Close Menu
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Facebook X (Twitter) Instagram
Trending
  • Gamble Caribbean Hold’em Casino poker on the internet pokie
  • Better No deposit Local casino Bonuses 2024 » 100 percent free Bucks & Free Spins
  • The Increase of Student-Driven Encyclopedias: Changing Understanding Landscapes
  • Finest Cellular Casinos: Greatest Us Cellular Gambling enterprise Applications and Advertisements within the 2025
  • Best Mobile Web based poker Software the real deal Cash on apple’s ios & Android os within the 2025
  • Greatest ten Online gambling Programs for real Cash in 2025
  • Casino utan svensk licens 2025 – Topp 10 casino utan Spelpaus
  • Bet with Sahabet 💰 Bonus up to 10000 Rupees 💰 Play Online Casino Games
Telangana Press
  • Telugu today
  • తాజా వార్తలు
  • వార్తలు
Telangana Press
వార్తలు

పాత చట్టం.. కొత్త సమస్య-Namasthe Telangana

TelanganapressBy TelanganapressMarch 26, 2024No Comments

పౌరసత్వ చట్టం (1955)లో సవరణలను చేస్తూ కేంద్రం శరవేగంగా రూపొందించిన పౌరసత్వ సవరణ బిల్లు (సిటిజెన్‌షిప్‌ అమెండ్‌మెంట్‌ బిల్‌), 2019 డిసెంబర్‌ 9న లోకసభ ఆమోదం పొందింది. అనుకూలంగా 311 ఓట్లు వస్తే 80 మంది వ్యతిరేకించారు.

March 27, 2024 / 02:42 AM IST
పాత చట్టం.. కొత్త సమస్య

కేంద్రంలోని ఎన్డీయే పభ్రుత్వం 2019లో వివాదాస్పద పౌరసత్వ సవరణ చట్టాన్ని తెచ్చింది. పౌరసత్వ చట్టం, దాని సవరణ చట్టం 2019తోపాటు జాతీయ పౌర పట్టిక, జాతీయ ప్రజా పట్టిక వంటి శాసనాలు, నియమాలు కూడా బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చింది. తన ఎన్నికల ప్రణాళిక ప్రకారం పౌరసత్వ చట్టాల్లో ఈ మార్పులు తెచ్చినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

2014 ఎన్నికల మ్యానిఫెస్టోలోనే, ప్రపంచంలో ఎక్కడైనా వివక్షను ఎదుర్కొంటున్న హిందువులందరికీ భారతదేశం సహజమైన ఆశ్రయం అవుతుందని, వారు శరణార్థులుగా భారతదేశం రావడానికి సదా ఆహ్వానం ఉంటుందని బీజేపీ పేర్కొన్నది. ఫారినర్స్‌ ఆర్డర్‌-1948లో 2015 సెప్టెంబర్‌ 7న చేర్చిన కొత్త నియమాల్లో బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ల నుంచి వచ్చే హిందూ, సిక్కు, బౌద్ధ, జైన, పారసీ, క్రైస్తవ మతస్థులకు ప్రత్యేక మినహాయింపులు ప్రకటించారు. ‘పాస్‌పోర్టు రూల్స్‌-1950’లో 2015, సెప్టెంబర్‌ 7న చేర్చిన కొత్త ఉప నియమం ప్రకారం పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ల నుంచి వచ్చే హిందూ, సిక్కు, బౌద్ధ, జైన, పారసీ, క్రైస్తవ మతస్థులకు ప్రత్యేక మినహాయింపులను చేర్చారు. ఈ రెండు కొత్త మినహాయింపులకూ 2016, జూలై 18న మరొక సవరణ చేస్తూ అఫ్ఘానిస్థాన్‌ పేరు కూడా చేర్చారు. ఈ మూడు అంశాలకు చట్టబద్ధత కల్పిస్తూ పౌరసత్వ చట్టంలో ప్రవేశపెట్టడానికి పౌరసత్వ సవరణ చట్టం-2019 రూపొందించారు.

