
యాదాద్రి: కల్తీపాల ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు నిత్యం వేల లీటర్ల కల్తీ మద్యం సరఫరా చేస్తున్న వారిని ఎస్ ఓటీ పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి మండలం బీఎన్ తిమ్మాపురం గ్రామంలో వాహనంలో కల్తీ పాలను తరలిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. ఒక సుమో, 200 లీటర్ల పాలను స్వాధీనం చేసుకున్నారు.
కల్తీ పాల ఘటనకు సంబంధించి ఓ వ్యక్తిని అరెస్టు చేశారు. కల్తీ పాలను తయారు చేసేందుకు ఉపయోగించే రసాయనాలు, పౌడర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
భువనగిరి విలేజ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ముగ్గురిపై కేసు నమోదు చేయగా, ఇద్దరు పరారీలో ఉన్నారు. ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
