ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నది. మార్కెట్ కమిటీ అధికారులు వ్యాపారులతో కుమ్మక్కై రైతుల కష్టాన్ని తక్కువ చేసే ప్రయత్నం చేస్తే సహించేది లేదు.

- సీఎం స్పందన తర్వాతా ధాన్యానికి దక్కని మద్దతు ధర
- అధికార యంత్రాంగం జోక్యం చేసుకున్నా జనగామ మార్కెట్లో తీరు మారని కొనుగోళ్లు
- వ్యాపారుల చేతిలో రైతుల నిలువుదోపిడీ
- రూ.500 బోనస్ కాదు.. 640 రివర్స్‌లాస్
- రెండోరోజూ మార్కెట్‌కు వెళ్లి రైతాంగానికి అండగా నిలిచిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే
- బాధిత రైతులకు 1,800 చొప్పున చెల్లించాలి
- క్వింటా ధాన్యం 2,200కు కొనాల్సిందే
- లేకుంటే రైతుల పక్షాన ఆందోళన చేస్తాం
- అధికారులకు పల్లా రాజేశ్వర్‌రెడ్డి హెచ్చరిక
జనగామ, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ)/హనుమకొండ/కమలాపూర్: ‘ధాన్యం కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నది. మార్కెట్ కమిటీ అధికారులు వ్యాపారులతో కుమ్మక్కై రైతుల కష్టాన్ని తక్కువ చేసే ప్రయత్నం చేస్తే సహించేది లేదు. రాష్ట్రవ్యాప్తంగా అధికారులందరూ ధాన్యం కొనుగోళ్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలి’. ఇదీ జనగామ వ్యవసాయ మార్కెట్‌లో వ్యాపారులు ధాన్యం ధర తగ్గించి కొనుగోలు చేస్తున్నారంటూ రైతులు ఆందోళనకు దిగిన నేపథ్యంలో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించిన తీరు. కానీ, గురువారం మార్కెట్‌లో క్వింటా ధాన్యానికి వ్యాపారులు పెంచిన ధర రూ.30 మాత్రమే. ఈనామ్ ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో రూ.1,530కు ధాన్యం కొనుగోలు చేసిన వ్యాపారులు, ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినా,మద్దతు ధర క్వింటాకు రూ.2,200 కు బదులుగా రూ.1,560కి మాత్రమే కొనుగోలు చేశారు. అంటే రైతుల ఆందోళనల నేపథ్యంలో సీఎం ట్వీట్ చేసినా వ్యాపారులు విదిల్చింది ముప్పై రూపాయలే.
ముఖ్యమంత్రి స్పందించి జిల్లా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినా జనగామ మార్కెట్‌లో ధాన్యం కొనుగోళ్ల తీరు మారలేదు. వ్యాపారుల దోపిడీ ఆగలేదు. యార్డులో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి అధికారులు చేతులు దులుపుకున్నారు. తేమ, తాలు పేరు తో యథావిధిగా ట్రేడర్లు, వ్యాపారులు రైతులను గోస పెడుతున్నారు. క్వింటాకు రూ.500 బోనస్ ధర ఇస్తామని కాంగ్రెస్ ఆశ పెట్టినప్పటికీ, ఇప్పుడు బోనస్ ధర దేవుడెరుగు మద్దతు ధరే దక్కని పరిస్థితి ఎదురవుతున్నది. క్వింటా ధాన్యానికి కేంద్ర ప్రభు త్వం ప్రకటించిన కనీస మద్దతు ధర రూ.2,200 కాగా, జనగామ మార్కెట్‌లో రైతులకు దక్కింది రూ.1,560 మాత్రమే. అంటే తమకు రూ.500 బోనస్‌కు బదులుగా రూ.640 రివర్స్‌లాస్ వస్తున్నదని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇదిలా ఉండగా స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి వరుసగా రెండోరోజు గురువారం మార్కెట్ యార్డును సందర్శించి రైతాంగానికి అండగా నిలిచారు. రెండురోజులుగా అతి తక్కువ ధరకు రూ.1,530, రూ.1,560కే అమ్ముకొని నష్టపోయిన రైతులకు ప్రభుత్వం రూ.1,800 ధర చెల్లించాలని డిమాండ్ చేశారు.
కొనుగోళ్లు స్పీడ్‌అప్ చేయాలి: అడిషనల్ కలెక్టర్ వెంకట్‌రెడ్డి
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తేమ శాతం పరిశీలించి కాంటాలు వేగవంతం చేయాలని హనుమకొం డ జిల్లా అడిషనల్ కలెక్టర్ వెంకట్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ‘నమస్తే తెలంగాణ’ దిన పత్రికలో ‘రైతుకు దుఃఖం.. దళారికి రొక్కం’ శీర్షికతో కథనం ప్ర చురించిన నేపథ్యంలో గురువారం ఆయన కమలాపూర్ మండలంలోని కమలాపూర్, గూడూరు, అం బాల గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను పరిశీలించి, రైతులతో మాట్లాడారు. రైతులు అధైర్య పడొద్దని, పండిన ప్రతి గింజనూ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని చెప్పారు. దళారులకు అమ్ముకోవద్దని సూచించారు. రైస్‌మిల్లర్లు తక్కువ ధరకు కొనుగోలు చేసినట్టు తెలిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆయన కమలాపూర్ కొనుగోలు కేంద్రంలో పరిశీలిస్తుండగానే వర్షం రావడంతో రైతులకు టార్పాలిన్ కవర్లు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. 20 కవర్లు ఉన్నాయని అధికారులు చెప్పడంతో మరిన్ని తెప్పించాలని సూచించారు. శుక్రవారం నుంచి కొనుగోళ్లు వేగవంతం చేయాలని, వ్యవసాయాధికారులు దగ్గరుండి టోకెన్లు ఇవ్వాలని ఆదేశించారు. రైతులు కూడా నాణ్యమైన ధాన్యం తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని కోరారు. కార్యక్రమంలో ఏడీఏ దామోదర్‌రెడ్డి, తహసీల్దార్ మాధవి, సివిల్ సప్లయ్ డీటీ కృష్ణ, ఏఈవోలు వినయ్‌వర్మ, రాజు పాల్గొన్నారు.
