దేశంలోనే అత్యున్నత విద్యాసంస్థలైన ఐఐటీలు కొత్త కోర్సులను అందుబాటులోకి తెస్తున్నాయి. 2024-25 విద్యాసంవత్సరంలో పలు కోర్సులను ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయి.

- 2024-25లో పెరగనున్న నాలుగు వేల సీట్లు
- ఇండస్ట్రీ ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్‌పై ఆఫర్
IIT | హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): దేశంలోనే అత్యున్నత విద్యాసంస్థలైన ఐఐటీలు కొత్త కోర్సులను అందుబాటులోకి తెస్తున్నాయి. 2024-25 విద్యాసంవత్సరంలో పలు కోర్సులను ప్రారంభించేందుకు సిద్ధమయ్యాయి. కొత్త కోర్సులు, సీట్ల సంఖ్య పెంపుదలతో వచ్చే విద్యాసంవత్సరంలో 4 వేల వరకు సీట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉన్న ది. ఇంజినీరింగ్ ఫిజిక్స్ పేరుతో నూతన బీటె క్ డిగ్రీని ఐఐటీ తిరుపతి అందుబాటులోకి తీసుకురానున్నది. 2024-25 విద్యా సంవత్సరంలో 10 సీట్లతో ఈ కోర్సును అందుబాటులోకి తీసుకురానున్నారు. కోర్సుకు డిమాండ్‌ను బట్టి సీట్ల సంఖ్యను పెంచుతారు. క్వాంటం సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్సును ఐఐటీ బాంబే ప్రవేశపెట్టనున్నది.
ఇంటర్ డిసిప్లినరీ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రాం కింద ఈ కోర్సును అందుబాటులోకి తీసుకొస్తారు. ఈ-మొబిలిటీ, మెడికల్ ఇంజినీరింగ్, సస్టెనబిలిటీ (సుస్థిరాభివృద్ధి) కోర్సులను ఐఐటీ మద్రాస్ వచ్చే విద్యాసంవత్సరం నుంచి అందుబాటులోకి తేనున్నది. ఐఐటీ మద్రాస్‌లో సస్టెనబిలిటీ (సుస్థిరాభివృద్ధి) కోర్సును మైనర్‌గా ప్రవేశపెట్టారు. జర్మనీ యూనివర్సిటీ సహకారంతో వాటర్ సెక్యూరిటీ అండ్ గ్లోబల్ చేంజ్ కోర్సునూ జాయింట్ మాస్టర్స్ ప్రోగామ్‌గా ప్రారంభించనున్నారు. ఐఐటీ హైదరాబాద్‌లో ఇంటర్ డిసిప్లినరీ పీహెచ్‌డీ కోర్సుల్లో కొలాబరేటివ్ రీసెర్చ్‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంట్లో భాగంగా కంప్యూటర్ సైన్స్ విభాగం విద్యార్థులు ఎలక్ట్రానిక్స్ విభాగం వారితో కలిసి రీసెర్చ్ చేస్తారు.
తగ్గనున్న కటాఫ్ మార్కులు
జాతీయ స్థాయిలోని ఐఐటీల్లో ఇప్పటివరకు 17,385 సీట్లు ఉన్నాయి. మరో 7,456 సీట్లు ఎన్‌ఐటీల్లో అందుబాటులో ఉన్నాయి. ఖరగ్‌పూర్‌లో 1,869, వారణాసిలో 1,589, బాంబేలో 1,356, రూర్కీలో 1,353, హైదరాబాద్‌లో 595 సీట్లు ఉన్నాయి. కొత్త సీట్లు చేరడంతో కటాఫ్ స్కోర్ తగ్గి, మరింత మందికి సీట్లు అందుబాటులోకి వస్తాయి.