వ్యవసాయ యూనివర్సిటీ భూములను హైకోర్టు కు బదలాయించ వద్దని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీ విద్యార్ధుల ఆందోళన కొనసాగుతుంది . విద్యార్థులు బుధవారం తరగతులను బహిష్కరించి రోడ్డుపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేశారు.
శాస్త్రవేత్తలు, టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులు, విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్నా ప్రభుత్వం పట్టించుకోక పోవడం దారుణమని విద్యార్థులు పేర్కొన్నారు. వ్యవసాయ సాగు పరిశోధన స్థలంలో హైకోర్టు నిర్మించడం వల్ల పర్యావరణం, వ్యవసాయ పరిశోధనలు, తదితర రంగాలకు అపార నష్టం వాటిల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఓ రైతు కుటుంబం, గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన సీఎం రేవంత్ రెడ్డికి వ్యవసాయ యూనివర్సిటీ విలువ తెలియక పోవడం విచారకరమని విద్యార్థులు విమర్శించారు