రైతుల కోసం బీఆర్‌ఎస్ పోరుబాటపట్టింది. రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ ఉదాసీన వైఖరిపై సమరభేరి మోగించింది. అన్నదాతలకు మద్దతుగా బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు దీక్షలు చేస్తున్నారు. సాగునీరు అందక, కరెంటు లేక లక్షలాది ఎకరాల్లో పంటనష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పంట ఎండిపోయిన రైతులకు ఎకరానికి రూ.25 వేలు ఇవ్వాలని, వరి, మక్కలకు క్వింటాల్ కు రూ.500 బోనస్ ఇవ్వాలని, రైతులకు వెంటనే రూ.2 లక్షల రుణమాఫీ చేయాలని, రైతు భరోసా కింద ఎకరానికి రూ.15 వేలు ఇవ్వాలన్నారు. ఎన్నికల హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
సిరిసిల్లలో జరిగిన దీక్షలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన రైతు దీక్షలో ఎమ్మెల్యే హరీశ్ రావు పాల్గొన్నారు. నర్సంపేట పట్టణంలో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో జరిగిన దీక్షలో మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, ఎంపీ మాలోతు కవిత, వర్ధన్నపేట దీక్షలో మాజీ చీఫ్‌విప్ దాస్యం వినయ్ భాస్కర్ పాల్గొన్నారు. అన్ని రకాల పంటలకు రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలోని అంబేద్కర్ చౌరస్తాలో జరిగిన దీక్షలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, బీఆర్‌ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో జరిగిన దీక్షకు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి, రైతులు, బీఆర్‌ఎస్ నేతలు హాజరయ్యారు. నల్లగొండ, నకిరేకల్‌లో మాజీ ఎమ్మెల్యేలు కృష్ణారెడ్డి, చిరుమర్తి లింగయ్య పాల్గొన్నారు. జనగామ ఆర్టీసీ జరిగిన దీక్షలో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్ భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. ఎండిపోయిన పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని పల్లా రాజేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువన్నారు. సాగునీరు అందక వేల ఎకరాల్లో పంట ఎండిపోయి రైతులు అరిగోస పడుతున్నారని చెప్పారు. హామీ ప్రకారం వరికి క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వాలన్నారు. సాగునీరు అందక ఎండిపోయిన పంటలకు ఎకరాకు రూ.25 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 9న రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారని, అది ఇప్పటివరకు అమలు నోచుకోలేదని విమర్శించారు.
ఇది కూడా చదవండి: కాంగ్రెస్ పాలన అలీబాబా 40 దొంగల ముఠాగా తయారైంది