
- పార్టీ ఎంపీ అభ్యర్థిపైనే నేతల తిరుగుబాటు
- మక్తల్, నారాయణపేటలో సంచలనంగా పలువురి రాజీనామాలు
- అదే బాటలో మరికొందరు..
- ఇప్పటికే జితేందర్ జంప్.. శాంతంగా శాంతకుమార్
- అరుణ తీరుపై బీజేపీ క్యాడర్ మండిపాటు
- సీనియర్లకు కాంగ్రెస్ గాలం
మహబూబ్‌నగర్ జిల్లా బీజేపీలో ముసలం రేగుతున్నది. ఆ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ వ్యవహార శైలితో పార్టీని ఒక్కొక్కరుగా వీడుతున్నారు. ఇదివరకే టికెట్ ఆశించి భంగపడిన మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరగా రాష్ట్ర కోశాధికారిగా ఉన్న శాంతకుమార్ కూడా పార్టీ కార్యక్రమాలకు దూరమయ్యారు. బీజేపీకి కంచుకోటగా ఉన్న మక్తల్, నారాయణపేట సీనియర్ నేతలు తాజాగా రాజీనామాలు చేయడంతో పార్టీలో ముసలం బయటపడింది. ఎంపీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ చాలామంది నేతలు డీకే అరుణ తీరుపై తీవ్ర అసహనంతో ఉన్నట్లు సమాచారం. మరోవైపు మహబూబ్‌నగర్, జడ్చర్ల, దేవరకద్ర నియోజకవర్గాల్లోని బీసీ సామాజికవర్గ నేతలు తమను పట్టించుకోవడం లేదనే ఆవేదనతో పార్టీని వదిలి వెళ్తున్నారు. షాద్‌నగర్ నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది. మహబూబ్‌నగర్‌లోనూ అభ్యర్థి ఒంటరి పోకడ సీనియర్ నేతలకు నచ్చడం లేదు. క్యాండిడేట్ కానంతవరకు అందరినీ కలుపుకొనిపోయిన అరుణ అప్పుడే ఎంపీ అయిపోయినట్లుగా వ్యవహరిస్తుండడంతో పార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయి. ఏళ్ల తరబడి పార్టీని తమ భుజాలపై మోసిన నాయకులు చాలామంది పార్టీలో ఉన్నారు. పదవులు ఆశించకుండా పార్టీ వెన్నంటి ఉన్న నేతలను విస్మరించడంతో కమలంలో ఏదో జరుగుతున్నదని భావిస్తున్నారు. మరోవైపు పార్టీ నేతలకు తెలియకుండా ప్రెస్‌మీట్‌లు పెట్టి కాంగ్రెస్ నేతలను ఎడాపెడా తిడుతూ మీడియా ప్రచారానికే పరిమితమవుతున్నారన్న వాదనలు ఉన్నాయి. పార్లమెంట్ సమీక్షలంటూ కేవలం తనవర్గం వారిని మా త్రమే ఆహ్వానిస్తూ మిగతా వారిని విస్మరిస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా పార్టీని చీల్చడానికి ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన మరో నేత ప్రయత్నిస్తున్నట్లు సమాచా రం. మొత్తంగా పాలమూరులో బీజేపీ నేతలు రెడ్డి, బీసీ వర్గాలుగా విడిపోయారని స్పష్టమవుతున్నది.
కమలానికి రాష్ట్ర నేత గుడ్‌బై..
ఉమ్మడి జిల్లాలో పార్టీని పట్టుకొని నెట్టుకొచ్చిన సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా రాజీనామా చేస్తున్నారు. బీజేపీకి మంచి పట్టుఉన్న నారాయణపేట నియోజకవర్గంలోనూ ఇటీవల అసెంబ్లీకి పోటీ చేసి ఓటమిపాలైన ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షుడు రతంగ్ పాండురెడ్డి రాజీనామా చేశారు. మూడు దశాబ్దాలుగా నారాయణపేటలో తిరుగులేని నేతగా ఉన్న తనను కాదని చోటామోటా లీడర్లకు అరుణ ప్రాధాన్యం ఇవ్వడంతో ఆయన తీవ్ర మనస్తాపానికి గురయ్యారట. మూడుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినా ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తూ ఒంటి చేత్తో పార్టీని బతికించారు. అలాంటి సీనియర్ నేత రాజీనామా సమర్పించడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. మరోవైపు బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి రఘురామయ్యగౌడ్, మక్తల్‌లో మంచి పట్టు ఉన్న నేత, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 50వేలకుపైచిలుకు ఓ ట్లు తెచ్చుకున్న మరో రాష్ట్ర నాయకుడు జలంధర్‌రెడ్డి కూడా పార్టీకి రాంరాం చెప్పారు. ఈ రెండు నియోజకవర్గాల్లో సీనియర్ నేతలు రాజీనామా చేయడంతో పార్టీ పరిస్థితి దయనీయంగా మారింది. చిన్నచింతకుంట లో కమలం పార్టీ అంటే నంబిరాజు అనే స్థాయి కి తీసుకుపోయిన మండల అధ్యక్షుడికి ప్రాధాన్యత లభించకపోవడంతో ఆయన దారి చూసుకున్నారు.
