ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని దుబ్బ ఎంకే గార్డెన్‌లో గురువారం నిర్వహించిన బీఆర్‌ఎస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల సన్నాహక సమావేశంలో అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తాతో కలిసి పాల్గొన్నారు.

- ఆరు గ్యారెంటీలతో హస్తం పార్టీ మభ్యపెట్టింది
- ఐదేండ్లలో జిల్లాకు అర్వింద్ చేసిందేమీలేదు..
- బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఆగ్రహం
- జిల్లా కేంద్రంలో లోక్‌సభ ఎన్నికల సన్నాహక సమావేశం
- హాజరైన అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా
ఖలీల్‌వాడి, ఏప్రిల్ 11: ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని దుబ్బ ఎంకే గార్డెన్‌లో గురువారం నిర్వహించిన బీఆర్‌ఎస్ పార్టీ లోక్‌సభ ఎన్నికల సన్నాహక సమావేశంలో అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తాతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా బాజిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పంటలకు సాగునీరు అందకపోవడంతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని అన్నారు. వరికి రూ. 500 బోనస్ ఇస్తామన్న హామీని తుంగలోకి తొక్కిందన్నారు. తాగునీరు, విద్యుత్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిందన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలుచేసిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాన్నే కాంగ్రెస్ సర్కార్ కొనసాగిస్తున్నదని, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తులం బంగారం ఎవరికైనా ఇచ్చారా అని ప్రశ్నించారు. ఎంపీ అర్వింద్ ఈ ఐదేండ్లలో జిల్లాకు చేసిందేమీ లేదన్నారు. పసుపు బోర్డు పేరుతో ఎంపీగా గెలిచిన ఆయన మళ్లీ అదే పేరుతో గెలువాలని చూస్తున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్, బీజేపీ నాయకులను నిలదీయాలి: బిగాల
అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల మాట్లాడుతూ.. నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన బాజిరెడ్డిని ఎంపీగా గెలిపించి ఢిల్లీలో మన గొంతును వినిపించాలన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు లోక్‌సభ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం వచ్చిందన్నారు. మేయర్ దండు నీతూకిరణ్, బీఆర్‌ఎస్ నాయకులు సిర్ప రాజు, దారం సాయిలు, సుజిత్‌సింగ్ ఠాకూర్, సూదం రవిచందర్, సత్యప్రకాశ్, ప్రభాకర్‌రెడ్డి, ఎనుగందుల మురళి తదితరులు పాల్గొన్నారు.