సీఎం కుర్చీలో కూర్చున్నా అనే కనీస ఇంగితం లేకుండా మరోసారి రేవంత్ రెడ్డి తన మూర్ఖత్వాన్ని బహిర్గతం చేసుకున్నారని బీఆర్‌ఎస్ నాయకుడు దాసోజు శ్రవణ్ విమర్శించారు. పిచ్చోడి లెక్క కేసీఆర్‌పై ఇవాళ దాడికి ప్రయత్నం చేశారని.. ఆ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఇవాళ(మంగళవారం) నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్‌ఎస్ నాయకులు పొన్నాల లక్ష్మయ్య, బాల్క సుమన్, గ్యాదరి కిశోర్‌తో కలిసి ఆయన మాట్లాడారు. టాయిలెట్ క్లీనర్‌ను నోటిలో పోసుకుని పుకిలించితే తప్ప.. రేవంత్ రెడ్డి నోరు సక్కగా కాదని విమర్శించారు. అప్పుడైనా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న అనే సోయితో మంచిగ మాట్లాడుతాడు కావచ్చని అన్నారు.
తాను పొగ బెడితే కేసీఆర్ ఎలుక లెక్క బయటకొచ్చిండని రేవంత్ రెడ్డి అంటున్నాడని దాసోజ్ శ్రవణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ సింహం వచ్చినట్టు బయటకొచ్చారని స్పష్టం చేశారు. ఒక పక్క కాలికి గాయమైనా సరే.. తోటి రైతన్నలకు అండగా ఉండాలని బయటకొచ్చారని అన్నారు. కేసీఆర్ రైతుల దగ్గరకు రాగానే రేవంత్ రెడ్డికి లాగులు తడిసినయని.. అందుకే గాయత్రి పంప్ ఆన్ చేశాడని, నాగార్జున సాగర్ డ్యామ్ నీళ్లను వదిలిపెట్టే ప్రయత్నం చేశారని చెప్పారు. మేడిగడ్డ రెండు పిల్లర్లు పాడైతే.. వెన్నెముకనే కూలిపోయిందని మొత్తం ప్రాజెక్టును పడావు పెట్టారని అన్నారు. తెలంగాణ మొత్తానికి రేవంత్ రెడ్డి శాపంగా మారారని విమర్శించారు. అనేక టీఎంసీలు ఆంధ్రాకు తరలివెళ్లేలా కాళేశ్వరం ప్రాజెక్టును పడావు పెట్టి.. సుందిళ్ల, అన్నారంలో ఉన్న నీళ్లను డెడ్ స్టోరేజిలోకి తీసుకెళ్లారని.. దీంతో నీరు గోదావరి వెంట ఆంధ్రాకు వెళ్లేలా దుశ్చర్యకు పాల్పడ్డాడని మండిపడ్డారు.
తెలంగాణ రైతాంగానికి రేవంత్ రెడ్డి శాపంగా మారడమే కాకుండా.. మళ్లీ నిస్సిగ్గుగా కేసీఆర్, బీఆర్‌ఎస్‌పై దాడి చేసే ప్రయత్నం చేశారని దాసోజు శ్రవణ్ విమర్శించారు. పదేండ్లలో వందేళ్ల విధ్వంసం జరిగిందని రేవంత్ రెడ్డి అన్న వ్యాఖ్యలపై దాసోజు శ్రవణ్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నం తింటున్నావా? గడ్డి తింటున్నావా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీకు ఏమైనా సోయి ఉందా? లెక్కలు తెలుసా? అని ప్రశ్నించారు. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో తెలంగాణ తలసరి ఆదాయం 3.17 లక్షల కోట్లు ఉందని చెప్పారని ఆయన గుర్తు చేశారు. 