పౌరసత్వ చట్టం (1955)లో సవరణలను చేస్తూ కేంద్రం శరవేగంగా రూపొందించిన పౌరసత్వ సవరణ బిల్లు (సిటిజెన్‌షిప్‌ అమెండ్‌మెంట్‌ బిల్‌), 2019 డిసెంబర్‌ 9న లోకసభ ఆమోదం పొందింది. అనుకూలంగా 311 ఓట్లు వస్తే 80 మంది వ్యతిరేకించారు. డిసెంబర్‌ 11న రాజ్యసభలో కూడా ఈ బిల్లు పాస్‌ అయింది. 125 ఎంపీలు అనుకూలంగానూ 105 మంది వ్యతిరేకంగానూ ఓట్లు వేశారు. తర్వాత అంతేవేగంగా రాష్ట్రపతి సంతకం చేయడంతో పౌరసత్వ సవరణ చట్టం (సిటిజెన్‌షిప్‌ అమెండ్‌మెంట్‌ ఆక్ట్‌) 2019గా మారిపోయింది. దీనికింద నియమాలు జారీచేయవలసి ఉండింది. న్యాయశాఖ, హోంశాఖ సంయుక్తంగా రూపొందించే నియమాలు, పౌరసత్వ సవరణ చట్టం అమలును నిర్ధారిస్తాయి.

చిన్న చట్టం పెద్ద సమస్య: ఈ పౌరసత్వ సవరణ చట్టం (2019) చాలా చిన్నది. ఐదారు సెక్షన్లలో మార్పుచేర్పులు చేసే సవరణ ఇది. సెక్షన్‌ 2లో పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్ఘానిస్థాన్‌ నుంచి వచ్చే హిందూ, సిక్కు, బౌద్ధ, జైన, పార్సీ, క్రైస్తవ మతస్థులు ‘చట్ట వ్యతిరేక చొరబాటుదారుల’ గుర్తింపు నుంచి మినహాయింపు పొందుతారు అనే మార్పును కేంద్రం చేర్చింది. అక్రమ చొరబాటుదారులు అనే నిర్వచనం నుంచి మినహాయింపు ఇవ్వడం వల్ల ఈ మూడు ఇస్లామిక్‌ దేశాల నుంచి వచ్చే ఆరు మతస్థులకు త్వరగా భారతీయ పౌరసత్వం ఇచ్చే వీలు కలుగుతుంది. ఆరు మతాలను పేర్కొన్నప్పటికీ ఇస్లాం మతం ఈ జాబితాలో లేకపోవడం వల్ల ఈ మూడు దేశాల నుంచి వచ్చే మహ్మదీయులకు త్వరితగతిన పౌరసత్వం పొందే అవకాశం ఉండదు. ఆ మూడు దేశాల నుంచి వచ్చే శరణార్థులకు, వలసదారులందరికీ వర్తించేవిధంగా నియమాలు లేకపోవడం వల్ల, ఈ చట్టం సర్వసమానతా సూత్రానికి, ఆర్టికల్‌ 14కు విరుద్ధమని విమర్శలు చెలరేగాయి. మన దేశానికి వలసదారులుగా వచ్చే విదేశీయుల్లో ఎవరికి పౌరసత్వం ఇవ్వాలో, ఎవరికి ఇవ్వకూడదో తేల్చుకునే అధికారం తనకు లేదా? అని ప్రభుత్వం వాదిస్తున్నది. ఈ దేశ పౌరులను మత ప్రాతిపదికపై విభజించడం లేదనీ, కనుక ఇది ఆర్టికల్‌-14కు భంగకరం కాదని కూడా అంటున్నది.

