
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం 2016లో పెద్ద నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను ఇవాళ సుప్రీంకోర్టు కొట్టివేసింది. 2016లో కేంద్ర ప్రభుత్వం 1000, 500 నోట్లను రద్దు చేసింది. నోట్ల రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం కొట్టివేసింది. ఈ బెంచ్‌లో న్యాయమూర్తులు బిఆర్ గవాయి, ఎఎస్ బొప్పన్న, వి సుబ్రమణియన్, బివి నాగరత్న ఉన్నారు.
నోట్ల రద్దుపై కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సమర్థనీయమేనని సుప్రీంకోర్టు తన తీర్పులో పేర్కొంది. ప్రధాని మోదీ నిర్ణయానికి నలుగురు సభ్యులు మద్దతు పలికారు. మెజారిటీకి వ్యతిరేకంగా తన తీర్పులో జస్టిస్ బివి నాగరత్న తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. న్యాయమూర్తి జస్టిస్ బివి నాగరత్న మాట్లాడుతూ ప్రభుత్వం కంటే పార్లమెంటు ద్వారా చర్యలు తీసుకుంటే బాగుంటుందన్నారు.
న్యాయమూర్తి గవాయ్ మెజారిటీ అభిప్రాయాన్ని వెల్లడించారు. ఆర్థిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడంలో చాలా సంయమనం అవసరమన్నారు. ఆర్థిక వ్యవస్థ అభిప్రాయాలను న్యాయ ప్రక్రియతో ముడిపెట్టలేమని ఆయన అన్నారు. నోట్ల రద్దుపై కేంద్రం, ఆర్బీఐల మధ్య సంప్రదింపుల ప్రక్రియ ఆరు నెలల పాటు సాగిందని చెప్పారు. డీమోనిటైజేషన్ ప్రక్రియను చేపట్టే వ్యక్తిగత స్వేచ్ఛ ఆర్బీఐకి లేదని న్యాయమూర్తి గవాయ్ అన్నారు.
