తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టిక్కెట్ల మే నెల కోటాను ఫిబ్రవరి 19 ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో టీటీడీ విడుదల చేయనుంది. ఈ సేవా టిక్కెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ 21 ఫిబ్రవరి 10 వ తేదీ ఉదయం వరకు చేయవచ్చు. అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు లక్కీడిప్‌లో టిక్కెట్లు కేటాయిస్తారు. ఈ టిక్కెట్లు పొందిన వారు డబ్బులు చెల్లించి ఖరారు చేసుకోవాలి.
కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా కోటా టిక్కెట్లను ఫిబ్రవరి 22వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్‌లకు సంబంధించిన మే కోటాను ఫిబ్రవరి 22 మధ్యాహ్నం 3 గంటలకు TTD ఆన్‌లైన్‌లో విడుదల చేస్తుంది.
మే నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఫిబ్రవరి 23న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఇక శ్రీవాణి ట్రస్టు టికెట్లకు సంబంధించిన మే నెల ఆన్ లైన్ కోటాను ఫిబ్రవరి 23వ తేదీ ఉదయం 11 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా మే నెల ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను ఫిబ్రవరి 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
మే నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను ఫిబ్రవరి 24న ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. తిరుమల, తిరుపతిలలో మే నెల గదుల కోటాను ఫిబ్రవరి 24న మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. ఫిబ్రవరి 27న ఉదయం 11 గంటలకు శ్రీవారి సేవ, మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ, మధ్యాహ్నం 2 గంటలకు పరకామణి సేవ కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు.
ఇది కూడా చదవండి: రాష్ట్రంలో 12 మంది అడిషనల్ ఎస్పీలకు స్థానచలనం
