ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు తిహార్ డ్ జైల్లో ముప్పు పొంచి ఉన్నట్లు అధికారులకు సమాచారం అందడంతో అప్రమత్తమయ్యారు. అదే జైల్లో ఉన్న కొన్ని గ్యాంగులు పాపులర్ అయ్యేందుకు ఆయనపై దాడి చేసే అవకాశం ఉందని అంచనా వేశారు. ప్రస్తుతం తిహార్ లోని జైల్ నంబర్-2లో కేజ్రీవాల్ ఉన్నారు. గతంలో ఇక్కడ హత్యలు జరిగాయి. 2021లో శ్రీకాంత్ రామస్వామి అనే నిందితుడిని ఇక్కడ గ్యాంగ్ వార్‌లో చంపేశారు. ఢిల్లీలోని వసంత్ విహార్ దగ్గర 2015లో జరిగిన ఓ హత్య కేసులో అతడిని అరెస్టు చేశారు. సహ ఖైదీలు అతడిని బ్యాట్లతో తీవ్రంగా కొట్టినట్లు జైలు అధికారులు కోర్టుకు నివేదించారు. అప్పట్లో ఆ కేసుకు సంబంధించి నలుగురిని అరెస్టు చేశారు. ఇటీవల కూడా జైల్లో జరిపిన తనిఖీల్లో 33 మొబైల్ ఫోన్లు బయటపడ్డాయి.
ఇప్పటికే ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ నుంచి కేజ్రీవాల్‌కు బెదిరింపులు వచ్చాయి. తిహార్ జైల్లోని ఖలిస్థానీలు దాడి చేస్తారని వాటిల్లో హెచ్చరించాడు. ఈ మేరకు ఇటీవల వీడియోను విడుదల చేశారు.
మార్చి 21న జైలుకు వచ్చినప్పటి నుంచి కేజ్రీవాల్ దాదాపు 4.5 కిలోల బరువు తగ్గారని ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు తెలిపాయి. బ్లడ్ షుగర్ లెవల్స్ 50 కంటే దిగువకు చేరాయి. దీంతో చికిత్స చేసి వాటిని సాధారణ స్థాయికి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నారని జైలు డాక్టర్లు తెలిపారు. ఆయనకు భోజనం ఇంటి నుంచే వెళుతోంది. ఏదైనా అత్యవసరమైతే తక్షణమే స్పందించేందుకు కేజ్రీవాల్ గదికి అత్యంత సమీపంలోనే క్విక్‌రెస్పాన్స్ టీమ్‌ను ఏర్పాటు చేశారు జైలు అధికారులు.
ఇది కూడా చదవండి:12-4 గంటల మధ్య వంటగదికీ దూరంగా ఉండండి