
సంచార్ సాథీ.. మొబైల్ సబ్‌స్ర్కైబర్ల కోసం టెలి కమ్యూనికేషన్స్ డిపార్ట్‌మెంట్‌తో కలిసి పనిచేసేందుకు రూపొందించిన శక్తిమంతమైన పోర్టల్. వినియోగదారులు తమ పేరుపై తీసుకున్న మొబైల్ కనెక్షన్ల గురించి తెలుసుకునేందుకు, అవసరం లేనివి డిస్‌కనెక్ట్ చేయడానికి, పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌ను బ్లాక్ చేయడం/ట్రేస్ చేయడంతోపాటు కొత్త/ సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనుగోలు చేసేటప్పుడు దాని వివరాలను తనిఖీ చేయడంలో ‘సంచార్ సాథీ’ ఉపయోగకరంగా ఉంటుంది. ఇందులో వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా వివిధ మాడ్యుల్స్ ఉన్నాయి. వాటి సాయంతో డిజిటల్ ప్రపంచంలో మీరు సురక్షితంగా ఉండొచ్చు.
సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రేషన్- CEIR
భారతీయ టెలికాం విభాగానికి చెందిన https://ceir.gov.in లో ఈ ‘సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రేషన్’ (CEIR) అనే సబ్ పోర్టల్ ఉంటుంది. చోరీకి గురైన ఫోన్లను నేరుగా ఈ సబ్ పోర్టల్‌ను సందర్శించడం ద్వారా బ్లాక్/ట్రాక్ చేయొచ్చు. మొబైల్ సబ్‌స్ర్కైబర్లు పోగొట్టుకున్న ఫోన్‌ను సీఈఐఆర్ ద్వారానే పోలీసు శాఖ తిరిగి పొందుతున్నది. సీఈఐఆర్‌ను వినియోగించడం ద్వారా ఫోన్‌ను నిరోధించడం, అన్‌బ్లాక్ చేయడం వంటివి ఎవరైనా చేయొచ్చు.
టీఏఎఫ్‌సీవోపీ-TAFCOP గురించి..
టెలికాం అనలిటిక్స్ ఫర్ ఫ్రాడ్ మేనేజ్‌మెంట్ అండ్ కన్జూమర్ ప్రొటెక్షన్ (టీఏఎఫ్‌సీవోపీ) మోసపూరిత కార్యకలాపాల బారిన పడకుండా చేయవచ్చు. వినియోగదారుల ధ్రువీకరణ కోసం ఓటీపీ (వన్ టైమ్ పాస్‌వర్డ్)ని స్వీకరించడానికి వారి మొబైల్ నంబర్‌ను మొదట ఇందులో నమోదు చేయాల్సి ఉంటుంది. తద్వారా వీరి ఐడీ ద్వారా అనధికారికంగా పొందిన ఇతర మొబైల్ నంబర్ల వివరాలు తెలుసుకోవచ్చు. టెలికాం పరిశ్రమలో మోసాలను పరిష్కరించడానికి, భద్రతా చర్యలను మెరుగుపర్చడానికి ప్రభుత్వం చేస్తున్న విస్తృత ప్రయత్నాల్లో ఇది ఎంతగానో ఉపకరిస్తున్నది. టెలికాం వ్యవస్థ సురక్షితంగా, విశ్వసనీయంగా ఉండేలా దోహదపడుతున్నది.
రిక్విన్-RICWIN అంటే..?
రిపోర్ట్ ఇన్‌కమింగ్ ఇంటర్నేషనల్ కాల్ విత్ ఇండియన్ నంబర్ (ఆర్‌ఐసీడబ్ల్యూఐఎన్-RICWIN) సహాయంతో అంతర్జాతీయ కాల్స్ ద్వారా జరిగే మోసాలను నిరోధించవచ్చు. భారతీయ నంబర్ అన్నట్టుగా వచ్చే అంతర్జాతీయ కాల్స్‌తో తరుచూ ఆర్థిక మోసాలు చోటుచేసుకుంటున్నాయి. వీటి గురించి హెచ్చరిక చేయడం, వాటి బారినుంచి వినియోగదారులను కాపాడటం దీని ప్రధాన విధి.
కేవైఏ-KYI అంటే..?
నో యువర్ వైర్‌లెస్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ (KYI) మాడ్యుల్‌తో ఐఎస్‌పీ (ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్) ఎక్కడుందో తెలుసుకోవటం సులభతరం అవుతుంది. వినియోగదారు పిన్‌కోడ్ చిరునామాను, లేదా ఐఎస్‌పీ పేరు, చిరునామా నమోదు చేయడం ద్వారా అది ఎక్కడుందో తెలుసుకోవచ్చు. ప్రస్తుతం దేశంలోని అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ ఇది పనిచేస్తున్నది. సంచార్ సాథీ పోర్టల్ నుంచి టీఏఎఫ్‌సీవోపీ పోర్టల్‌ను యాక్సెస్ చేయొచ్చు.
చక్షు-CHAKSU
ఆర్థిక నేరాల బారినుంచి రక్షించేదే చక్షు. ముఖ్యంగా ఆర్థిక మోసాల గురించి ఇది నివేదిస్తుంది. లాటరీ ఆఫర్ అని, లోన్ ఆఫర్ అని, జాబ్ ఆఫర్ అని ఎస్‌ఎంఎస్, వాట్సాప్ ద్వారా వచ్చిన అనుమానిత కమ్యూనికేషన్ల లోగుట్టును నివేదించడానికి వినియోగదారులకు చక్షు సహకరిస్తుంది. కేవైసీ అప్‌డేట్ పేరుతో జరిగే మోసాలను కూడా నివారించవచ్చు.
ఈ పోర్టల్స్ అన్నీ కూడా ప్రస్తుతం భారతదేశంలోని దాదాపు అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ పనిచేస్తున్నాయి. సంచార్ సాథీ పోర్టల్ (https://ceir.sancharsaathi. gov.in/Home/index.jsp) నుంచి కూడా ఈ పోర్టల్స్‌ను యాక్సెస్ చేయొచ్చు.
– అనిల్ రాచమల్ల
వ్యవస్థాపకులు ఎండ్‌నౌ ఫౌండేషన్