నట్లు సమాచారం. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షల నిమిత్తం మహేంద్రగఢ్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఈ విషయంపై విచారణ జరుగుతోంది. ఇప్పటి వరకు పాఠశాల యాజమాన్యం నుంచి దీనిపై ఎలాంటి ప్రకటన రాలేదు.
ఇది కూడా చదవండి: వేసవిలో రోజూ అరటిపండు తింటే ఏమవుతుంది..?
The post చెట్టును ఢీకొన్న స్కూల్ బస్సు..ఆరుగురు విద్యార్థులు మృతి.! appeared first on tnewstelugu.com.