రాష్ట్రంలో కాంగ్రెస్ అడుగుపెట్టడంతోనే మళ్లీ కరువు వచ్చిందన్నారు సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ మెదక్ పార్లమెంటరీ సమావేశంలో హరీశ్‌రావు పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పని అయిపోయిందని.. కాంగ్రెస్‌ను నమ్మి మోసపోయామని ప్రజలు అనుకుంటున్నారన్నారు. కాంగ్రెస్ పాలనలో చిన్నకోడూరులో ఆరుగంటలే కరెంట్ వచ్చేదని.. రూ.90వేలకోట్ల ఖర్చుతో కేసీఆర్ కరెంట్‌ని బాగు చేశారన్నారు. చిన్నకోడూరు మండలంలోనే 12 సబ్‌స్టేషన్లు పెట్టామని.. కేసీఆర్ 24గంటలు కోతల్లేని కరెంటు ఇచ్చారన్నారు. చిన్నకోడూరు నెత్తిమీద రంగ నాయక సాగర్‌ను పెట్టామన్నారు. 90 ఏండ్లు ఎండిన చిన్నకోడూరు పెద్ద చెరువును నింపామని చెప్పారు.
ఎర్రటి ఎండల్లో కూడా చెరువులు మత్తడి దుంకినయని చెప్పారు హరీశ్ రావు. చిన్నకోడూరులో రెండు పంటలు పండించుకున్నారన్నారు. కాంగ్రెస్ హయాంలో గడ్డి కేంద్రాలు పెట్టి పశువులను కాపాడుకున్నామన్నారు. కేసీఆర్ పాలనలోనే పదేళ్లు కరువే లేదని.. కాంగ్రెస్ అడుగుపెట్టింది.. మళ్లీ కరువొచ్చిందన్నారు. మళ్లీ బోర్లలో పూడిక తీసుడు.. కరెంటు మోటర్లు కాలుడు మొదలైందని.. రాష్ట్రంలో లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయన్నారు. ఓడ దాటినంక బోడమల్లన్న అని కాంగ్రెస్ అంటోందని.. ఆరు గ్యారంటీలని నమ్మకలికి కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. ఈసారి తప్పితే కాంగ్రెస్ వాళ్లు ఐదేళ్లు దొరుకరని.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ వాళ్లకు చురక పెడితేనే దారికొస్తారని అన్నారు.
రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపించారు. రూ.2లక్షల రుణమాఫీ కానివాళ్లు బీఆర్‌ఎస్ ఓటేయాలని కోరారు. వరిధాన్యం క్వింటాల్‌కు రూ.2500 ధరతో కొంటామన్నారని.. క్వింటాల్‌కు రూ.2500 ధరతో వరి ధాన్యం కొనాలని నిలదీయాలన్నారు. ఆసరా ఫించన్ రూ.4వేలు ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసిందని.. నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్‌కు అవ్వాతాతలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. జనవరిలో ఇవ్వాల్సిన రూ.2వేల పెన్షన్ కూడా రేవంత్‌రెడ్డి ఎగ్గొట్టారని.. అన్న వస్త్రాల కోసం పోతే ఉన్న వస్త్రాలు ఊడినట్లయ్యిందన్నారు.
రూ.200 ఉన్న పింఛన్ కేసీఆర్ రూ.2వేలకు పెంచారని.. కాంగ్రెస్ వాళ్లు ప్రతినెలా ఆడబిడ్డల ఖాతాల్లో రూ.2500 వేస్తానన్నారని.. ఇప్పటి వరకు పైసా ఇవ్వలేదని గుర్తు చేశారు హరీశ్ రావు. ప్రతి ఆడబిడ్డకు కాంగ్రెస్ నాలుగు నెలల్లో రూ.10వేలు బాకీ పడ్డదని.. రూ.10వేలు ఇచ్చినంకనే ఓటడగాలని కాంగ్రెస్‌ను నిలదీయాలన్నారు. కల్యాణలక్ష్మి లక్షకు తోడు తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసిందని.. కొత్త పథకాల సంగతి తర్వాత ఉన్నవి కూడా రావడం లేదన్నారు. రైతుబంధు ఇప్పటికీ పూర్తి కాలేదని.. నిరుద్యోగులకు నెలకు రూ.4వేలు ఇస్తామని కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఓటేసి గెలిపించాలని కోరారు హరీశ్ రావు.
ఇది కూడా చదవండి: గడ్డం వివేక్ కుటుంబంలో ముగ్గురికి టికెట్లు ఎట్లిస్తరు..?