డీకేపై జిత్తు స్కెచ్
మహబూబ్‌నగర్ పార్లమెంట్ నుంచి పోటీ చేయాలని భావించిన జితేందర్‌రెడ్డికి బీజేపీ అధిష్టానం టికెట్ ఇవ్వకపోవడంతో ఆయన కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే. నాటి నుంచి బీజేపీకి చెందిన పలువురితో కోవర్ట్ ఆపరేషన్ ప్రారంభించారు. ఒక్కో నియోజకవర్గంలోని తనకు చెందిన నేతలందరినీ కాంగ్రెస్‌లోకి లాగుతున్నారు. అరుణను పాలమూరులో ఓడగొట్టి గద్వాలకు పంపించాలని జితేందర్‌రెడ్డి శపథం పూనినట్లు సమాచారం. ఆమె అధిష్టానానికి పార్టీ ఫం డ్ ఇచ్చి టికెట్ తెచ్చుకున్నదని అప్పట్లోనే ఆరోపించారు. కాగా బీజేపీ నేతలందరినీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడేలోగా కాంగ్రెస్‌లోకి లాగాలని భారీ స్కెచ్ వేశా రు. ఈ క్రమంలోనే మక్తల్, పేట నియోజకవర్గాల్లోని సీనియర్ నేతలతో రాజీనామా చేయించడంలో సఫలీకృతుడయ్యాడు. తన టికెట్‌ను ఎగరేసుకుపోయిన అరుణకు చెక్‌పెట్టేందుకు జితేందర్‌రెడ్డి భారీ వ్యూహం పన్నినట్లు రాజకీయవర్గాల్లో చర్చ కొనసాగుతున్నది.
పాలమూరు మోదీకి అవమానం
ఉమ్మడి జిల్లాలో బీజేపీని తన భుజాలపై మోస్తున్న బీసీ నేతకు ఆ పార్టీలో ఘోర అవమానం చేశారు. 2009 నుంచి టికెట్ ఆశిస్తున్న రాష్ట్ర కోశాధికారి, బీసీ నేత అయిన శాంతకుమార్‌కు టికెట్ ఇవ్వకుండా అధిష్టానం మొండిచేయి చూపిస్తూ వచ్చింది. శాంతకుమార్ తనను తాను పాలమూరు మోదీగా చెప్పుకొంటున్నారు. 2014 నుంచి బీజేపీ వలసవాదులకు టికెట్ ఇస్తూ వస్తున్నది. తెలంగాణ ఆవిర్భావ సమయంలో అప్పుడే వచ్చిన నాగం జనార్దన్‌రెడ్డికి కేటాయించారు. 2018లో గద్వాలలో ఘోరంగా ఓడిపోయి కాంగ్రెస్ నుంచి వచ్చిన అరుణకు 2019లో టికెట్ ఇచ్చారు. అయినా శాంతకుమార్ పార్టీ నిర్ణయాన్ని కాదనలేదు. చివరకు 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ తెలంగాణలో బీసీ నినాదాన్ని పూరించారు. దీంతో ఈసారి తనకే టికెట్ వస్తుందని ఎదురుచూశారు. ఏ చిన్న కార్యక్రమం జరిగినా షాద్‌నగర్ నుంచి మక్తల్ వరకు భారీ ఫ్లెక్సీలతో స్వాగత తోరణాలు కట్టించారు. అయినప్పటికీ ఆయనకు టికెట్ ఇవ్వకుండా అవమానించడంతో ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ అభ్యర్థిగా అరుణను ప్రకటించగా బీసీ నేత శాంతకుమార్‌ను ఆమె పలకరించకపోవడంతో ఆయన మనస్తాపానికి గురైనట్లు తెలిసింది.
అప్పుడే ఎంపీ అయినట్టు..!
మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానానికి ఎన్నికలు నిర్వహించక ముందే అరుణ ఎంపీగా గెలిచినట్లు సంబురపడిపోతున్నారట. కొంతమంది పార్టీ నేతలు, అధికారులతో ‘బిడ్డా నేను రేపు ఎంపీగా గెలుస్తా’.. అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. అనుచరులు సైతం ఆమె ఎంపీ అయినట్లు అప్పుడే ఫీల్ అవుతున్నారట. పార్టీలో సీనియర్ నేతలను పట్టించుకోకపోవడం, ఆర్‌ఎస్‌ఎస్, భజరంగ్‌దళ్, ఏబీవీపీ అనుబంధ సంస్థల్లో పనిచేస్తున్న వారికి విలువ ఇవ్వకపోవడంతో వారంతా బీఆర్‌ఎస్, కాంగ్రెస్‌కు మద్దతు ప్రకటిస్తున్నారని తెలిసింది. మొత్తంగా అరుణను ఓడించేందుకు ఆ పార్టీ నేతలే ప్రయత్నిస్తుండడం చర్చనీయాంశమైంది.