
బెంగళూరు: కర్ణాటకలోని బెలగావి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ప్రాంతంలోని చుంచునూరు సమీపంలో వేగంగా వస్తున్న మహీంద్రా బొలెరో అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న మర్రి చెట్టును ఢీకొని బోల్తా పడింది. దీంతో 6 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. చాలా మంది గాయపడ్డారు. ప్రమాదంలో వాహనం నుజ్జునుజ్జయింది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. మృతులంతా హుల్కుంట గ్రామానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. ఎల్లమ్మ ఆలయానికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
