బీజేపీ ప్రభుత్వం దేశంలోని సహకార రంగాన్ని నిర్వీర్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకటరెడ్డి. సిరిసిల్ల పట్టణంలోని లహరి ఫంక్షన్‌హాల్‌లో ఇవాళ( ఆదివారం) తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉపాధి హామీ కార్మికుల జిల్లా స్థాయి సదస్సుకు ఆయన ముఖ్య అథితిగా హాజరై.. మాట్లాడారు.
చారిత్రాత్మకమైన పోరాటాల ఫలితంగా మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరిస్తూ, లిఖిత పూర్వకంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను గుర్తు చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా, వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు పూనుకుందన్నారు. రైతులపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించలేదని, ఆందోళన సందర్భంగా చనిపోయిన 700 మంది రైతు కుటుంబాలకు పరిహారం అందించలేదని ఆరోపించారు.
మోసపూరితంగా వ్యవహరిస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గ్రామాల్లో పనిచేసే కార్మికులకు గడ్డపార, పారలు, చేతి పనిముట్లు ప్రభుత్వమే ఇవ్వాలని, 15 రోజులకోసారి వేతనాలు చెల్లించాలని, చనిపోయిన కార్మికుడి కుటుంబానికి రూ.10లక్షల పరిహారం అందించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఇది కూడా చదవండి: కాంగ్రెస్ పార్టీని గిల్లితే రాష్ట్రంలో బీజేపీ నేతలకు నొప్పి లేస్తోంది
