సంగారెడ్డిలో షాదీముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేయకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ను బుధవారం కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. ‘కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది.
- కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు వచ్చేవరకు నేతల అడ్డగింత
- గంటన్నరపాటు వేచిచూసి వెళ్లిపోయిన ఎమ్మెల్యే చింతా
సంగారెడ్డి, జనవరి 10 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డిలో షాదీముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేయకుండా బీఆర్ఎస్ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ను బుధవారం కాంగ్రెస్ నేతలు అడ్డుకున్నారు. ‘కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు ఎలా పంపిణీ చేస్తారు? కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు నిర్మలారెడ్డి వచ్చేవరకు చెక్కులు పంపిణీ చేయొద్దు.
మా మేడం వచ్చిన తర్వాతే లబ్ధిదారులకు చెక్కులు అందజేయాలి’ అని కాంగ్రెన్ శ్రేణులు పట్టుబట్టారు. దీంతో గంటన్నరపాటు వేదికపైనే ఉన్న ఎమ్మెల్యే చింతా ప్రభాకర్.. తాను రెండు చెక్కులు పంపిణీ చేస్తానని, ఆ తర్వాత కాంగ్రెస్ నేతలతో పంపిణీ చేయించాలని అధికారులకు సూచించారు. ఇందుకు స్పందన లేకపోవడంతో ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ చెక్కులు పంపిణీ చేయకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు. కాసేపటి తర్వాత కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు నిర్మలారెడ్డి వచ్చి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ప్రొటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ చెక్కులు పంపిణీ చేయాల్సి ఉండగా.. ఎలాంటి ప్రొటోకాల్ లేని నిర్మలారెడ్డి ఏ హోదాలో చెక్కులు పంపిణీ చేస్తారని సంగారెడ్డి బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు సంగారెడ్డి జిల్లాలో తరచూ ప్రొటోకాల్‌ను ఉల్లంఘిస్తున్నారని, అయినా.. జిల్లా యంత్రాంగం, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు.