పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల మొదటి స్థాయి తనిఖీ ప్రక్రియ సోమవారం మొదలైంది.
- పారదర్శకంగా నిర్వహిస్తున్నాం
- కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్ కలెక్టరేట్, ఫిబ్రవరి 5 : పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల మొదటి స్థాయి తనిఖీ ప్రక్రియ సోమవారం మొదలైంది. ఎన్నికల సంఘం ఆదేశాలతో చేపట్టిన ఈ కార్యక్రమం ఈ నెల 9 వరకు కొనసాగనున్నది. ఈసీఐఎల్ ఇంజినీర్ల బృందం ఆధ్వర్యంలో జిల్లాలోని 2172 బీయూలు, 1781 సీయూలు, 2124 వీవీపాట్‌లను ఐదు రోజుల పాటు క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. వివిధ రాజకీయ పార్టీల సమక్షంలో జరిగే ఈ తనిఖీలు పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు.
ఈవీఎం గోడౌన్‌లో పలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి సోమవారం ఓటింగ్ యంత్రాల తనిఖీని ఆమె పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో అడిషన్ కలెక్టర్ లక్ష్మీకిరణ్, ఇన్‌చార్జి డీఆర్‌వో పవన్‌కుమార్, తహసీల్దార్ రమేశ్, సూపరింటెండెంట్ చరణ్, రాజకీయ పార్టీల ప్రతినిధులు గాలి అనిల్‌కుమార్, మడుపు మోహన్, సత్తినేని శ్రీనివాస్, తిరుమల్‌రెడ్డి, అమీన్, కల్యాడపు ఆగయ్య పాల్గొన్నారు.