1955 పౌరసత్వ చట్టంలో సెక్షన్‌ 6బీ ని కొత్తగా చేర్చారు. ఈ సెక్షన్‌ 6 బీ పక్రారం.. పై విధంగా మినహాయింపు పొందిన మతస్థులు పౌరసత్వం కోసం నమోదు చేసుకున్నప్పుడు పొందే రాయితీలను వివరించింది. సెక్షన్‌ 7డీలో సవరణ, సెక్షన్‌ 18లో సవరణ ఓవర్సీస్‌ సిటిజెన్‌ ఆఫ్‌ ఇండియా కార్డు కలిగి ఉన్నవారికి ఇచ్చే మినహాయింపు గురించి చెప్తాయి. మూడో షెడ్యూల్లో కొత్తగా చేర్చిన నిబంధన ప్రకారం అఫ్ఘానిస్థాన్‌, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ నుంచి వచ్చే హిందూ, సిక్కు, బౌద్ధ, జైన, పార్సీ, క్రైస్తవ మతస్థుల విషయంలో గతంలోని ‘11 ఏండ్లకు తక్కువ కాకుండా’ అని ఉన్న నిబంధనను ‘ఐదేండ్లకు తక్కువ కాకుండా’ అని మార్చి, దరఖాస్తు చేసుకోవడానికి ముందు ఐదేండ్లు నివసిస్తే చాలు, పౌరసత్వం పొందే అవకాశం కల్పించారు. మామూలుగా అయితే అసలు చట్టం ప్రకారం.. 11 ఏండ్లు నివసించిన వలసదారులకు మాత్రమే పౌరసత్వం పొందే వీలుంది.

వాస్తవంలో ఇది మూడు ఇస్లామిక్‌ పొరుగు దేశాల నుంచి మన దేశానికి వచ్చే ముస్లింలకు భారత పౌరసత్వం ఇవ్వబోమని నిషేధం విధించడమే అవుతుందని తీవ్ర విమర్శలు వచ్చాయి. పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టే దశలో ఉద్దేశాలు, లక్ష్యాల నివేదికను ఇవ్వాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఆ విధమైన ప్రకటన చేసింది. ఒకప్పుడు భారతదేశంలో భాగాలై తర్వాత విడిపోయిన పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌, అఫ్ఘానిస్థాన్‌లు ఇస్లామిక్‌ మత రాజ్యాలుగా తమ రాజ్యాంగాల్లో ప్రకటించుకున్నాయి. అక్కడ హిందూ, సిక్కు, బౌద్ధ, జైన, పార్సీ, క్రైస్తవ మతానికి చెందిన అల్పసంఖ్యాక వర్గాలవారు మెజారిటీ మతస్థుల చేతిలో వివక్షకు, హింసకు గురవుతున్నారని, ఆ మతహింస భరించలేక ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భారతదేశానికి తరలివస్తున్నారని, శరణార్థులై చాలా మంది మన దేశంలో తలదాచుకుంటున్నారని, వారిని పూర్తిస్థాయి పౌరులుగా మార్చేందుకు సత్వర మార్గాలను ప్రవేశపెట్టి వారిని ఆదుకోవడమే ఈ చట్టం లక్ష్యమని ప్రభుత్వం వివరిస్తున్నది.

సరైన అనుమతులు లేకుండా ఈ విధంగా వచ్చేవారు ‘అక్రమ చొరబాటుదారులు’ అనే నిర్వచనం కిందకు వస్తారు. ఈ చట్టసవరణ ద్వారా ఆ నిర్వచనం నుంచి 6 మతాల వలసదారులకు మినహాయింపు ఇచ్చారు. వీరిపైన చట్టపరమైన చర్యలు తీసుకోకుండా ఉండటానికి, వీరికి దీర్ఘకాలిక వీసాలు ఇవ్వడానికి ఇప్పటికే పాస్‌పోర్టు (ఎంట్రీ ఇన్‌ టు ఇండియా) చట్టం (1920)లోనూ, ఫారినర్స్‌ చట్టం(1946)లోనూ 2015, 2016లో సవరణలు చేశారు. కానీ, వారికి పౌరసత్వం ఇవ్వడం ఆ సవరణల ద్వారా సాధ్యం కాదు. కనుక ఈ సవరణ చట్టం తేవడం అవసరమని కేంద్ర ప్రభుత్వం వివరించింది. ఈ అన్ని సవరణల ఫలితంగా 2014 డిసెంబర్‌ 31కి ముందు ఆ మూడు దేశాల నుంచి వచ్చిన ఆ 6 మతాల వలసదారులకు త్వరగా సులభంగా భారత పౌరసత్వం ఇవ్వడానికే ఈ సవరణ తెస్తున్నామన్నారు.

