రాష్ట్రంలో డీఎస్సీ 2024 దరఖాస్తుల స్వీకరణ సోమవారం రాత్రి నుంచే షురూ కానుంది. సోమవారం రాత్రి 12 గంటల తర్వాత నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కానుంది. ఈరోజు రాత్రికే ఇన్ఫర్మేషన్ బులిటెన్, జిల్లా, సబ్జెక్టు , రిజర్వేషన్ వారీగా ఖాళీలు, సిలబస్ తదితర వివరాలను వెబ్ సైట్లో పొందుపర్చనున్నారు. ఆ తర్వాత నుంచి ఫీజు చెల్లింపు, దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.
కాగా 2023 డీఎస్సీకి 1.77 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా…వీరు మళ్లీ దరఖాస్తు చేసుకోవల్సిన అవసరం లేదని విద్యాశాఖ తెలిపింది. 11,062 టీచర్ పోస్టుల భర్తీకి పాఠశాల విద్యాశాఖ డీఎస్సీ 2024 నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. వీటిలో 2,629 స్కూల్ అసిస్టెంట్, 6,508 సెకండరీ గ్రేడ్ టీచర్లు, 727 భాషా పండితులు, 182 పీఈటీ పోస్టులు ఉన్నాయి. స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్లలో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 220 ఉంటే.. సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు 796 ఉన్నాయి. సోమవారం నుంచి ఏప్రిల్ 3 వరకు దరఖాస్తు చేసుకునేందుకు ఛాన్స్ ఉంటుంది. ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు గడువు ఏప్రిల్ 2తో ముగుస్తుంది. తాజాగా గరిష్ఠ వయోపరిమితిని 46 ఏండ్లకు పెంచడం, అదనంగా పోస్టులను చేర్చడంతో దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుందని విద్యాశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇది కూడా చదవండి: తెలంగాణలో ఘోరరోడ్డు ప్రమాదం..ఐదుగురు దుర్మరణం.!
