బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఇవాళ( సోమవారం) ఉదయం దుబాయ్ నుంచి తిరిగివస్తున్న ఆయనను శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. గతేడాది ప్రజాభవన్ దగ్గర జరిగిన ప్రమాదంలో రాహిల్ ప్రధాన నిందితుడు. యాక్సిడెంట్ తర్వాత అతడు దుబాయ్ పారిపోవడంతో పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీచేశారు.
గతేడాది డిసెంబర్ 23న అర్ధరాత్రి రాహిల్ అతివేగంగా కారు నడుపుతూ బేగంపేటలోని ప్రజాభవన్ వద్ద ట్రాఫిక్ డివైడర్లను ఢీకొట్టాడు. ఆ సమయంలో కారులో ముగ్గురు స్నేహితులు ఉన్నారు. తప్పతాగి యాక్సిడెంట్ చేసినట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఆ తర్వాత రాహిల్ తన తండ్రి షకీల్‌తో కలిసి దుబాయ్ పారిపోయాడు. ఈ కేసులో రాహిల్‌ను తప్పించేందుకు మహారాష్ట్రకు చెందిన డ్రైవర్ అబ్దుల్ ఆసిఫ్‌ను పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌కు పంపి కేసు నమోదు చేయించారు.
అయితే ఈ కేసులో రాహిల్‌ను తప్పించేందుకు అప్పటి పంజాగుట్ట ఇన్స్పెక్టర్ దుర్గారావు సహకరించినట్లు బయటపడింది. ఆయన వద్ద స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్లలో లభించిన కాల్‌డేటా ఆధారంగా షకీల్, నిజామాబాద్ ఇన్స్పెక్టర్ ప్రేమ్ కుమార్, మరో ఇద్దరితో మాట్లాడినట్లు ఆధారాలు లభించాయి. దీంతో కేసును తారుమారు చేసేందుకు సీఐలు దుర్గారావు, ప్రేమ్‌కుమార్ జోక్యం చేసుకున్నారని గుర్తించారు. వారిద్దరిని సస్పెండ్ చేయటంతోపాటు అరెస్టు చేసి విచారించారు. మెుత్తంగా ఈ కేసులో 8 మంది అనుమానితులను అరెస్టు చేశారు.
ఇది కూడా చదవండి:వేసవిలో డీహైడ్రేషన్ కు చెక్ పెట్టే ఫుడ్స్ ఇవే.!