ఇస్లామిక్‌ మత దేశాలుగా ప్రకటించుకున్న అఫ్ఘానిస్థాన్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌లలో హిందువులు, ఇతర అల్పసంఖ్యాక వర్గాలవారి జనాభా నానాటికి తగ్గిపోతున్న మాట వాస్తవం. దానికి కారణం వారిపై సాగుతున్న తీవ్ర మత వివక్ష అనడంలో కూడా సందేహం లేదు. అధికారికంగా మత రాజ్యమని ప్రకటించుకున్న ఈ దేశ రాజ్యాంగాలు సెక్యులర్‌ విలువలను పాటించే అవకాశం ఉంటుందనుకోలేం. హత్యలకు అత్యాచారాలకు, మతమార్పిడులకు గురయ్యే ఈ అల్పసంఖ్యాక వర్గాలకు, ముఖ్యంగా హిందువులకు భారతదేశం తప్ప మరో గత్యంతరం లేదు. అలాంటి శరణార్థులకు ఆశ్రయం కల్పించడం, కావాలంటే పౌరసత్వం ఇవ్వడం నిజంగా మానవతా దృష్టితో కూడుకున్న మంచి పని. ముస్లింలు ఆ మూడు దేశాల్లో మైనారిటీలు కాదనీ, వారి పట్ల మత వివక్ష ఉండే అవకాశమే లేదని ప్రభుత్వం వాదన. అదే నిజమైతే ముస్లింలు శరణార్థులై వచ్చే అవకాశమే లేకపోతే, వారిని ప్రత్యేకంగా మినహాయించి, మిగిలిన ఆరు మతాలవారికే సత్వర పౌరసత్వ సదుపాయం కల్పించడం దేనికి? అది ఇరుగుపొరుగు దేశాల్లో కేవలం మూడు దేశాలకే ఈ సదుపాయాన్ని పరిమితం చేయడం దేనికి? ప్రపంచంలో ఏ దేశం నుంచైనా మత వివక్షకు గురైన మైనారిటీలకు ఆశ్రయం కల్పించాలన్న గొప్ప మానవతావాదం దీని వెనుక లేదనేది సుస్పష్టం.

కనీసం మన అఖండ భారతదేశం నుంచి వేరైన దేశాల నుంచి వచ్చేవారినైనా పూర్తిగా ఆదరిస్తున్నామా? అంటే అదీ లేదు. అఫ్ఘానిస్థాన్‌కు మన దేశంతో సరిహద్దు లేదు. అయినా అక్కడినుంచి వచ్చేవారికి పౌరసత్వ సదుపాయం కల్పిస్తున్నారు. మన దేశపు హద్దులను ఆనుకొని ఉన్న మయన్మార్‌ నుంచి రోహింగ్యాలు మన దేశంలోకి వలస వస్తూనే ఉన్నారు. సముద్రం విడదీసిన శ్రీలంక నుంచి మతవివక్ష, అంతర్యుద్ధం కారణంగా వేలాదిమంది తమిళులు కూడా మన దేశంలోకి వస్తూనే ఉన్నారు. వారూ హిందువులే కదా. శ్రీలంక పేరును చేర్చకపోవడం ద్వా రా వారికి అవకాశాన్ని తొలగించారు. పాకిస్థాన్‌ పేరు చేర్చినా, అక్కడ మతహింసకు, వివక్షకు గురైనవారందరికీ ఆశ్రయం కల్పించే మానవత్వం ఉందా అంటే అదీ లేదు. ఎందుకంటే అక్కడ అహ్మదియాలు, షియాలు, సూఫీలు, బలూచీలు ఇంకా అనేక మైనారిటీ తెగలవారున్నారు. అదే విధంగా బంగ్లాదేశ్‌లో ఈ ఆరు మతాల వారే కాకుండా కనీసం 12 గిరిజన తెగలవారు కూడా మతవివక్షకు గురవుతున్నారు. వారికి ఆశ్రయం పౌరసత్వం ఇవ్వరన్న మాట.

పౌరసత్వ చట్టం (1955) ప్రకారం శరణార్థులై ఏ దేశాల నుంచి వచ్చినవారైనా సరే, ఏ మతం వారైనా, ముస్లింలైనా సరే, 11 ఏండ్లు ఈ దేశంలో నివసించి ఉంటే పౌరసత్వం పొందడానికి దరఖాస్తు పెట్టుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం కొన్ని షరతులకు లోబడి వారికి పౌరసత్వం ఇవ్వవచ్చు కూడా. ముస్లింలకు పౌరసత్వం ఇవ్వడానికి ఈ సవరణ చట్టం ఒక నిషేధం వంటిదనే విమర్శలకు
ప్రభుత్వం ఇస్తున్న సమాధానం ఏమంటే, పౌరసత్వ చట్టం (1955)లో సవరణ పూర్వ నియమాల కింద ‘ముస్లిం వలసదారుల’కు కూడా
పౌరసత్వం ఇవ్వచ్చునని.
2014 డిసెంబర్‌ 31లోగా మన దేశానికి అఫ్ఘానిస్థాన్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ నుంచి మత వివక్షకు గురై వచ్చిన హిందువులు, క్రైస్తవులు, జైనులు, పార్సీలు, సిక్కులు, బౌద్ధులకు ఐదేండ్ల పాటే నివసించి ఉంటే వారికి పౌరసత్వం ఇస్తామని 2019 సవరణ చట్టం ప్రకటిస్తున్నది. ఈ చట్టాల పదాల్లో, వాక్యాల్లో, మినహాయింపుల్లో కనిపించని పథకాలు ఏవైనా ఉన్నాయా?

మనం కేవలం రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వాన్ని నడపాలి. రాజ్యాంగాన్ని మార్చుకోవచ్చు. కానీ మౌలిక లక్షణాలను సవరించడానికి వీల్లేదు. కేశవానంద భారతి కేసులో 13 మంది న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పుతో 50 ఏండ్లుగా ఈ రాజ్యాంగ బేసిక్‌ స్ట్రక్చర్‌ను (మౌలిక లక్షణాలు) కాపాడుకుంటూ వస్తున్నాం. బేసిక్‌ స్ట్రక్చర్‌ అంటే అపార్టుమెంట్‌లో కీలకమైన స్తంభాలు మార్చడానికి వీల్లేదు. ఆ విధంగా మార్చితే భవనం కూలిపోతుంది. అంటే స్తంభాన్ని మార్చకుండా తలుపులు, కిటికీలు, గోడలు మార్చుకోవడానికి వీలుంది. ఇదే బేసిక్‌ స్ట్రక్చర్‌!

మాకు అధికారం ఉన్నదని ప్రతి పార్టీ రాజ్యాంగాన్ని మార్చుకుందామనుకుంటే అది సరైన పరిపాలన కాదు. రాజ్యాంగం మౌలిక లక్షణాలను దెబ్బతీసేలా కొత్త చట్టాలను తీసుకురావడానికి వీలు లేదు. ఈ నేపథ్యంలో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) గురించి ఆలోచించాలి. పౌరసత్వాన్ని సవరిస్తూ 2019లో పలు మార్పులు తీసుకొచ్చారు. అప్పటినుంచి ఐదేండ్ల దాకా ఈ చట్టాన్ని అమలు చేయలేదు, చేయలేకపోయారు. ఈ సవరణ దేశానికి మంచిదని చాలామంది నమ్మడం లేదు. ఇన్నాళ్లు అంటే ఐదేండ్లుగా సీఏఏను అమలు చేయకుండా కేవలం ఎన్నికలకు ముందు ఈ నిబంధనలు తెచ్చారు. అయితే చట్టం ఏం చెప్పినప్పటికీ ఆ నియమాల అమలు మాత్రం న్యాయంగా ఉంటుందా, ఉండదా? అనే అనుమానాలు పెరిగిపోయాయి. అందువల్లే నిరసనలు, విమర్శలు, పిల్స్‌ వేయడం, దిష్టిబొమ్మలు తగలబెట్టడం వంటి ఆందోళనలు! మాకు 400 ఎంపీల సీట్ల కన్నా ఎక్కువగా వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తామని బీజేపీ నేతలు భయపెడుతున్నారు.

