
వనపర్తి : లాభసాటి వ్యవసాయంపై రైతులు దృష్టి సారించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సూచించారు. సంప్రదాయ వ్యవసాయం నుంచి రైతులు బయటకు రావాలని పిలుపునిచ్చారు. పెద్ద మందాడి మండలం చిన్నమందడి గ్రామంలో నాలుగు ఎకరాల్లో సీతాఫల తోట వేసిన శ్రీకాంత్ రెడ్డి అనే రైతు శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రిని కలిసి సీతాఫలాన్ని అందజేశారు. ప్రత్యామ్నాయ పంటలు వేసిన రైతులను మంత్రి అభినందించారు.
ఈ సందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ నూనెగింజలు, అపరాలు, ఉద్యానవన పంటల ద్వారా రైతులకు ఎంతో ఆదాయం వస్తుందన్నారు. మార్కెట్ డిమాండ్‌కు అనుగుణంగా పంటలు వేసుకోవాలని సూచించారు. నగరాలు, పట్టణాలకు దగ్గరగా ఉన్న రైతులు ప్రణాళికాబద్ధంగా కూరగాయల సాగును ఎంచుకోవాలి. నాణ్యమైన మొక్కల నార్లు ఉద్యానవన శాఖ ద్వారా సబ్సిడీపై అందజేస్తున్నట్లు తెలిపారు. రైతులు వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారుల సలహాలు, సూచనలు పాటించాలన్నారు. ప్రతి 5 వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారి ఉండవచ్చని మంత్రి తెలిపారు. మంత్రి నిరంజన్ రెడ్డి ప్రోత్సాహంతో 200 మంది రైతులు కూరగాయల సాగుపై దృష్టి సారించారు.
