ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ గత నెలలో ప్రకటించిన సోలార్ పాలసీ 2024 లెఫ్టినెంట్ గవర్నర్ వినరు కుమార్ సక్సేనా ఇవాళ(బుధవారం) నిలిపివేశారు. ఈ ప్రకటనపై ఆప్ ఎంపి సందీప్ పాఠక్ స్పందించారు. బీజేపీ తన ఆగ్రహాన్ని కేజ్రీవాల్‌పై మాత్రమే కాకుండా ఢిల్లీ, ప్రజలపై కూడా చూపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు
ఇది విచారించదగ్గ విషయమని, సోలార్ పాలసీ అత్యంత ప్రగతిశీలమైన, అధునాతన పాలసీ అని అన్నారు. కేవలం ఢిల్లీకి మాత్రమే కాదు దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ ఈ పథకాన్ని ప్రవేశపెట్టాలని సూచించారు. దేశాన్ని పక్కన పెట్టండి.. కనీసం ఢిల్లీలోనైనా అమలు చేయనీయకుండా బీజేపీ అడ్డుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి విషయంలోనూ అడ్డంకులు సృష్టిస్తున్నారని, వారి ఆగ్రహం కేవలం కేజ్రీవాల్‌పై మాత్రమే కాదు.. ఢిల్లీ, ఢిల్లీ ప్రజలపై కూడా అని అన్నారు. దేశ పురోభివృద్ధి బీజేపీ లక్ష్యం కాదని, వారు కేవలం ‘డర్టీ పాలిటిక్స్’కి పాల్పడుతున్నారని విమర్శించారు.
ఢిల్లీలో 1500 మెగావాట్ల సౌర విద్యుత్ స్థాపన లక్ష్యంతో రాష్ట్ర సోలార్ పాలసీ 2016కి సవరణలు చేస్తూ.. ఆప్ ప్రభుత్వం జనవరి 29న సోలార్ పాలసీ 2024ను ప్రవేశపెట్టింది.. 2027 నాటికి 4,500 మెగావాట్ల సౌర విద్యుత్‌ను స్థాపించడమే లక్ష్యమంది. ఈ పథకంతో ఢిల్లీ ప్రజలకు 200 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా కల్పిస్తుంది. నెలకు 201 నుండి 400 యూనిట్లు వినియోగించే గృహ వినియోగదారలకు 50 శాతం సబ్సిడీ కల్పిస్తోంది. 400 యూనిట్లు దాటితే సబ్సిడీ ఉండదు.
ఇది కూడా చదవండి: తెలంగాణలో ఐదుగురు ఐఏఎస్ ఆఫీసర్లు బదిలీ