1.12 లక్షలు ఉన్న తలసరి ఆదాయం.. కేసీఆర్ పాలనలో 3.17లక్షల కోట్లకు చేరితే విధ్వంసం అయినట్టా? అని ప్రశ్నించారు. ఒకప్పుడు వరి పండించాలంటే ఇబ్బంది ఉండేది.. అటువంటిది.. పంజాబ్‌నే తలదన్నేలా భారత్‌లోనే అత్యధిక వరి పండించే స్థాయికి తెలంగాణ వ్యవసాయాన్ని తీర్చిదిద్దితే విధ్వంసం అయినట్టా? అని నిలదీశారు. ఐటీ ఎగుమతుల్లో దేశం గర్వపడేలా పెంపొదిస్తే తెలంగాణ విధ్వంసం అయ్యిందా? మెడికల్ కాలేజీలు పెంపొదిస్తే తెలంగాణ విధ్వంసం అయ్యిందా? అని ప్రశ్నించారు. 7వేల మెగావాట్ల కెపాసిటీ ఉన్న కరెంటును 24వేల మెగావాట్ల కెపాసిటీ వరకు తీసుకెళ్లడం విధ్వంసమా? అని ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డి సన్నాసి మాటలు మాట్లాడుతున్నారని అన్నిరు దాసోజు శ్రవణ్. గత పరిపాలనలో ఏదైనా తప్పులు జరిగి ఉంటే ఎత్తిచూపు కాని.. జరిగిన అభివృద్ధిని జరగలేదని మాట్లాడవద్దని సూచించారు. కేసీఆర్, బీఆర్‌ఎస్‌పై ఉన్న అక్కసుతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారని హెచ్చరించారు. ఇవాళ కుర్చీలో నువ్వు కూర్చోవచ్చు.. ఆర్నెల్లు ఆగితే ఎక్కడ ఏం జరుగుతుందో తెలియదని వ్యాఖ్యానించారు. చెల్లని వెయ్యి నోటు అని మాట్లాడుతున్నావ్ కానీ.. చెల్లని చిత్తు కాగితం నువ్వు అని విమర్శించారు. దేవుడు తలచుకుంటే ఓడలు బండ్లు అవుతయి.. బండ్లు ఓడలు అవుతాయని అన్నారు. అప్పుడే ఎందుకు అంత విర్రవీగుతున్నావ్? పెద్ద మనిషి అనే గౌరవం లేకుండా.. బిడ్డ జైలుకు వెళ్లింది.. కాలు ఇరిగింది? అని మాటలేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు సంస్కారం ఏమైనా ఉందా? ముఖ్యమంత్రివి అనేది గుర్తుందా? అని ప్రశ్నించారు. మాట్లాడితే హుందాతనం లేదు.. నువ్వెక్కడి ముఖ్యమంత్రివి అని ఫైర్ అయ్యారు దాసోజు.
కేసీఆర్ నానా కష్టాలు పడి వ్యవసాయాన్ని స్థీరికరణ చేశారని దాసోజు శ్రవణ్ అన్నారు. ప్రతి సాగు భూమికి నీళ్లు అందించే ప్రయత్నం చేశారని.. ప్రతి రైతుకు రైతుబంధు, రైతుబీమా అందించి.. వ్యవసాయాన్ని పండుగ చేశారని తెలిపారు. కానీ మీ దుర్మార్గమైన, కుట్రపూరితమైన పాలనతో ఇప్పుడు రైతులు పంటలను తగులబెట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పదేండ్ల పాటు రైతాంగం పంటలు పండించి పండుగ చేసుకుంటే.. ఇవాళ ఎందుకు పొలాలను తగులబెట్టుకుంటున్నారని ప్రశ్నించారు. ట్యాంకర్లతో నీళ్లు ఎందుకు తెచ్చుకుని పంటలను తడుకుంటున్నారు అని అడిగారు. వాటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అడిగితే ఎకసెకలు చేస్తావా? అని మండిపడ్డారు. 200 మంది రైతులు చనిపోతే.. ఎక్కడ చనిపోయారు? వాళ్ల పేర్లు, వివరాలు ఇవ్వమని ఎకసెక్కలు చేస్తావా? నీకు కేసీఆర్ అడ్రస్‌లు ఇస్తే.. నువ్వు వెళ్లి ఆదుకుంటావా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వు ఏం పీకుతావ్ అని ప్రశ్నించారు. నీ ప్రభుత్వం ఎందుకు? నీ మంత్రులు ఎందుకు? నీ ఐఏఎస్‌లు ఎందుకు? అని నిలదీశారు దాసోజు.
ఇది కూడా చదవండి: దద్దమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం