కాంగ్రెస్ పాలనపై రైతులు పెదవి విరుస్తున్నారు. అనేక హామీలిచ్చి గద్దెనెక్కిన రేవంత్ సర్కార్ తమను ఆగం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
- మోసపోయి గోసపడుతున్నం
- మద్దతు ధర దేవుడెరుగు.. వడ్లే కొంటలేరు
- బీఆర్‌ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్‌తో కురిక్యాల రైతు సాయిల్ల కనకయ్య ఆవేదన
‘కాంగ్రెసోళ్లు వచ్చి ఏదో ఉద్ధరిత్తరని నమ్మి కయ్యలవడ్డం.. వాళ్లకు ఓట్లు వేసి గోస పడుతున్నం.. కేంద్రానికి వడ్లు తెచ్చి వారం రోజులైతంది.. చెడగొట్టు వానలు పడెటట్టు ఉన్నయి.. సర్కారోళ్లు రూ.500 బోనస్ ఇచ్చుడేమో గానీ ఉన్న వడ్లను కొని మద్దతు ధర ఇత్తరో లేరో’ అని కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల గ్రామ రైతు సాయిల్ల కనకయ్య ఆవేదన వ్యక్తం చేశారు.
గంగాధర, ఏప్రిల్ 14: కాంగ్రెస్ పాలనపై రైతులు పెదవి విరుస్తున్నారు. అనేక హామీలిచ్చి గద్దెనెక్కిన రేవంత్ సర్కార్ తమను ఆగం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం కరీంనగర్ జిల్లాలో ఓ రైతు ఆవేదన ప్రస్తుత సాగు సంక్షోభానికి అద్దం పట్టింది. బీఆర్‌ఎస్ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్.. మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మాజీ జడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమతో కలిసి ఆదివారం జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో ఓ శుభకార్యానికి వెళ్లి వస్తూ గంగాధర మండలం కురిక్యాల వద్ద రోడ్డు పక్కన ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఆగారు. కొనుగోలు కేంద్రంలో దిగాలుగా కూర్చున్న రైతులతో మాట్లాడారు. వారి ఇబ్బందులు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కేంద్రానికి ధాన్యం తెచ్చి వారం రోజులైతున్నదని, కేంద్రాన్ని ప్రారంభించి వెళ్లిన అధికారులు వడ్లు జోకుతలేరని రైతు కనుకయ్య వినోద్‌కుమార్‌తో తన గోడును వెల్లబోసుకున్నారు. ‘అకాల వర్షాలు పడితే అసలుకే మోసం వస్తుంది.
రైతుబంధు ఇయ్యలేదని, రూ.500 బోనస్ ఇచ్చుడు ఏమో గానీ, మద్దతు ధరకు వడ్లు కొంటరో లేదో అని రందివట్టుకుంది’ అని వాపోయాడు. ఈ సందర్భంగా వినోద్‌కుమార్ మాట్లాడుతూ వరికోతలు ప్రారంభమై కొనుగోలు కేంద్రానికి ధాన్యం చేరినా ప్రభుత్వం కేంద్రాలను ప్రారంభించడంలో నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు. క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇవ్వాల్సి వస్తుందనే కారణంతో ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు చేపట్టడం లేదని విమర్శించారు.
గ్రామాల్లో రైతులు వరిధాన్యం తీసుకొచ్చి కొనుగోలు కేంద్రాల్లో కుప్పలు పోస్తున్నారని, ఎప్పుడు కొంటారో తెలియక క్వింటాల్‌కు రూ.1,800 చొప్పున దళారులకు అమ్ముకుంటున్నారని తెలిపారు. ప్రభుత్వానికి రైతుల పట్ల ప్రేమ ఉంటే ఇప్పటి వరకు ధాన్యం తరలించడానికి మిల్లులు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. ధాన్యం కొనుగోళ్లు ఆలస్యం కావడంతో విధిలేని పరిస్థితుల్లో దళారులకు అమ్ముకుని నష్టపోతున్నారని తెలిపారు. వెంటనే కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి రైతులు నష్టపోకుండా చూడాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కనీస మద్దతు ధరతోపాటు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.