ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనపై చేస్తున్న ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంచేశారు. ఇందుకు అవసరమైతే నార్కో, లై డిటెక్టర్ పరీక్షలకు తాను సిద్ధంగా ఉన్నానని, తనపై నిత్యం ఆరోపణలు చేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తనతోపాటు లై డిటెక్టర్, నార్కో అనాలసిస్ పరీక్షకు రావాలని సవాల్ చేశారు.
సీఎం రేవంత్‌రెడ్డి తన మంత్రివర్గంలోని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డితోపాటు తన ఫోన్ ను, ఇతర ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు. ట్యాప్ చేయడం లేదని చెప్పే దమ్ము, ధైర్యం సీఎం రేవంత్‌రెడ్డికి లేదని తెలిపారు. దేశంలోని ప్రతి ప్రతిపక్ష నాయకుడి ఫోన్లను పెగాసెస్ సాఫ్ట్ వేర్ ద్వారా కేంద్రం ట్యాప్ చేయిస్తున్నదని ఆరోపించారు. అలా చేయడం లేదనే దమ్ము, ధైర్యం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి ఉన్నదా? అని ప్రశ్నించారు. ప్రతి ప్రభుత్వంలో ఉన్న నిఘా వ్యవస్థలు సంఘ విద్రోహ శక్తులను నిరోధించడానికి ట్యాపింగ్ చేస్తుంటాయని, అయితే, ఇట్లాంటి వ్యవస్థను దుర్వినియోగం చేస్తే ఎవ్వరైనా శిక్షార్హులేనని కేటీఆర్ స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: లోకసభ ఎన్నికల్లో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను ఓడించి బుద్ధి చెప్పాలి