పౌరసత్వ సవరణ చట్టం ఈ దేశంలోని ముస్లింల సమస్య కాదు. అది దేశ రాజ్యాంగానికీ, లౌకికవాదానికి, ప్రజాస్వామ్యానికీ ముంచుకొస్తున్న ప్రమాదానికి సంబంధించిన సమస్య. పౌరసత్వ సవరణ చట్టం రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధమైనది. 2019 పౌరసత్వ సవరణ చట్టం దేశంలోని ప్రజలను విడగొట్టే ప్రమాదం ఉన్నది. కుల, మత, ప్రాంతీయ, భాషా భేదాలకు అతీతంగా దేశ పౌరులందరూ చట్టం ముందు సమానమేనని చెప్తున్న భారత రాజ్యాంగానికి విరుద్ధంగా ఈ చట్టం దేశంలోని కొందరి పట్ల వివక్షను ప్రదర్శిస్తుంది. దీనితోపాటు అసోంలో జారీచేసిన జాతీయ పౌరసత్వ రిజిష్టర్‌ (ఎన్‌ఆర్‌సీ)ను దేశమంతటికీ విస్తరించడానికి చేస్తున్న ప్రయత్నాలు భారతదేశ లౌకిక స్వభావాన్ని మారుస్తాయి. భారతీయులమైన మనం భారతీయులమేనని నిరూపించుకోడానికి ప్రభుత్వం ఏర్పాటుచేసిన క్యూలైన్లలో నిలుచొని పత్రాలు సమర్పించాల్సి వస్తుంది. పత్రాలు లేకపోతే మనమంతా స్వదేశంలో అక్రమ వలసదారులమవుతాం. దీనివల్ల దేశంలోని ముస్లిం ప్రజలే కాకుండా హిందువులు దాదాపు 140 కోట్ల జనాభా తాము భారత పౌరులమేనని నిరూపించుకోవల్సిందేనా? సరైన పత్రాలు లేనివారంతా విదేశీయులుగా ముద్రపడి శరణార్థుల శిబిరాల్లో బతుకాల్సి ఉంటుందా?

2019 డిసెంబర్‌ 11న పార్లమెంటులో ప్రతిపక్షాలన్నీ బహిష్కరించిన తర్వాత ప్రజాస్వామ్యం ఎన్నడూ చూడని రీతిలో ఈ బిల్లును ఆమోదింపజేసుకొని, సాధించుకున్నారు. ముస్లింలను ప్రత్యేకంగా మినహాయించడం వివాదమైంది. ఆ వివాదం వల్లనే దేశవ్యాప్తంగా ఆందోళనలు, సమస్యలు తలెత్తుతున్నాయి. ఢిల్లీలో కూడా నిరసనలు, దిష్టిబొమ్మల దహనం జరిగాయి. అంతేకాదు, ఈ చట్టాన్ని సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో అనేక పిల్స్‌ దాఖలయ్యాయి. ఢిల్లీలో, పశ్చిమబెంగాల్‌లో భద్రతా సమస్యలు తలెత్తాయి. పోలీసులు మిలిటరీ బలగాలు తనిఖీలు జరపాల్సి వస్తున్నది. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను జాతీయ పౌరుల రిజిస్టర్‌ (ఎన్‌ఆర్సీ)తో అనుసంధానించడం, కొత్తచట్టంపైనా వ్యతిరేకతకు మరో కారణం.

