యువ ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (160 బంతుల్లో 323 బ్యాటింగ్; 33 ఫోర్లు, 21 సిక్సర్లు) రికార్డు ట్రిపుల్ సెంచరీతో చెలరేగాడు. ఫలితంగా అరుణాచల్ ప్రదేశ్‌తో శుక్రవారం ప్రారంభమైన రంజీట్రోఫీ ప్లేట్ గ్రూప్ మ్యాచ్‌లో హైదరాబాద్ కొండంత స్కోరు చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన అరుణాచల్ ప్రదేశ్ 172 పరుగులకు ఆలౌటైంది.
- ఒక్క రోజులోనే ట్రిపుల్ సెంచరీ
- 160 బంతుల్లో 323 నాటౌట్
- ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో నయా రికార్డు
- హైదరాబాద్ 529/1
- అరుణాచల్‌తో రంజీ మ్యాచ్
- 160 బంతుల్లో 323
- 33 ఫోర్లు 21 సిక్సర్లు
బౌలర్ చేతి నుంచి బంతి పడిందే ఆలస్యం.. దానిపై ఆకలిగొన్న సింహంలా విరుచుకుపడిన హైదరాబాద్ ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ రికార్డుల దుమ్ముదులిపాడు. క్రీజులో అడుగు పెట్టగానే వీరేంద్ర సెహ్వాగ్ పూనినట్లు.. ప్రత్యర్థి బౌలర్లను చీల్చి చెండాడుతూ.. అజేయ ట్రిపుల్ సెంచరీ బాదాడు. ఈ క్రమంలో తన్మయ్ వరల్డ్ రికార్డు బద్దలు కొట్టగా.. అరుణాచల్‌తో రంజీ పోరులో హైదరాబాద్ కొండంత స్కోరు చేసింది!
హైదరాబాద్, ఆట ప్రతినిధి: యువ ఓపెనర్ తన్మయ్ అగర్వాల్ (160 బంతుల్లో 323 బ్యాటింగ్; 33 ఫోర్లు, 21 సిక్సర్లు) రికార్డు ట్రిపుల్ సెంచరీతో చెలరేగాడు. ఫలితంగా అరుణాచల్ ప్రదేశ్‌తో శుక్రవారం ప్రారంభమైన రంజీట్రోఫీ ప్లేట్ గ్రూప్ మ్యాచ్‌లో హైదరాబాద్ కొండంత స్కోరు చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన అరుణాచల్ ప్రదేశ్ 172 పరుగులకు ఆలౌటైంది. మన బౌలర్లలో చామా మిలింద్, కార్తికేయ చెరో 3 వికెట్లు పడగొట్టారు.
అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన హైదరాబాద్ ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టానికి 529 పరుగులు చేసింది. తన్మయ్ ట్రిపుల్ సెంచరీతో చెలరేగితే.. కెప్టెన్ రాహుల్ సింగ్ (105 బంతుల్లో 185; 26 ఫోర్లు, 3 సిక్సర్లు) తృటిలో డబుల్ సెంచరీ చేజార్చుకున్నాడు. అరుణాచల్ బౌలర్ల అనుభవ రాహిత్యాన్ని సొమ్ము చేసుకున్న హైదరాబాద్.. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో పలు రికార్డులు తిరగ రాసింది. ప్లేట్ గ్రూప్‌లో ఆడిన గత మూడు మ్యాచ్‌ల్లోనూ ఇన్నింగ్స్ విజయాలతో హ్యాట్రిక్ నమోదు చేసుకున్న హైదరాబాద్ ఇప్పుడు మరో విజయానికి రాచబాట సిద్ధం చేసింది.
ఈ మ్యాచ్‌లో నమోదైన రికార్డులు
- ఫస్ట్ క్లాస్ క్రికెట్లో తన్మయ్దే ఫాస్టెస్ట్ (147 బంతుల్లో) ట్రిపుల్ సెంచరీ.
- 119 బంతుల్లో డబుల్ సెంచరీ చేసిన తన్మయ్ భారత్ తరఫున ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో వేగవంతమైన ద్విశతకం చేసిన ప్లేయర్‌గా నిలిచాడు. రవిశాస్త్రి (123 బంతుల్లో) రెండో స్థానంలో ఉన్నాడు.
- భారత్ నుంచి ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఒకే రోజులో 300 పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా తన్మయ్ రికార్డుల్లోకెక్కాడు. సెహ్వాగ్ లంకపై టెస్టులో ఒకే రోజులో 284 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు.
