అసెంబ్లీ ఎన్నికల సమయంలో అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. 420 హామీలు అమలు చేయకపోతే వెంటాడుతాం.. వేటాడుతాం అని రేవంత్‌ను కేటీఆర్ హెచ్చరించారు.
ఇవాళ(బుధవారం)మల్కాజ్‌గిరి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని మేడిపల్లిలో నిర్వహించిన బీఆర్ఎస్ మీటింగ్‌లో కేటీఆర్ పాల్గొని మాట్లాడారు. ఉగాది పచ్చడి మాదిరిగానే జీవితంలో ఎత్తుపల్లాలు, చేదు తీపి అనుభవాలు ఉంటాయి. రాజకీయాల్లో కొన్ని సార్లు గెలుస్తాం.. కొన్నిసార్లు ఓడిపోతాం. గెలిచినంత మాత్రానా పొంగిపోవద్దు.. ఓడినంత మాత్రానా కుంగిపోయేది లేదు. మనకు ప్రధాన ప్రతిపక్షంగా పని చేయాలని ప్రజలు తీర్పు ఇచ్చారు. ఆ బాధ్యత నిర్వర్తిస్తూ ఎన్నో అంశాలపై పోరాటం చేస్తున్నాం అని కేటీఆర్ తెలిపారు.
కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలంటే వారు పెట్టిన డమ్మీ అభ్యర్థిని ఓడించాలి. చేవెళ్లలో పనికిరాని చెత్తను మల్కాజ్‌గిరి ముఖం మీద పడేసిండు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఎంత నష్టం జరిగిందో మీ కండ్ల ముందే ఉంది. మళ్లా ఒక్కసారి ఓటేస్తే మోసపోతాం. డమ్మీ అభ్యర్థిని బీజేపీకి లాభం చేసేందుకు నిలబెట్టారు. సికింద్రాబాద్‌లో డమ్మీ అభ్యర్థి. కరీంనగర్‌లో ఇప్పటి వరకు అభ్యర్థిని ప్రకటించలేదు. బీజేపీ, కాంగ్రెస్ గెలవాలి. కేసీఆర్, బీఆర్ఎస్ ఉండొద్దనేది ఈ రెండు పార్టీల పంథం. రాహుల్ గాంధీని రేవంత్ పిచ్చోడ్ని చేస్తున్నాడు. తన కోసం రేవంత్ పని చేస్తున్నాడని రాహుల్ అనుకుంటున్నాడు. కానీ కాంగ్రెస్ పార్టీలో రెండు నాల్కల ధోరణి ఉంది. మోడీని ఒకరు ప్రశంసిస్తే.. మరొకరేమో ఆయనపై నిప్పులు చెరుగుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత 30 మంది ఎమ్మెల్యేలను తీసుకొని బీజేపీలోకి జంప్ అవుతున్నాడు రేవంత్ రెడ్డి. గత పదేండ్లలో దాదాపు 8 ప్రభుత్వాలను కూలగొట్టారు మోడీ. మోడీ ఎవర్నీ బతకనిస్తలేడు. ప్రతిపక్షాలు ఉంటే జేబులో ఉండాలి లేదంటే జైల్లో ఉండాలి అనేది మోడీ నినాదం. రేవంత్ ఆ భయంతోనే జంప్ అయ్యేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు అని కేటీఆర్ తెలిపారు.
కేసీఆర్ తెలంగాణ కోసం 14 ఏండ్లు కష్టపడడమే కాకుండా, చావు నోట్లో తలపెట్టి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారు. కేసీఆర్ చేతుల్లోనే తెలంగాణ ఉంచాలని చెప్పి 10 ఏండ్లు అవకాశం ఇచ్చారు. కరెంట్, తాగు, సాగు నీటి సమస్యలను పరిష్కరించుకున్నాం. ఇక సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రతి కుటుంబానికి మేలు చేశాం. ఈసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. అధికారంలోకి రావడానికి అరచేతిలో వైకుఠం చూపెట్టి 420 హామీలు ఇచ్చి గద్దెనెక్కారు రేవంత్ రెడ్డి. డిసెంబర్ 9న సీఎం కాగానే 2 లక్షల రుణమాఫీపై సంతకం పెడుతానని చెప్పారు. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు. ఇలా 420 హామీలు అడ్డగోలుగా ఇచ్చి అధికారంలో కూర్చున్నారు. రైతులకు ఇచ్చిన ఒక్క హామీ కూడా అమలు కాలేదు. రుణమాఫీ గురించి ప్రస్తావన లేదు అని కేటీఆర్ గుర్తు చేశారు.
నా ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర జరుగుతుందని రేవంత్ రెడ్డి అంటున్నాడు. నీ ప్రభుత్వం ఐదేండ్లు ఉండాలని కోరుకుంటున్నాం. 420 హామీలు అమలు చేయాలని కోరుతున్నాం. చేయకపోతే మాత్రం వెంటాడుతాం.. వేటాడుతాం.. ప్రజలందర్నీ కూడగట్టి కాంగ్రెస్ పార్టీనే రాజకీయంగానే బొంద పెడుతాం. నీ పక్కకే నల్లగొండ, ఖమ్మం మానవబాంబులు ఉన్నాయి. వాళ్లే నిన్ను ఇబ్బంది పెడుతారు. నీ ప్రభుత్వాన్ని పడగొట్టే ఖర్మ మాకు అవసరం లేదు. ఆటోమేటిక్‌గా నువ్వు ఫెయిల్ అవుతావు.. ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే తెలివి లేదు నీకు. రాష్ట్ర సంపదను పెంచే తెలివిలేదు. ఫోన్ల ట్యాపింగ్స్ మీద పెట్టిన శ్రద్ద వాటర్ ట్యాపింగ్స్ మీద పెట్టు. వాటర్ ట్యాంకర్లు తిరుగుతున్నాయి ఊర్లలో. కేసీఆర్ ఇంటంటికి నీళ్లు ఇచ్చిండు.. ఆ మాదిరిగా నువ్వు కూడా తాగునీళ్లు ఇవ్వు అని కేటీఆర్ సూచించారు.
ఇది కూడా చదవండి:రేవంత్… నీవేమన్నా చెడ్డి గ్యాంగ్ లీడర్ వా..
The post బీజేపీకి లాభం చేసేందుకే కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థులను నిలబెట్టింది appeared first on tnewstelugu.com.