ఈ దేశంలో ఉండేవారు భారతీయ పౌరులా? కాదా? అనేది ఏ విధంగా నిర్ణయిస్తారు? మీరు, మీ తండ్రులు, తాతలు అంతా భారత పౌరులని ఏ విధంగా రుజువు చేయాలి? అనే ప్రశ్నలకు సరైన జవాబులు దొరకడం లేదు. ఇది ప్రధాన సమస్య. దీనివల్ల ఈ దేశంలో ఉన్నవారికి, వేరే దేశం నుంచి వచ్చినవారికి భారత్‌లో పౌరసత్వం పొందాలంటే కావాల్సిన అర్హతలు, ధృవీకరణలు ఎక్కడ దొరుకుతాయి? ఉన్నట్టుండి మా తాత భారత పౌరసత్వం కలిగి ఉండేవాడని రుజువు చేసుకోవడానికి అర్హతలు ఎక్కడ దొరుకుతాయి? ధ్రువీకరణ పత్రాలు ఎక్కడ లభిస్తాయి? ఒకవేళ దొరకకపోతే ఇక్కడ పుట్టినవాడు, తరతరాలుగా ఉన్నవాడు, ఓటింగ్‌ ఉన్నవాళ్లు కూడా, ఆధార్‌ ఉన్నా.. పౌరుడు కాదనే అనుమానం వస్తే ఏం చేయాలి?

ఒకవేళ కేంద్ర ప్రభుత్వం ఏ పౌరుడికైనా పౌరసత్వాన్ని నిరాకరిస్తే, ఇవ్వబోమని నిర్ణయిస్తే.. ఎక్కడికి వెళ్లాలి, ఏ దేశానికి వెళ్లాలి? ఒకవేళ వీడు విదేశీయుడని నిర్ణయిస్తే.. ఆ మాజీ పౌరులు ఏమైపోవాలి? అరెస్టు చేస్తారు. జైల్లో పెడతారు. వారు జైల్లో ఎన్నాళ్లు ఉంటారు? ఎవరికైనా పౌరసత్వాన్ని భారత ప్రభుత్వం నిరాకరిస్తే.. భారత రాజ్యాంగంలో ఉన్న ఏ హక్కులూ దక్కవు. అప్పుడు వాళ్ల గతి ఏమిటి? అసోం తరహాలో లక్షల మంది జైలుపాలు కావాల్సిందేనా? కనుక కొన్ని కొత్త జైళ్లు నిర్మిస్తారు. ఇదా దేశాభివృద్ధి కార్యక్రమం?

50 ఏండ్ల నాటి కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశం ఇప్పటికీ ప్రామాణికంగానే ఉంది. కనుక భవిష్యత్తులోనూ కులాలు, మతాల ఆధారంగా పరిపాలన చేయడానికి వీల్లేదు. ముఖ్యంగా పౌరసత్వ అర్హతలను మార్చే అధికారం ప్రభుత్వానికి లేదు. రాజ్యాంగ పీఠికలో లౌకిక అనే పదాన్ని తొలగించేస్తామంటున్నారు. పదం ఉన్నా, లేకపోయినా లౌకిక లక్షణాన్ని తీసివేసే అధికారం మాత్రం ఎవరికీ లేదు. సీఏఏ చట్టాన్ని మార్చి 11న అమల్లోకి తీసుకొచ్చారు. వెంటనే ఎన్నో చోట్ల అల్లర్లు జరిగాయి. అనేక చోట్ల సాయుధ బలగాలను రంగంలోకి దింపారు. ఢిల్లీలో పోలీసులతో ఫ్లాగ్‌మార్చ్‌ కూడా జరిపించాల్సి వచ్చింది. దేశవ్యాప్తంగా ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. అసోంతో సహా ఈశాన్య రాష్ర్టాల్లోని మూలవాసులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు.

ఎన్నికల ముందు ఇంత కీలకమైన మార్పు చేయడం న్యాయమా? అవసరమా? రాజకీయ ప్రయోజనాల కోసమేనా ఇదంతా? 1950లో జనవరి 26న అమల్లోకి వచ్చిన భారత రాజ్యాంగంలో పౌరసత్వ మౌలిక లక్షణాలను పేర్కొన్నారు. వీటి ఆధారంగా 1955లో చట్టాన్ని తీసుకువచ్చారు. దీని ప్రకారం పొరుగు దేశాల నుంచి వలస వచ్చినవారికి భారత పౌరసత్వం ఇవ్వడానికి వీలు లేదు. మొట్టమొదటి పౌరసత్వ చట్టం (1955) ప్రకారం… భారతీయ పౌరసత్వాన్ని అక్రమంగా వచ్చినవారికి ఇవ్వరు. ఒకవేళ పత్రాలు ఉంటే రావచ్చు. వీసా గడువు దాటిపోతే రావడానికి వీలులేదు. అయితే వీసా గడువు ఉంటే, ధృవీకరణాలు దొరికితే ముస్లిమేతర శరణార్థులను దేశంలో నివసించడానికి అవకాశం ఇస్తూ మార్పులు చేశారు.

ప్రస్తుతం ఏమిటంటే ఎట్టి పరిస్థితుల్లో సీఏఏని వెనక్కి తీసుకోబోమని, కచ్చితంగా అమలుచేస్తామని కేంద్ర హోంమంత్రి పదే పదే స్పష్టంగా చెప్పారు. అయితే మైనారిటీలు, ఇతర వర్గాలు భయపడవలసిన అవసరం లేదని ఒక హామీ మాత్రం ఇచ్చారు. పౌరసత్వాన్ని తీసివేయబోమన్నారు. ఇది నిజమైతే భయపడాల్సిన అవసరం లేదు. భారత పౌరసత్వం అనేది ప్రభుత్వ సార్వభౌమ నిర్ణయం అని కేంద్ర ప్రభుత్వం అంటున్నది. సీఏఏ అమలు కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. అందులో రాష్ర్టాలకు ఎలాంటి పాత్రా లేదు. నిజానికి సీఏఏను పోస్టల్‌ విభాగం ద్వారా అమలుచేస్తారు. కావాలంటే రాష్ట్ర ప్రభుత్వాలు అక్కడి పోలీసులు కేంద్రానికి భద్రతపరంగా సహాయం చేయవలసి ఉంటుంది. ఇదొక ప్రమాదకరమైన అధికారం. ఒకరకంగా అన్ని రాష్ర్టాల అధికారాలను కేంద్రీకరించడానికి ఈ చట్టం ఉపయోగపడుతుందని అనుమానిస్తున్నారు. అనుమానాలను తీర్చకుండా చట్టాలు అమలుచేయడం సాధ్యం కాదు. పౌరసత్వం సక్రమంగా లభిస్తే ప్రమాదం లేదు. గొప్ప విషయమే కూడా. కానీ, దేశం నుంచి బయటికి పంపడానికి ప్రభుత్వాలు పౌరులను పౌరులు కాదనే పరిస్థితి తీసుకువస్తే ఈ సమస్యను ఏ విధంగా పరిష్కరిస్తారు? సీఏఏను ఎన్‌ఆర్‌సీతో అనుసంధానించి ముస్లింలను మాత్రమే అక్రమ వలసదారులుగా మార్చి వేధిస్తారా? పౌరులు కాదంటూ వారి ఆస్తులను కూడా జప్తు చేస్తారా? ఇవీ కొత్త చట్ట సవరణలపై తలెత్తే అనుమానాలు.

-మాడభూషి శ్రీధర్‌

Source link

Telanganapress
  • Website

Related Posts

రైతు ఆదాయం రెట్టింపునకు ప్రత్యేక ప్రణాళిక-Namasthe Telangana

April 16, 2024

‘లోక్‌సభ’కు బీఆర్‌ఎస్‌ సన్నద్ధం-Namasthe Telangana

April 16, 2024

Health Insurance- IRDAI | హెల్త్ ఇన్సూరెన్సీ ‘కవరేజీ’పై ఐఆర్డీఏఐ గుడ్ న్యూస్.. అదేమిటంటే..?!-Namasthe Telangana

April 16, 2024
Leave A Reply Cancel Reply

Categories
  • 1
  • AI News
  • News
  • Telugu today
  • Uncategorized
  • తాజా వార్తలు
  • వార్తలు
కాపీరైట్ © 2024 Telanganapress.com సర్వ హక్కులు ప్రత్యేకించబడినవి.
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions
  • About us
  • Contact us

Type above and press Enter to search. Press Esc to cancel.