మెదక్ పార్లమెంట్ స్థానం బీఆర్‌ఎస్ పార్టీ అడ్డా. మెదక్‌లో వెంకట్రామి రెడ్డి ఘన విజయం సాధించబోతున్నారు. 2004 నుంచి మెదక్‌లో బీఅర్ఎస్ పార్టీ గెలుస్తున్నదని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు.ఇవాళ(బుధవారం) పటాన్ చెరువు మండలం రుద్రారం గ్రామ పరిధిలోని శ్రీ సిద్ది గణపతి దేవాలయం (గణేష్ గడ్డ) ఆవరణలో బీఆర్‌ఎస్ మెదక్ లోక్‌సభ ఎన్నికల ప్రచార రథాలను ప్రారంభించారు. ఆ తర్వాత మాట్లాడిన హరీశ్ రావు..
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిరిసిల్లలో వడ్ల బోనస్ గురించి మాట్లాడితే రేవంత్ రెడ్డి డ్రాయర్ ఊడదీస్తా అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వు సీఎంవా.. చెడ్డి గ్యాంగ్ లీడర్‌వా రేవంత్ రెడ్డి అంటూ ఫైర్ అయ్యారు. ఎన్నికల ముందు తియ్యగా నోటితో మాట్లాడిన రేవంత్ ఇప్పుడు నొసటితో వెక్కిరిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పాలపొంగులాగా ఉందన్నారు. ఎంత స్పీడ్‌గా కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పెరిగిందో అంతే వేగంతో గ్రాఫ్ పడిపోయిందన్నారు. కాంగ్రెస్ పార్టీ 100 రోజుల పాలనలో అన్నివర్గాల్ని మోసం చేసిందన్నారు. ఏ మొహం పెట్టుకొని ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడుగుతుందని ప్రశ్నించారు. కాంగ్రెస్ అభయహస్తం అక్కరకు రాని హస్తంలాగా తయారైందన్నారు.
గులాబీ జెండా పుట్టినప్పటి నుంచి మెదక్ పార్లమెంట్ స్థానాన్ని బీఅర్ఎస్ గెలుస్తున్న విషయాన్ని గుర్తు చేశారు హరీశ్ రావు. మళ్లీ మెదక్ పార్లమెంట్‌లో తిరుగులేని మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదు. ఓట్ల కోసం ప్రజలను నమ్మించి మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.4 వేల పింఛన్లు, రైతుబంధు, మహిళలకు రూ.2,500 ఇలా ఇచ్చిన హామీలన్నీ మర్చిపోయారని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ రైతులకు గారడి మాటలు చెప్పారన్నారు హరీష్ రావు. రేవంత్ రెడ్డి కేసీఆర్ పై తిట్ల పురాణం మొదలు పెట్టారన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసింది.. రేవంత్ రెడ్డి తిట్ల కోసమా ? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫేక్ వార్తలు, లీకులతో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. రైతులను పట్టించుకోలేదని చెప్పారు.
వెంకట్రామిరెడ్డి అధికారిగా మెదక్ జిల్లా ప్రజలకు సేవ చేశారని తెలిపారు. తెల్లాపూర్‌లోనే నివాసం ఉంటారు..మంచి మనిషి, పరిపాలన అనుభవం ఉండి ప్రజలకు అందుబాటులో ఉండే వెంకట్రామిరెడ్డిని గెలిపించాలని కోరారు. దుబ్బాక ప్రజలు బీజేపీ అభ్యర్ధి రఘునందన్‌రావును చిత్తు చిత్తుగా ఓడించారని అంటూ పదేళ్ల బీజేపీ పాలనలో ప్రజలకు చేసింది ఏమీలేదన్నారు.
భవిషత్తు అంతా బీఅర్ఎస్ పార్టీ దేనని స్పష్టం చేశారు. మళ్లీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీయేనని, మన ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేసే వెంకట్రామి రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు హరీశ్ రావు.
ఇది కూడా చదవండి: రేవంత్ రెడ్డిలో కలవరం..కుట్ర పన్నుతున్న కాంగ్రెస్..సర్వేలో విస్తుపోయే నిజాలు.!
The post రేవంత్… నీవేమన్నా చెడ్డి గ్యాంగ్ లీడర్ వా.. appeared first on tnewstelugu.com.