ఉద్యాన రైతుల ఆదాయం మూడింతలు పెంచే లక్ష్యంతో ప్రత్యేక ప్రణాళిక అమలు చేయనున్నట్లు ఆయిల్‌ఫెడ్ ఎండీ, ఉద్యానశాఖ డైరెక్టర్ కె.అశోక్‌రెడ్డి తెలిపారు. మంగళవారం అశ్వరావుపేట మండలంలో విస్తృతంగా పర్యటించిన ఆయన స్థానిక పామాయిల్ ఫ్యాక్టరీలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
- సాగు విస్తరణకు అనుగుణంగా ఫ్యాక్టరీల నిర్మాణం
- ఉద్యానశాఖలో త్వరలో 19 పోస్టులు భర్తీ
- ఆయిల్‌ఫెడ్ ఎండీ, ఉద్యానశాఖ డైరెక్టర్ అశోక్‌రెడ్డి
అశ్వారావుపేట, ఏప్రిల్ 16 : ఉద్యాన రైతుల ఆదాయం మూడింతలు పెంచే లక్ష్యంతో ప్రత్యేక ప్రణాళిక అమలు చేయనున్నట్లు ఆయిల్‌ఫెడ్ ఎండీ, ఉద్యానశాఖ డైరెక్టర్ కె.అశోక్‌రెడ్డి తెలిపారు. మంగళవారం అశ్వరావుపేట మండలంలో విస్తృతంగా పర్యటించిన ఆయన స్థానిక పామాయిల్ ఫ్యాక్టరీలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ఆయిల్‌పాం సాగు ప్రాజెక్టు విజయవంతంగా సాగుతున్నట్లు తెలిపారు. ఆయిల్‌పాం రైతుల అభివృద్ధి, సంక్షేమం, అనుబంధ రంగాల పురోగతికి అధిక ప్రాధాన్యమిస్తున్నట్లు వివరించారు. రాష్ట్రంలో వ్యవసాయం పట్ల రైతులతోపాటు ఉద్యోగులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని, అందుకే వ్యవసాయ భూముల ధరలు భారీగా పెరిగాయని చెప్పారు. పెరుగుతున్న సాగు విస్తరణకు అనుగుణంగా ఫ్యాక్టరీల నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో సరైన సౌకర్యాలు లేకనే రైతు కుటుంబాలు పట్టణాలకు వలస వెళ్తున్నారని, దీనిని దృష్టిలో పెట్టుకుని పల్లెల్లోనూ ఉద్యాన సాగుకు అవసరమైన ఆధునిక సాంకేతిక పరికరాలను అందుబాటులో ఉంచడానికి దృష్టి సారిస్తున్నామని చెప్పారు. త్వరలో ఉద్యానశాఖలో 19 పోస్టులను భర్తీ చేయనున్నామని, దీని ద్వారా ఉద్యోగుల కొరత కూడా తీరుతుందని చెప్పారు. మండలంలో విస్తృతంగా పర్యటించిన ఎండీ అశోక్‌రెడ్డి పామాయిల్ మొక్కల పెంపకం, ఫ్యాక్టరీలో గెలల క్రసింగ్, ఆయిల్ రివకరీ, ఉప ఉత్పత్తులు, కొత్త ఫ్యాక్టరీ నిర్మాణాలను క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారు. ఆయిల్‌పాం రైతు సమస్యలపై అశ్వారావుపేట జోన్ ఆయిల్‌పాం గ్రోవర్స్ సొసైటీ అధ్యక్ష, కార్యదర్శులు టి.మహేశ్వర్‌రెడ్డి, కె.పుల్లయ్య వినతిపత్రం అందజేశారు. ఆయన వెంట ఆయిల్‌ఫెడ్ జనరల్ మేనేజర్ టి.సుధాకర్‌రెడ్డి, పీఅండ్‌పీ మేనేజర్ శ్రీకాంత్‌రెడ్డి, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉద్యానాధికారులు రమణ, సూర్యనారాయణ, ఖమ్మం ఆయిల్‌ఫెడ్ మేనేజర్ భారతి, డివిజనల్ ఆఫీసర్ ఆకుల బాలకృష్ణ, రైతులు ఆలపాటి రామచంద్రప్రసాద్, వెంపాటి లక్ష్మీనారాయణ, నాగబాబు, కేవీ సత్యనారాయణ, జగన్, ప్రసాద్ ఉన్నారు.
నాణ్యమైన గెలలను తీసుకురావాలి
దమ్మపేట, ఏప్రిల్ 16 : పూర్తిగా పక్వానికి వచ్చిన పామాయిల్ పండ్ల గెలలను ఫ్యాక్టరీకి తీసుకొచ్చి అత్యధిక ఓఈఆర్ పొందాలని టీఎస్ ఆయిల్‌ఫెడ్ ఎండీ అశోక్‌రెడ్డి రైతులకు సూచించారు. అప్పారావుపేట పామాయిల్ ఫ్యాక్టరీని మంగళవారం సందర్శించారు. పక్వానికి వచ్చిన గెలల బరువు సైతం పచ్చి గెలల కంటే అధికంగా వస్తుందని రైతులకు అవగాహన కల్పించాలని ఆయిల్‌ఫెడ్ అధికారులకు సూచించారు.