ప్రభుత్వ మద్దతు ధరకే ధాన్యం కొనుగోలు: సివిల్ సప్లయి కార్పోరేషన్ అధికారులు
‘నమస్తే తెలంగాణ’ దిన పత్రిక కథనంపై సివిల్ సప్లయి కార్పొరేషన్ అధికారులు సైతం స్పందించారు. ధాన్యాన్ని మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు హనుమకొండ జిల్లాలో ఐకేపీ, పీఏసీఎస్ ద్వారా 150 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేశామని సివిల్ సప్లయి కార్పొరేషన్ జిల్లా మేనేజర్ (డీఎం) యు మహేందర్ తెలిపారు. జిల్లాలో 27 లక్షల గన్నీ సంచులు నిలువ ఉన్నాయని చెప్పారు. వ్యవసాయ శాఖ అధికారుల నివేదిక ప్రకారం జిల్లాలో ధాన్యం దిగుబడి ఈ నెల మూడో వారంలో కొనుగోలు కేంద్రాలకు వస్తుందని తెలిపారు. రెండు, మూడు రోజుల్లో అన్ని కొనుగోలు కేంద్రాలకు గన్నీ సంచులు, టోకెన్ పుస్తకాలు, స్టాక్ రిజిస్టర్లు, ట్రక్ చిట్ పుస్తకాలు సరఫరా చేస్తామని తెలిపారు.
జిల్లాలోని రైస్ మిల్లర్లు రైతుల నుంచి ధాన్యాన్ని మద్దతు ధర కంటే తకువ ధరకు కొనుగోలు చేస్తున్న విషయం తమ దృష్టికి రాలేదని చెప్పారు. ఒకవేళ ఏ మిల్లర్ అయినా మద్దతు ధరకంటే తకువ ధరకు కొనగోలు చేస్తున్నట్టు తమ దృష్టికి వస్తే సదరు మిల్లర్‌పై తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇప్పటివరకు కమలాపూర్ మండలంలో ఒక ఉప్పల్‌లో ఏర్పాటుచేసిన ఐకేపీ కేంద్రానికి మాత్రమే ధాన్యం వచ్చిందని పేర్కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు అవసరమైన సదుపాయాలు కల్పించాలని జిల్లా కోఆపరేటివ్ అధికారికి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారికి ఆదేశాలు ఇచ్చామని తెలిపారు.
మద్దతు ధరకు కొనకపోతే ఊరుకోం: ఎమ్మెల్యే పల్లా
జనగామ ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి కేవలం కంటితుడుపు చర్యగా ట్వీట్ చేసి రైతులను మోసం చేశారని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి స్థాయిలో జోక్యం చేసుకున్నా రూ.30 పెంచి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ముష్టి వేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. సోమవారం నుంచి మార్కెట్‌లో కనీస మద్దతు ధర రూ.2,200కు ధాన్యం కొనుగోలు చేయకపోతే రైతుల పక్షాన ముందుండి ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. రైతులకు అండగా ఉంటానని, మద్దతు ధరకు ఎందుకు కొనరో చూస్తానని, అన్యాయం జరిగితే యార్డుకు వచ్చి కూర్చుంటానని స్పష్టంచేశారు. తక్కువ ధరకు అమ్ముకున్న రైతులకు కూడా క్వింటాకు రూ.2,200 చెల్లించాల్సిందేనని డిమాండ్ చేశారు. నష్టాన్ని వ్యాపారుల నుంచి ఇప్పిస్తారా? ప్రభుత్వం ఇస్తాందా? అనేది రైతులకు సంబంధంలేదని చెప్పారు.
ఆ తర్వాతా.. అదే కోత!
ఈనామ్ ఆన్‌లైన్ ట్రేడింగ్‌లో క్వింటాల్‌కు రూ.1,530 చొప్పున వడ్లు కొనుగోలు చేసిన వ్యాపారులు.. సీఎం ట్వీట్ తర్వాత రూ.1,560కు మాత్రమే కొనుగోలు చేశారు. అంటే రైతుకు విదిల్చింది ముప్ఫైరూపాయలే!
తక్కువ ధర చెల్లిస్తే సహించం: సీఎం
ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నది. మార్కెట్ కమిటీ అధికారులు వ్యాపారులతో కుమ్మక్కై, రైతుల ఉత్పత్తులకు తక్కువ ధర చెల్లించేందుకు యత్నిస్తే సహించబోము. ట్రేడర్లు, మార్కెట్ సిబ్బందిపై చర్యలకు ఆదేశించిన అదనపు కలెక్టర్‌ను అభినందిస్తున్నాను.
– గురువారం మధ్యాహ్నం ట్వీట్‌లో సీఎం రేవంత్