హైదరాబాద్ ఇందిరాపార్క్ ధర్నా చౌక్ దగ్గర ఇవాళ(శుక్రవారం) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేపట్టిన దీక్ష ముగిసింది. నియామకాల్లో మహిళలకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా దీక్షకు దిగారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆడబిడ్డల వాటా రావాల్సిందేనన్నారు. ఆడబిడ్డల హక్కులను కాలరాసే జీవో-3ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గురుకుల అభ్యర్థుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలన్నారు. స్పెషల్ డ్రైవ్ పెట్టి నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. జీవో 3 విషయంలో గవర్నర్ స్పందించి న్యాయం చేయాలన్నారు. మహిళలకు 33 శాతం ఉద్యోగాలు కొనసాగించాలని ఎమ్మెల్సీ కవిత ప్రభుత్వాన్ని కోరారు.
తొందరపాటు నిర్ణయాలు తీసుకొని పూటకో మాట మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి రేసు గుర్రం కాదు.. గుడ్డిగుర్రంలా కనిపిస్తున్నారని విమర్శించారు ఎమ్మెల్సీ కవిత. కేసీఆర్ ను ఆడిపోసుకోవడం మానేసి ఆడబిడ్డలకు అన్యాయం చేసే జీవో3ను వెనక్కి తీసుకోవాలని ధర్నా చౌక్ వేదికగా డిమాండ్ చేశారు. ఎవరైనా ధర్నాలు చేసుకోవచ్చునని చెప్పి.. మూడు రోజులు నాన్చి ఆలస్యంగా పర్మిషన్ ఇచ్చారని కవిత ఆరోపించారు. ఇదేనా ప్రజా పాలన అంటే..? అని ఆమె ప్రశ్నించారు. ధర్నాకు హాజరయ్యేందుకు వస్తున్న ఆడబిడ్డలను అరెస్ట్ చేస్తే సమస్య పరిష్కారం కాదని గుర్తుంచుకోవాలని కవిత ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: ఉద్యోగులను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు
