బ్రెజిల్ మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో మద్దతుదారులు దేశంలో గందరగోళం సృష్టించారు. తాజా ఎన్నికల్లో తమ నాయకుడు జైర్ బోల్సొనారో ఓటమిని జీర్ణించుకోలేక వేలాది మంది దేశంలోని అతి ముఖ్యమైన ప్రభుత్వ కార్యాలయాలైన అధ్యక్ష భవనం, సుప్రీం కోర్టు, పార్లమెంట్ భవనం వంటి వాటిని ముట్టడించారు. భద్రతా బారికేడ్లను తొలగించిన నిరసనకారులు పెద్ద సంఖ్యలో భవనాల్లోకి ప్రవేశించారు. ప్రేరేపకులు భవనం పైకప్పుపైకి ఎక్కి విధ్వంసం ప్రారంభించారు. లోపల ఉన్న వాటితో పాటు కిటికీలు, తలుపులు ధ్వంసమయ్యాయి. లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన వారం తర్వాత ఈ విధ్వంసకర సంఘటన జరిగింది.
గత అక్టోబర్లో జరిగిన బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల్లో బోల్సోనారో తృటిలో ఓడిపోయారు. అయితే, తన ఓటమిని అంగీకరించని ఆయన ఎన్నికల ప్రక్రియను, సుప్రీంకోర్టును విమర్శించారు. అప్పటి నుంచి కూడా ఆయన మద్దతుదారులు రోడ్లను దిగ్బంధించడం, వాహనాలను తగులబెట్టడం, సైనిక కార్యాలయాల ముందు పెద్దఎత్తున ర్యాలీలు నిర్వహించడం వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. బ్రెజిల్లో ఆదివారం వేలాది మంది ఆందోళనకు దిగారు.
ఆందోళనకారులను అణిచివేసేందుకు పోలీసులు పెద్దఎత్తున టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఆ రాత్రి మీడియా సమావేశంలో బ్రెజిల్ న్యాయ మంత్రి ఫ్లావియో డినో మాట్లాడుతూ నిరసనకారులు ఆక్రమించిన భవనాలను స్వాధీనం చేసుకున్నామని, 200 మందిని అరెస్టు చేశామని చెప్పారు.
The post బ్రెజిల్లో బోల్సోనారో మద్దతుదారుల ఆగ్రహం appeared first on T News Telugu.
